హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో చక్కని గ్రీన్ కవర్ ఉన్నదని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవాన్ని ఉద్దేశించి మంత్రి ట్వీట్ చేశారు. హరితహారం అద్భుత ఫలితాలతో 7.7 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల ఇది సాధ్యం అయ్యిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,864 నర్సరీలు, 19,472 పల్లె ప్రకృతి వనాలు అభివృద్ధి చేశామని వెల్లడించారు. 13.44 లక్షల ఎకరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 273 కోట్ల మొక్కలు నాటించామని పేర్కొన్నారు. కేసీఆర్ వంటి నిజమైన పర్యావరణవేత్తకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కొనియాడారు. నేడు తెలంగాణ ఏం చేస్తుందో రేపు దేశం అదే అనుసరిస్తుందని చెప్పారు.