
జమ్మికుంట, అక్టోబర్ 18: హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కసుబోజుల వెంకటేశ్వర్లు (ఎన్ఎస్యూఐ వెంకన్న), మంజుల (మాజీ వైస్ ఎంపీపీ)తోపాటు మున్సిపాలిటీలోని దాదాపు 200 మంది నాయకులు సోమవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం పోకడ, ఉప పోరులో అభ్యర్థి ఎంపికను నిరసిస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేసి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణకు లేఖలు పంపినట్టు వారు వివరించారు. ఈ సందర్భంగా కసుబోజుల వెంకన్న మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీ అభ్యర్థి ఈటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. స్థానికేతరుడికి టికెట్ ఇచ్చారని, నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో పనిచేయలేమని, అందరం రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు.
అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టినా పార్టీలో ఎలాంటి మార్పు లేదని, ఈటలతో రేవంత్ కుమ్మక్కయ్యారని ప్రజలు చర్చించుకోవడం తట్టుకోలేక పోతున్నామని వాపోయారు. తమ భవిష్యత్‌పై సమిష్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఎండీ సలీం, పట్టణ అధికార ప్రతినిధి యెగ్గని శ్రీనివాస్, నాయకులు మల్లయ్య, నాగేంద్ర, రాజమౌళి, అంజి, శంకర్, తదితరులు పాల్గొన్నారు. వీరంతా మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో జమ్మికుంటలో కాంగ్రెస్ ఖాళీకానున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.