హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ క్రెడిట్ కార్డుతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకుకు ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి రూ.4.33 కోట్ల టోకరా వేశాడు. సోమాజిగూడలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకు కార్పొరేషన్లో నగరానికి చెందిన కిండ్రిల్ సొల్యూషన్స్ సంస్థ కార్పొరేట్ క్రెడిట్ కార్డు సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకోవడంతో డిసెంబర్ 2022లో అనుమతిచ్చింది. అందులో ఆ సంస్థ ఉద్యోగులకు ఈ బ్యాంకు నుంచి కార్పొరేట్ క్రెడిట్‌కార్డులు జారీ అవుతాయి. ఇందులో భాగంగా ఆ సంస్థలో పనిచేసే యార్లగడ్డ ప్రదీప్‌కు కార్డు జారీ అయ్యింది. ఈ కార్డుకు లిమిట్ లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రదీప్ బ్యాంకింగ్ అలర్ట్ సిస్టమ్‌ను తప్పుదోవ పట్టిస్తూ, సీఆర్ఈడీ అప్లికేషన్‌ను ఉపయోగించి రూ.4,33,52,612 వాడుకున్నాడు. ఒక వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో ఎలా వాడాడు? రిపేయిమెంట్ సిస్టం ఎలా ఉంది? అని ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. సదరు ఉద్యోగి గురించి ఆరా తీయగా, అతను విధుల్లోకి రావడం లేదని తేలింది.