Shibari | ఒంట్లో రక్తాన్ని ఉరుకులు పెట్టించే టెక్నిక్.. అర్థంలేని ఆలోచనలతో పరుగులుపెట్టే మనసుకు కళ్లెం వేసే కళ.. ఆత్మ సంతృప్తికి అర్థం చెప్పే విధానం.. మానసిక చికిత్సలో సువర్ణాధ్యాయం.. షిబారి రోప్ టెక్నిక్. మెట్రో యువత ఇప్పుడు ‘షిబారి’ జపం చేస్తున్నది. ఈ జపనీస్ కళలోని ప్రత్యేకతలు తెలుసుకుందామా?
గత మే నెలలో గోవాలోని మోర్జిన్బీచ్లో ‘ఇంపాక్ట్ ప్లే’ పేరుతో ఓ వర్క్‌షాపు జరిగింది. అక్కడికి పలు రాష్ట్రాల యువతీయువకులు వచ్చారు. తాళ్లు, కొరడాలతో చుట్టమని, తలకిందులుగా వేలాడదీయమని కొందరు అమ్మాయిలు ట్రైనర్ మక్సిమ్ కలహరిని తొందరపెడుతున్నారు. మరికొందరు.. ఆ తర్వాత ఫీట్లు చేసేది తామేనని ఊహించుకుని మురిసిపోతున్నారు. ఒళ్లంతా తాళ్లతో చుట్టి, ఓ రింగ్ సాయంతో గాలిలో వేలాడదీసిన తర్వాత.. వారిలో అంతులేని ఆనందం. ఏదో సాధించిన సంతృప్తి. కొద్దిసేపటికి తాళ్లు విప్పేశారు. కొన్ని క్షణాలు అందరి శరీరాలూ మొద్దుబారినట్టు అనిపించాయి. అనంతరం రక్తప్రసరణ వేగవంతమైంది. ఎవరికి వారు మహదానంద స్థితికి చేరారు. ఇలాంటి ఓ పురాతన ఆధ్యాత్మిక కళ ఉందని భారత్‌కు తెలియజెప్పిన వ్యక్తి.. సెలెబ్రెటీ ట్రావెల్ బ్లాగర్ షెనాజ్ ట్రెజరీ. షిబారిలో నిపుణుడైన రష్యన్ ట్రైనర్ మక్సిమ్ కలహరి నుంచి ఈ విద్యను తెలుసుకున్నది షెనాజ్. షిబారి టెక్నిక్‌ను స్వయంగా ప్రయత్నించి, తను ఆస్వాదించిన ఆనందాన్ని తన సబ్‌స్ర్కైబర్లకు వెల్లడించడంతో.. ఆ తర్వాత జరిగిన అన్ని వర్క్షాప్లకూ విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇది పాశ్చాత్య దేశాల్లో శృంగార భంగిమల కోసం ఉపయోగించే ‘బీడీఎస్ఎమ్’ను పోలి ఉంటుంది.
‘షిబారి’ అనేది జపనీయుల యుద్ధకళ. ‘షిబారు’ అంటే ‘పట్టుకో..’ అని అర్థం. ‘హొజో-జుట్సు’ అనే యుద్ధవిద్యలో ఓ భాగం షిబారి. యుద్ధంలో ఓడిపోయిన లేదా పట్టుబడిన శత్రు సైనికులను బందీలను చేసేటప్పుడు కాళ్లు, చేతులను కట్టి.. గుంజకు వేలాడదీసేవారు. బందీని ప్రాణాలతో ఉంచడం అనేది ఈ విద్య ప్రధాన ఉద్దేశం. రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోకుండా కాళ్లూచేతులు కట్టేయడం ఓ టెక్నిక్. ఇలా చేయడం వల్ల శత్రువు కాళ్లు, చేతులు మొద్దుబారిపోతాయి. కష్టంగా నడవగలరు కానీ ఆయుధాన్ని ఉపయోగించలేరు. అలా శత్రువును కట్టు బానిసను చేస్తారు. సైన్యాలకు ఎదురుతిరిగిన మహిళలనూ, శత్రు గూఢచారిణులనూ ఇలా తాళ్లతో కట్టేసి అత్యాచారానికి పాల్పడేవారు. ఇదో శృంగార భంగిమగానూ ఉపయోగపడేది. సైకోథెరపీలో భాగంగా ఈ కళను ఉపయోగించవచ్చని నిపుణులు గుర్తించారు. అలా మానసిక చికిత్సకు దీన్ని అన్వయించుకోవడం మొదలుపెట్టారు. క్రమంగా యూరోపియన్ దేశాలకూ విస్తరించింది. ఇప్పటికీ జపనీయుల దుస్తుల్లో తాడు ఓ భాగం. దీన్ని షిబారి నుంచి వచ్చిన ఆచారంగా చెబుతారు. తమ దేశానికి తామంతా బానిసలమని పరోక్షంగా చెప్పడం అన్నమాట.
కాళ్లు, చేతులు, కీళ్లకు మసాజ్‌లా పనిచేస్తుంది. రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల అవయవాలకు కొత్త బలం వస్తుందని షిబారి నిపుణులు చెబుతున్నారు. చాలామందిలో.. మనోబలం, ఆత్మవిశ్వాసంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. షిబారి టెక్నిక్‌ను జీవితంలో భాగం చేసుకున్న తర్వాత.. మునుపెన్నడూ లేనంత హుషారుగా, ఉత్సాహంగా ఉంటున్నారట. బుద్ధిమాంద్యం, ఇతర మానసిక సమస్యలు ఉన్నవారికి సైకోథెరపీలో ఈ కళను భాగం చేస్తున్నారు వైద్య నిపుణులు. షిబారి కోసం ఉపయోగించే తాళ్లను నార నుంచి అల్లుతారు. ఈ కళలో ఒడుపుగా ముడులు వేయాలి. ఒక్క ముడి తప్పుగా పడినా శరీరానికి గాయమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, సొంత ప్రయోగాలు ప్రమాదకరం. నిపుణుల పర్యవేక్షణలోనే ప్రయత్నించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా వర్క్‌షాపులు, ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. యోగాలో ఉన్నన్ని ఉపయోగాలు ఇందులోనూ ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
› షిబారి కళలో నిపుణులు మాత్రమే.. ఒడుపుగా తాళ్లు కట్టగలరు. కొన్ని యాప్స్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు కానీ, గురువు సమక్షంలో అయితేనే ఉత్తమం.
› తాళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నారతో పేనిన తాళ్లనే ఎంచుకోవాలి. యోగా స్టోర్స్‌లో ‘షిబారి రోప్’లు అమ్ముతారు. వాటిని ఉపయోగిస్తే మంచిది.
› వేసే ప్రతి ముడీ విప్పేందుకు వీలుగా ఉండాలి. ఒక్క ముడిని గుంజితే.. మొత్తం తాడు సులువుగా రావాలి.
› కాళ్లు, చేతులు, తొడ, నడుము.. ఇలా అనువైన ప్రదేశంలో తాళ్లతో కట్టుకోవచ్చు.. వేలాడవచ్చు.
› ఇలా కట్టుకోవడం ద్వారా రక్తం వేడెక్కి.. రక్త ప్రసరణ అనుభూతిని ఆస్వాదిస్తారని చెబుతారు నిపుణులు.
› 8 నుంచి 12 నిమిషాల వరకూ అలా గాలిలో వేలాడవచ్చు.
› ఆ సమయంలో మంద్రస్థాయిలో సంగీతం వినిపిస్తూ ఉంటే మరింత బావుంటుంది.
“నా భర్త నన్ను ముద్దులతో ముంచెత్తాలని ఉంటుంది.. కానీ ఆయన మాత్రం..”
“నేను ప్రేమించిన వాడికి అబ్బాయిలంటేనే ఇష్టం.. అతన్ని అసలైన మగాడిగా ఎలా చేయాలి?”