QR Code | అర్ధరాత్రి. గచ్చిబౌలిలోని ఆఫీస్ నుంచి బైక్ మీద ఇంటికి బయల్దేరాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ భాగ్యరాజ్. లక్డీకాపూల్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్పృహ కోల్పోయి, రక్తమోడుతున్న భాగ్యరాజ్ చుట్టూ జనం గుమిగూడారు. ఫోన్ లాక్‌లో ఉంది కాబట్టి, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు తెలుసుకోవడం కష్టమైంది. అంతలోనే, ఫోన్ పౌచ్‌కు ఉన్న క్యూఆర్ కోడ్ కనిపించింది. వెంటనే స్కాన్ చేశారు. పేరు, చిరునామా, బ్లడ్‌గ్రూప్, ఆరోగ్య చరిత్ర సహా అతని వివరాలన్నీ తెలిశాయి. సంబంధీకులకూ సమాచారం వెళ్లింది. మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డాడు భాగ్యరాజ్.
యాదృచ్ఛికంగానే తన పూర్తిపేరు, చిరునామా, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, బ్లడ్ గ్రూపు, సోషల్ మీడియా ఖాతా వివరాలన్నీ కలిపి ఓ క్యూర్ కోడ్‌ను రూపొందించుకున్నాడు భాగ్యరాజ్. వృత్తిరీత్యా టెక్కీ కావడంతో అలాంటివి తనకు సమస్యే కాదు . ఆ క్యూఆర్ కోడే ఇప్పుడు ఆత్మీయులకు సమాచారం అందించింది. అవసరానికి రక్తం, సమయానికి వైద్యం అందేలా చేసింది. ప్రాణాలను నిలబెట్టింది. నిజానికి, స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో క్యూఆర్ కోడ్‌ను ఉపయోగిస్తూనే ఉన్నారు. పానీపూరి బండి దగ్గర చిల్లర చెల్లింపు నుంచి కియా బండి కొనుగోలు వరకూ పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి యూపీఐ, భీమ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా.. ఆర్థిక అవసరం ఏదైనా క్షణాల్లో క్యూఆర్ కోడ్‌తో డబ్బులు బదిలీ చేస్తున్నారు. అంతేకాదు.. ఆఫీస్ లొకేషన్, పెండ్లి వేదిక వివరాలు, చేరాల్సిన గమ్యం.. ఏదైనా సరే కొంచెం ట్రెండీగా ఉండేందుకు క్యూఆర్ కోడ్‌ను ఉపయోగిస్తున్నారు. వాణిజ్య ప్రకటనల్లోనూ ఇవి జొరబడ్డాయి. కరోనా దెబ్బకు రెస్టారెంట్లు మెనూ చార్ట్ ముద్రించడం మానేశాయి. టేబుల్ మీద ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్లిక్ చేస్తే.. మెనూ వచ్చేస్తుంది. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగుల ఐడీలకు క్యూఆర్‌ను జత చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రకటనల్లో క్యూఆర్ కోడ్‌ను క్లిక్ చేస్తే.. వర్చువల్ రియాలిటీ షో మొదలైపోతుంది. ఆ ప్రాజెక్టు దృశ్యాలు కండ్లకు కట్టినట్టు కనిపిస్తాయి.
మనుషులకూ ..
ప్రతి వాణిజ్య వస్తువుపైనా క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉంటుంది. స్కాన్ చేస్తే పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిసిపోతాయి. ఇదే టెక్నాలజీని మనుషుల గురించి తెలుసుకునేందుకూ వినియోగిస్తున్నారు. ప్రతి మనిషి పేరు, చిరునామా వంటి వివరాలు తెలిపేందుకు ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ వంటివి భౌతికంగా ఉన్నాయి. దీనికి అప్డేట్గా మరిన్ని వివరాలు జోడిస్తూ క్యూఆర్ కోడ్ రూపంలో స్మార్ట్‌గా వ్యక్తిగత వివరాలు పొందుపరుస్తున్నారు. దానిని స్కాన్ చేస్తే చాలు.. మనమేమిటో తెలిసిపోతుంది. ఆపద సమయాల్లో ఆ వివరాలు ఎంతో ఉపయోగపడతాయి. యువత తమ క్యూఆర్ కోడ్‌ను టీషర్టులు, కాలేజ్ బ్యాగులు, మొబైల్ పౌచ్‌లపై ముద్రించుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన ఓ జంట తమ పెండ్లికి రాలేనివారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇన్విటేషన్ కార్డు మీదున్న క్యూఆర్ కోడ్ ద్వారా చదివింపులు చెల్లించమని కోరింది. నిజానికి, క్యూఆర్ కోడ్ తయారీ పెద్ద సమస్యేం కాదు. సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారికి అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
క్లుప్తంగా..
క్యూఆర్ కోడ్ అంటే ‘క్విక్ రెస్పాన్స్ కోడ్’ అని అర్థం. వాహనాలను ట్రాక్ చేసే ఉద్దేశంతో జపాన్‌కు చెందిన ఆటోమోటివ్ కంపెనీ డెన్సో వేవ్ 1994లో కనిపెట్టింది. బార్కోడ్లతో పోలిస్తే వీటిని త్వరగా ట్రాక్ చేయవచ్చు. ఫోన్లో ఎలాంటి వెబ్ చిరునామాలను టైప్ చేయకుండా స్కాన్ చేసి, సులభంగా యాక్సెస్ చేయవచ్చు. క్యూఆర్ కోడ్‌లో క్వైట్ జోన్, ఫైండర్ ప్యాట్రన్, అలైన్మెంట్ ప్యాట్రన్, టైమింగ్ ప్యాట్రన్, వెర్షన్ ఇన్ఫర్మేషన్, డేటా సెల్స్ అనే జోన్లు ఉంటాయి. ఫైండర్ ప్యాట్రన్ జోన్లోనే మూడు స్క్వేర్ బాక్స్‌లు ఉంటాయి. వీటివల్ల క్యూఆర్ కోడ్ రివర్స్‌లో ఉన్నా మన డివైజ్ వేగంగా చదవగలుగుతుంది. చిల్లర సమస్య లేకుండా సులువుగా నగదు చెల్లించేందుకు ఈ మార్గాన్ని ఎంచు
కుంటున్నారు.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Delete for Everyone ఫీచర్లో కీలక మార్పులు చేయనున్న వాట్సప్..
WhatsApp | గత 6 నెలల్లో భారత్‌లో 1.32 కోట్ల వాట్సప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలుసా?