New Cabinet | హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రితోపాటు 12 మంది మంత్రులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ వారికి ఇంకా శాఖలు కేటాయించలేదు. ఎప్పుడు కేటాయిస్తారనే అంశంపై స్పష్టత లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయా మంత్రులకు శాఖలు కేటాయించినట్టుగా ప్రచారం జరుగుతున్నది. కానీ, శాఖల కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.
కాగా క్యాబినెట్లో మరో ఆరుగురికి స్థానం కల్పించడానికి వెసులుబాటు ఉన్నది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రితోపాటు మొత్తం 18 మందికి చోటు కల్పించే అవకాశం ఉంటుంది. మిగిలిన ఆరుగురిని క్యాబినెట్లోకి ఎప్పుడు తీసుకుంటారనే అంశంపై స్పష్టత లేదు. దీనిపై గురువారం రాత్రి జరిగిన తొలి మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబును ప్రశ్నించగా.. ఈ విషయం తన పరిధిలో లేదని, జవాబు చెప్పలేనని, ముఖ్యమంత్రి, అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.