హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : నాలుగేండ్ల డిగ్రీకి 160 క్రెడిట్స్‌ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్దేశించింది. 160 క్రెడిట్స్ పొందిన వారికి ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నాలుగేండ్ల డిగ్రీ కోర్సుల కరికులం, క్రెడిట్ ఫ్రేంవర్క్‌ను విడుదల చేసింది. విద్యార్థులకు మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. 90 రోజులకు ఒక సెమిస్టర్ చొప్పున, ఒక విద్యాసంవత్సరంలో రెండు సెమిస్టర్లు పూర్తిచేయాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో యూజీసీ పేర్కొన్నది. మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం క్రెడిట్స్‌ను దక్కించుకొంటే మేజర్ డిగ్రీ, 12 క్రెడిట్స్ దక్కించుకొంటే మైనర్ డిగ్రీని జారీచేయాలని ప్రకటించింది.
ప్రత్యేకతలు..
ఏడాది తర్వాత రెండు సెమిస్టర్లు పూర్తిచేసి ఎగ్జిట్ అయితే యూజీ సర్టిఫికెట్, రెండేండ్ల తర్వాత నాలుగు సెమిస్టర్లు పూర్తిచేసి ఎగ్జిట్ అయితే యూజీ డిప్లొమా, మూడేండ్లల్లో ఆరు సెమిస్టర్లు పూర్తిచేస్తే విద్యార్థి క్రెడిట్స్‌ను బట్టి డిగ్రీ, నాలుగేండ్లల్లో 8 సెమిస్టర్లు పూర్తిచేస్తే ఆనర్స్ డిగ్రీని జారీచేస్తారు.
యూజీ సర్టిఫికెట్‌కు 40, యూజీ డిప్లొమాకు 80, మూడేండ్ల డిగ్రీకి 120, నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీకి 160 క్రెడిట్స్ పొంది ఉండాలి.
75 శాతం కన్నా అధిక మార్కులు పొందిన విద్యార్థులు ఆనర్స్ విత్ రిసెర్చ్‌కు అర్హులు. వీరు రిసెర్చ్ ప్రాజెక్ట్‌కు 12 క్రెడిట్స్‌ను అదనంగా పొంది ఉండాలి.
విద్యార్థులు హైబ్రిడ్ పద్ధతిలో కోర్సులు పూర్తిచేయొచ్చు.