గోదావరికి భారీగా వరద
ఎగువ రాష్ర్టాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. గోదావరికి వరద పోటెత్తుతున్నది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది.
- లక్ష్మీబరాజ్‌కు 3 లక్షల క్యూసెక్కులు
- భద్రాచలం వద్ద 40.20 మీటర్ల ప్రవాహం
- జూరాలకు 60 వేల క్యూసెక్కులు
- హెడ్‌క్వార్టర్స్ విడిచిపెట్టవద్దు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్/న్యూస్‌నెట్‌వర్క్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఎగువ రాష్ర్టాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. గోదావరికి వరద పోటెత్తుతున్నది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. స్థానికంగా కురిసిన రికార్డుస్థాయి వర్షాలతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి క్యాచ్మెంట్ ఏరియాల నుంచి గోదావరికి భారీగా వరద వస్తున్నది. శుక్రవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ప్రవాహం 43 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 40.20 మీటర్ల మేరకు ప్రవాహం కొనసాగుతున్నది.
మేడిగడ్డ బరాజ్‌కు పెరిగిన వరద
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్‌లో వరద ఉధృతి పెరుగుతున్నది. శుక్రవారం మేడిగడ్డ బరాజ్‌కు 1,93,550 క్యూసెక్యుల ప్రవాహం వస్తున్నది. బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బరాజ్‌కు 15 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నట్టు అధికారులు తెలిపారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద 2.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
మేడిగడ్డపై ఆగని అసత్య ప్రచారాలు
మేడిగడ్డ బరాజ్‌పై అసత్య ప్రచారాలు ఆగడం లేదు. బరాజ్‌లో గత ఆక్టోబర్ 21న 20 పియర్ కుంగుబాటుకు గురికాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు మరమ్మతు పనులు పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం బరాజ్‌లో మరమ్మతు పనుల్లో భాగంగా గ్రౌటింగ్ చేసిన 20, 21 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని పుకార్లు చెకర్లు కొట్టాయి. దీంతో భారీ నీటి పారుదల శాఖ అధికారులు బరాజ్ వద్ద పరిస్థితిని, గ్రౌటింగ్ చేసిన పియర్లను పరిశీలించి ఎలాం టి కుంగుబాటు జరగలేదని నిర్ధారించారు.
గోదావరిలో వ్యక్తి గల్లంతు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక పంచాయతీ తానిపర్తికి చెందిన బానారి రాజు (45) గోదావరిలో గల్లంతయ్యాడు. గురువారం ఉద యం చేపల వేటకు వెళ్లిన రాజు శుక్రవారం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజు ఆచూకీ కోసం గ్రామస్థులు పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు కూడా ఘటనా స్థలికి వెళ్లి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
జూరాలకు భారీగా వరద
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం క్రమం గా పెరుగుతున్నది. శుక్రవారం ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద వచ్చి చేరుతున్నది. నారాయణపూర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తారు.
సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల
ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ డ్యామ్ ఎడమ కాల్వకు ఎన్ఎస్పీ అధికారులు శుక్రవారం నీటిని విడుదలచేశారు. పాలేరు రిజర్వాయర్‌ను నింపేందుకు తొలిరోజు 500 క్యూసెక్కులతో ప్రారంభించి, క్రమంగా పెంచుకుంటూ రోజుకు 4,000 క్యూసెక్కల చొప్పున 4 రోజులపాటు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు.
హెడ్‌క్వార్టర్స్ విడిచిపెట్టవద్దు: మంత్రి ఉత్తమ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట దుర్ఘటన, భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదయ్యే హెచ్చరికల నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్లు, కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను విడిచిపెట్టవద్దని సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. రాబోయే 48 గంటలలో భారీ, అతి భారీ వర్షాలు రానున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

