హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా జననాల సంఖ్య తగ్గుతుండటంతో బడిలో చేరేవారి సంఖ్య కూడా ఏటేటా అదేతీరులో తగ్గిపోతున్నది. యువ జంటలు పిల్లలను ఆలస్యంగా కనడం లేదా ఒకే బిడ్డకు పరిమితం అవుతుండటం వంటి పరిణామాలు జననాల సంఖ్య తగ్గుదలకు కారణమవుతున్నాయి. గత కొన్నేండ్లుగా 1-8 తరగతుల్లో ఎన్రోల్మెంట్స్ తగ్గిపోతున్నట్టు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) అధ్యయనంలో వెల్లడైంది. 2025 నాటికి ఈ సంఖ్య మరింత తగ్గుతుందని ఎన్సీఈఆర్టీ అంచనా వేసింది. ఎన్సీఈఆర్టీ అంచనా ప్రకారం తెలంగాణలో 2016లో 1-8 తరగతుల్లో 48 లక్షల విద్యార్థులు నమోదు కాగా, 2025 నాటికి ఈ సంఖ్య 40 లక్షలకు పరిమితం కానున్నది. అంటే తొమ్మిదేండ్ల కాలంలో విద్యార్థుల ఎన్రోల్మెంట్స్ దాదాపు 8 లక్షలు తగ్గిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 2025 నాటికి విద్యార్థుల ఎన్రోల్మెంట్లో తగ్గుదల కోటి వరకు ఉంటుందని అంచనా. ‘ప్రొజెక్షన్ అండ్ ట్రెండ్స్ స్కూల్ ఎన్రోల్మెంట్ ఆఫ్ 2025 పేరుతో ఎన్సీఈఆర్టీ ఇటీవల ఓ నివేదికను రూపొందించింది. రాష్ర్టాల వారీగా జనాభా పెరుగుదల, ఎన్రోల్మెంట్ ట్రెండ్స్‌ను బట్టి రాబోయే మూడేండ్లలో ఎలా ఉండనున్నదో ఎన్సీఈఆర్టీ అంచనావేసింది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 1-8 తరగతుల్లో 2016లో 18.98 కోట్ల ఎన్రోల్మెంట్స్ నమోదు కాగా, 2025 నాటికి 17.85 కోట్లకు తగ్గనున్నది. ఎస్టీలలో ఎన్రోల్మెంట్ తగ్గుతుండగా, ఎస్సీలలో మాత్రం స్వల్పంగా పెరుగుతుందని అంచనా.
తెలంగాణలో 9-10 తరగతుల్లో విద్యార్థుల నమోదు 2016లో 10.48 లక్షలు ఉండగా 2025 నాటికి 10.43 లక్షలకు తగ్గుతుందని అంచనా. ఈ రెండు తరగతుల్లో విద్యార్థుల నమోదు 50 వేల వరకు తగ్గే అవకాశం ఉన్నది.
దేశవ్యాప్తంగా ఏటా ప్రతి 1,000 మంది విద్యార్థులకు ఐదుగురు చొప్పున బడి మానేస్తుండగా, ముగ్గురు తిరిగి అదే తరగతి చదువుతున్నారు. అంటే 1,000 మందికి 992 మంది విద్యార్థులు మాత్రమే పై తరగతులకు ప్రమోట్ అవుతున్నారు. 1 నుంచి 5వ తరగతి వచ్చే సరికి ఈ సంఖ్య 968కే పరిమితం అవుతున్నది.