రాష్ట్రంలో 15 విశ్వవిద్యాలయాలకు న్యాక్ గుర్తింపు
అటానమస్‌లో 14, డిగ్రీలో 224 కాలేజీలకు గ్రేడ్లు
ఉన్నత విద్యామండలి ప్రోత్సాహం, ఆర్థిక సహాయం
30 కాలేజీల ప్రిన్సిపాళ్లతో 20న ప్రత్యేక సమావేశం
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు న్యాక్ గుర్తింపు దక్కించుకోవడంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. మరిన్ని విద్యాసంస్థలు న్యాక్ గుర్తింపు దక్కించుకొనేలా ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నది. కనీసం తాత్కాలిక గుర్తింపునైనా సాధించాలని సహకరిస్తున్నది. న్యాక్ గుర్తింపు కోసం సన్నద్ధమయ్యేందుకు కాలేజీలకు ఆర్థిక సహకారం కూడా అందిస్తున్నది. సెల్ఫ్ స్టడీ రిపోర్టుల తయారీకి వర్సిటీలకు రూ.2 లక్షలు, కాలేజీలకు రూ.1 లక్ష వరకు అధికారులు గ్రాంట్‌గా ఇస్తున్నారు. మరికొన్ని కాలేజీలను ప్రోత్సహించడంలో భాగంగా నెల 20న న్యాక్ బెంగళూరు డైరెక్టర్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 30 కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆహ్వానించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 14 అటానమస్ కాలేజీలు, 223 డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందాయి. వీటిలో 68 ప్రభుత్వ కాలేజీలున్నాయి. ఇక సంప్రదాయ కోర్సులను నిర్వహిస్తున్న వర్సిటీలను తీసుకొంటే ఒక్క శాతవాహన మినహా, అన్ని వర్సిటీలు న్యాక్ గుర్తింపు దక్కించుకున్నాయి. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నది.
తాత్కాలిక గుర్తింపు సైతం..
ఉన్నత విద్యాసంస్థలు, వర్సిటీలకు పూర్తిస్థాయి గుర్తింపే కాకుండా తాత్కాలిక గుర్తింపును సైతం జారీ చేస్తున్నారు. ఎన్ఈపీలో భాగంగా అన్ని విద్యాసంస్థలు న్యాక్ గుర్తింపును దక్కించుకునేందుకు కేంద్రం తాత్కాలిక గుర్తింపును తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకు న్యాక్ ఇటీవలే మార్గదర్శకాలు జారీచేసింది. స్థాపించిన ఏడాది తర్వాత ఏ విద్యాసంస్థ అయినా న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో విద్యాసంస్థ ఏర్పాటైన ఆరేండ్ల తర్వాత న్యాక్ గుర్తింపునకు వెళ్లాల్సి ఉండగా, దానిని సవరించారు. పూర్తిస్థాయి గుర్తింపు కోసం విద్యాసంస్థలను సంసిద్ధం చేసేందుకే న్యాక్ తాత్కాలిక గుర్తింపునిస్తున్నది. తాత్కాలిక గుర్తింపు లభించిన తర్వాత రెండేండ్ల వరకు గుర్తింపునిచ్చి, లోపాలను సవరించుకొనే అవకాశాన్నిస్తారు. అంతా సవ్యంగా ఉంటే నాలుగేండ్లు గుర్తింపునిస్తారు. లోపభూయిష్టంగా ఉంటే గుర్తింపును రద్దుచేస్తారు.