(నల్లమల ఛీర్స్)
నల్లమల రహస్యాన్ని ఛేదించిన ఇన్స్పెక్టర్ రుద్ర.. నగరానికి చేరిన వెంటనే డీసీపీ సత్యనారాయణకు స్టేటస్ రిపోర్ట్‌ను సబ్మిట్ చేసి తనతో పాటు తన టీమ్‌కు ఓ వారంపాటు లీవ్ కావాలన్నాడు. ‘సరే.. రుద్ర. లీవ్ ఇస్తాను. అయితే, ఓ కండీషన్. నీ తెలివితేటలు ఏంటో లైవ్‌లో చూడాలని నాకు కూడా ఆశగా ఉంది. కాబట్టి, నేను అడిగే పజిల్‌కు ఐదు సెకండ్లలో నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే.. వారంపాటు మీకు లీవ్ శాంక్షన్ చేస్తా. తప్పు చెప్తే, 3 రోజులు మాత్రమే సెలవు. ఓకేనా?’ అని సత్యనారాయణ అనగానే.. రుద్ర మీద నమ్మకంతో సరేనంటూ పజిల్ గేమ్‌కి సిద్ధమయ్యారు రుద్ర అండ్ టీమ్.
సత్యనారాయణ ఇలా అడిగాడు. ‘నదికి ఒకవైపున ఒక మనిషి, మేక, పులి, గడ్డి మోపు ఉన్నాయి. ఆ మనిషి వీటిని తీసుకొని నది దాటాలి. పడవలో ఇద్దరు మాత్రమే వెళ్లగలరు. పులి, మేక పక్కనే ఉంటే పులి మేకను తినేస్తుంది. మేక, గడ్డి ఉంటే మేక గడ్డిని తినేస్తుంది. కానీ, మనిషిని మాత్రం ఇవేమీ చేయలేవు. ఎందుకంటే, అతనే రింగ్ మాస్టర్. మొత్తంగా రింగ్‌మాస్టర్ దగ్గరుండి వీటిని తీసుకెళ్లాలి. పులిని, మేకను, గడ్డిని అవతలి ఒడ్డుకు క్షేమంగా తీసుకెళ్లాలంటే రింగ్‌మాస్టర్ దేన్ని ముందుగా అటు వైపునకు తీసుకెళ్లాలి?’ అని అడిగిన సత్యనారాయణ.. ‘యువర్ టైమ్ స్టార్ట్ నౌ’ అంటూ కౌంట్ చేయబోయాడు. ప్రశ్నను వింటూ సన్నగా నవ్విన రుద్ర.. ‘సార్.. ఇది నా చిన్నప్పటి నుంచి వింటున్న పజిల్’ అని ఠక్కున సమాధానమిచ్చాడు. అలా వారం సెలవులను సాధించాడు. కంగ్రాట్స్ చెప్తూ రుద్రను మెచ్చుకొన్న సత్యనారాయణ.. ఇంకా ఇలా అన్నాడు.
‘రుద్ర..! నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నల్లమల రహస్యాన్ని ఛేదించావ్. ఐయావ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ విజయంలో నీకు తోడుగా నిలిచిన హెడ్
కానిస్టేబుల్ రామస్వామి గారికి, ఫోరెన్సిక్ ఇంఛార్జీ జయ గారికి, నీ కజిన్ స్నేహిల్కి కూడా చాలా థాంక్స్’ అంటూ అభినందనలు తెలియజేశాడు సత్యనారాయణ. ‘సార్.. మీరు మాకు అన్ని విధాలుగా సహాయ, సహాకారాలు అందించారు కాబట్టే, ఇది సాధ్యమయ్యింది’ అంటూ రుద్రతో గొంతు కలిపారు రామస్వామి, జయ అండ్ స్నేహిల్. కాసేపు ముచ్చటించుకొన్నాక.. డీసీపీ నుంచి సెలవు తీసుకొని రుద్ర అండ్ టీమ్ క్యాబిన్ నుంచి బయటకు వస్తున్నారు. ఇంతలో డీసీపీ.. ‘రుద్ర.. ఒక్క నిమిషం’ అని అన్నారు. దీంతో రుద్ర అండ్ టీమ్ ఆగి వెనక్కి చూశారు. ‘రుద్ర.. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా?’ అని సూటిగా అడిగాడు. డీసీపీ సార్.. ఆ ప్రశ్న వేశారేంటీ? అని రుద్ర ఏదో ఆలోచిస్తున్నాడు. రుద్ర సమాధానం ఏం చెప్తాడా? అని మిగతా వారు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో నోరు తెరిచిన రుద్ర.. ‘సార్.. దేవుడు అంటే నాకు..’ అని ఇంకా ఏదో చెప్పబోతుండగా.. ఇంతలో సత్యనారాయణే కలుగజేసుకొన్నాడు.
‘నీ సంగతేమో గానీ.. నిజానికి నేనైతే దేవుడిని నమ్మను. అయితే, ఇప్పుడు నమ్మే పరిస్థితి వచ్చింది రుద్ర..’ అంటూ సత్యనారాయణ అంటుండగా.. ఏమీ అర్థంకాకపోయినా రుద్ర అండ్ కో శ్రద్ధగా వింటున్నారు. సత్యనారాయణ కొనసాగించాడు. ‘నిన్న రాత్రి మీరు ఫోన్ చేసి నల్లమలలో జరిగిన విషయాలు చెప్పిన తర్వాత.. నా మైండ్‌లో ఎన్నెన్నో ఆలోచనలు. అవన్నీ నిజమో కాదో నాకు మొదట అర్థంకాలేదు. ఆ తర్వాతే.. కాస్త ఆలోచనలో పడ్డా’ అంటూ చెప్తూ పోయాడు సత్యనారాయణ. ‘రుద్ర.. నల్లమల ఘోరకలికి మూలం శరత్. భస్మాసురుడిని భూమికి రప్పించేందుకే అతను ఇదంతా చేశాడు. మరి, భస్మాసురుడికి భస్మం చేసే వరమిచ్చింది ఎవరు?’ అంటూ సత్యనారాయణ అనగానే.. ‘పరమేశ్వరుడు’ అని ముక్తకంఠంతో అందరూ చెప్పారు. ‘యెస్. ఆ పరమేశ్వరుడు కొలువుదీరిన శ్రీశైల క్షేత్రం కొలువైన నల్లమలలోనే ఈ ఘోర కలి పురుడుపోసుకొంది. అంతేకాదు, చివరగా పజిల్‌ను ఛేదించడానికి మీకు ఆకాశంలో మూడు మేఘాలు కనిపించాయన్నారు. అది ఆ పరమశివుడు పెట్టుకొనే అడ్డనామాలేగా’ అంటూ సత్యనారాయణ సన్నగా నవ్వుతుంటే.. రుద్ర అండ్ టీమ్ ఏదో ఆలోచనలో పడ్డారు. ‘ఇంకోవిషయం చెప్పాలా.. నల్లమలలో మీకు దారిచూపడానికి ఎంచుకొన్న వ్యక్తి పేరు గుర్తుందా??’ అని డీసీపీ అనగానే..‘శివుడు’ అని అందరూ బదులిచ్చారు. ‘యెస్. శివుడు. నిజానికి ఆ శివుడు.. శరత్ మనిషి. అవునా?! పైగా బలశాలి. మీవెంట మొదటి నుంచి ఉన్నాడు. అంతేకాదు.. ఈ ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి ఎన్నోసార్లు మీరు ఒక్కొక్కరు ఒంటరిగా అతనికి ఈజీగా దొరికారు. అయినప్పటికీ ఆ శివుడు మీపై ఎందుకు దాడి చేయలేదు? ఏ శక్తి అతణ్ని ఆపినట్టు? శివుడు అని పేరు పెట్టుకొన్నాడు గనుకనే.. అతను ఆగిపోయాడా? ఏం??’ అంటూ సత్యనారాయణ అనగానే.. అందరి మనసులో ఏదో కలవరం.
వారి ముఖాల్లో ఆందోళన గమనించిన సత్యనారాయణ.. ‘ఇంకా ఉన్నాయ్.. చెప్తాను వినండి. ఈ నల్లమల ఆపరేషన్ అసైన్మెంట్ అప్పగించేందుకు తెలుగు రాష్ర్టాల్లో 12 వేల మంది పోలీసుల ట్రాక్ రికార్డును చెక్ చేశాం. జ్యోతిర్లింగాలు కూడా పన్నెండే. అన్నట్టు ఘోరకలి జరిగిన నల్లమలలోని శ్రీశైలం కూడా జ్యోతిర్లింగమే. ఇక.. ట్రాక్ రికార్డు చెక్ చేసిన ఈ 12 వేల మంది పోలీసుల్లో చివరగా అన్ని క్వాలిటీస్‌తో ఆరుగురు మాత్రమే ఫైనల్ అయ్యారు. అచ్చం ‘ఓం నమశ్శివాయ’లో ఆరు అక్షరాలు ఉన్నట్టే.. ఈ ఆరు మంది ఫైనల్ అయ్యారు. అంతేకాదు, ఆ ఆరుగురిలో నువ్వు కాకుండా మిగతావారి పేర్లేంటో తెలుసా?’ అని రుద్రను చూస్తూ ప్రశ్నించాడు. తెలియదన్నట్టు తలూపారు రుద్ర అండ్ కో. ‘ఫైనల్లో సెలక్ట్ అయిన మిగతా ఐదుగురి పేర్లు.. నటరాజ్, విశ్వనాథ్, పశుపతి, మహాదేవ్, గంగాధర్.. అన్నట్టు ఈ పేర్లు అన్నీ శివుడికి సంబంధించినవే. అవునా?’ అని సత్యనారాయణ అనగానే.. అందరూ తలూపారు. ఇక, ఫైనల్‌గా ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసిన మోస్ట్ డైనమిక్ మా యంగ్ ఆఫీసర్ పేరు ఏంటో తెలుసుగా!’ అంటూ సత్యనారాయణ అనగానే.. ‘రుద్ర అలియాస్ శివ’ అంటూ రామస్వామి, జయ, స్నేహిల్ గట్టిగా అరిచారు. గొంతు కలిపాడు సత్యనారాయణ.
ఇంతలో గదిలోకి వచ్చిన అటెండర్ డీసీపీ కుర్చీ వెనుకాల గోడకు న్యూ ఇయర్ క్యాలెండర్‌ను వేలాడదీశాడు. అది అటువైపు తిరిగి ఉండటంతో సరిగ్గా వేలాడదీయమని సిబ్బందికి ఆదేశించాడు సత్యనారాయణ. ఆశ్చర్యం.. ఆ అటెండర్ క్యాలెండర్‌ను ఇటు తిప్పగానే.. హిమాలయాల్లో ప్రశాంత వదనంతో తపస్సు చేసుకొంటున్న పరమేశ్వరుడు సాక్షాత్కారమయ్యాడు. అది చూడగానే సత్యనారాయణ, రుద్ర, రామస్వామి, జయ, స్నేహిల్ తమ రెండు చేతులను జోడించి ‘హర.. హర.. మహాదేవ్’ అంటూ గట్టిగా శివనామస్మరణ చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాకపోయిన గొంతు కలిపాడు అటెండర్ మరింత గట్టిగా స్మరిస్తూ.. అది పక్కనబెడితే, రుద్రను డీసీపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని మీరు కనిపెట్టారా?
సమాధానం : మొదట రింగ్ మాస్టర్, మేక ‘ఏ’ ఒడ్డు నుంచి ‘బీ’ ఒడ్డుకు వెళ్లాలి. తర్వాత ‘బీ’ దగ్గర మేకను ఉంచి.. తిరిగి పడవలో ‘ఏ’ వద్దకు వచ్చిన రింగ్‌మాస్టర్.. పులితో మళ్లీ ‘బీ’ దగ్గరికి వెళ్లాలి. ఇప్పుడు ‘బీ’ దగ్గర పులి, మేక ఉన్నాయి. ఇది ప్రమాదకరం. కాబట్టి.. ‘బీ’ నుంచి మేకతో ‘ఏ’ ఒడ్డుకు చేరిన రింగ్ మాస్టర్.. ‘ఏ’ దగ్గర మేకను అలాగే ఉంచి గడ్డితో ‘బీ’ దగ్గరకు చేరాలి. సో.. ఇప్పుడు ‘బీ’ ఒడ్డున పులి, గడ్డి ఉన్నాయి. ఇది ప్రమాదకరం ఏమీకాదు కాబట్టి.. అక్కడి నుంచి మళ్లీ ‘ఏ’ దగ్గరికి వచ్చిన రింగ్ మాస్టర్ మేకను తీసుకొని తిరిగి ‘బీ’కి చేరాలి.