Bio Asia 2023 | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనే కాదు.. హెల్త్ టెక్నాలజీలోనూ తెలంగాణను అగ్రగామి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఈ ఆశయంలో భాగంగానే జీవ, వైద్యశాస్త్ర రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నది. టీ-హబ్ తరహాలో ఇంక్యుబేషన్ సెంటర్లనూ తెస్తుండగా, ఆయా రంగాల్లోని నిపుణులను వీటిల్లో మార్గదర్శకులు(మెంటార్స్)గా పెడుతూ యువ ఆవిష్కర్తలకు చేయూతనిస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): హెల్త్‌టెక్ తెలంగాణ ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జీవ, వైద్య రంగాల్లో ఔత్సాహికులు చేసే ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా టీ-హబ్ తరహాలో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. ఏడాది పొడవునా ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగానే జీవ, వైద్య శాస్ర్తాలకు సంబంధించిన ఇంక్యుబేషన్ సెంటర్లు 18 వరకు ఉన్నాయి.
వీటిలో హెల్త్‌టెక్, మెడిటెక్, బయోటెక్ పేర్లతో స్టార్టప్‌లను స్థాపించేందుకు అవసరమైన మౌలిక వసతులను, ఆర్థిక సహకారాన్ని, ఆయా రంగాల్లో నిపుణులను మార్గదర్శకులు (మెంటార్స్)గా అందుబాటులో ఉంచుతున్నారు. ఏటా నగరం వేదికగా జరుగుతున్న బయో ఏషియా సదస్సులోనూ స్టార్టప్‌లు తమ సత్తాను చాటుకుంటున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు హెచ్ఐసీసీ వేదికగా జరిగే బయో ఏషియా సదస్సులో టీ-హబ్, ట్రిపుల్ ఐటీ-సీఐఈ ఇంక్యుబేటర్ సెంటర్లలోని స్టార్టప్‌లు తమ స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఆవిష్కరణలకు ఊతం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జీవ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ-హబ్, అటల్ ఇన్నోవేషన్ సెంటర్లు ఒక్కటై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి అయోగ్‌లు టీ-హబ్‌తో కలిసి స్టార్టప్‌లను వివిధ దశల్లో సహకరించేందుకు ఏటా రెండు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన స్టార్టప్‌లకు వర్క్‌షాపులు నిర్వహించడం, నిపుణులతో మెంటార్షిప్, మార్కెట్ యాక్సెస్, పెట్టుబడిదారులు, పరిశ్రమలతో అనుసంధానం చేసేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని ఏఐసీ-టీ-హబ్ ఫౌండేషన్ సీఈవో రాజేష్ అడ్ల తెలిపారు.
‘తాము రెండేండ్లుగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మొత్తం 500కుపైగా స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులు రాగా, అందులో 40 స్టార్టప్‌లను ఎంపిక చేశాం. ఈ స్టార్టప్‌లు వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన డాటా డిజిటలైజేషన్, ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెక్షన్, నాన్ ఇన్వాసిస్ మెడికల్ డివైజెస్, కెపాసిటీ బిల్డింగ్, డయాగ్నస్టిక్ టూల్స్ ఫర్ సీవీడీ, క్యాన్సర్, కంటి సమస్యలు, హెల్త్‌కేర్ వర్కర్స్కు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్నాయి’ అన్నారు. హెల్త్‌కేర్ రంగంలో ఉన్న స్టార్టప్‌లకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో..
మెడిటెక్, హెల్త్‌టెక్ విభాగాల్లో స్టార్టప్ కార్యకలాపాలు సాగిస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలకు గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ-సీఐఈ ఇంక్యుబేషన్ సెంటర్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ స్టార్టప్‌లతోపాటు వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఓజాస్ మెడిటెక్ బయోనెస్ట్ పేరుతో యాక్సిలరేటర్‌ను ఏర్పాటుచేసింది. వైద్య రంగానికి సంబంధించిన అన్ని అంశాలు ఒకేచోట తెలుసుకొనేలా ఈ సెంటర్ పనిచేస్తుంది. భారత్‌లో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌పై దాని నిపుణులతో సమావేశాలు, ప్రోటోకాల్ రైటింగ్, క్లినికల్ ట్రయల్స్‌పై సహకారం అందించేలా ఆయా స్టార్టప్‌లకు ప్రత్యేకంగా శిక్షణనిస్తూ వాటి కార్యకలాపాలను వేగవంతం చేసి, మార్కెట్లోకి వెళ్లేందుకు వీలుగా అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారు. ఇలా టీ-హబ్, ట్రిపుల్ ఐటీలోనే కాకుండా ఇతర సంస్థల్లో జీవ, వైద్య రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు నగరంలో పలు ఇంక్యుబేషన్ సెంటర్లు పనిచేస్తున్నాయి.