Cricket | వరల్డ్‌కప్ హీట్ మొదలైంది. ఆట ఆటకూ, బంతి బంతికీ ఈ క్రేజ్ మరింత పెరుగుతుంది. చేజింగ్ క్లయిమాక్స్‌కు చేరినప్పుడు మసాలా టీ ఆస్వాదిస్తూ.. విజయానికి ఆహ్వానం పలకడం క్రికెట్ ప్రేమికుడికి అలవాటే! ఇండియా మ్యాచ్ ఉందంటే పాలు అర లీటరు అధికంగా తీసుకోవడమూ రివాజే! ఆ పూట చాయ సాగర మథనం జరగాల్సిందే! అంతెందుకు టీకి, క్రికెట్‌కు మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఇప్పటిది కాదు. వన్డే మ్యాచుల్లో డ్రింక్స్ బ్రేక్ మామూలే! కానీ, టెస్ట్ మ్యాచుల్లో టీ బ్రేక్ అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మ్యాచ్ రెండో సెషన్ పూర్తవ్వగానే టీ బ్రేక్ గంట మోగుతుంది. 20 నిమిషాల బ్రేక్‌లో రెండు చాయ్‌లు ఎంచక్కా లాగించేయొచ్చు. టీ ఇచ్చిన ఉత్సాహంతో ఆటగాళ్లు రెచ్చిపోయి మరీ ఆడతారు. అందుకే టెస్ట్ మ్యాచ్‌లో టీ బ్రేక్ తర్వాత వచ్చే మూడో సెషన్ భలే రంజుగా సాగుతుంది.
ఏ జట్టు రుచికరమైన టీ తాగుతుందో వారిదే పైచేయి అవుతుంది. బ్యాటర్ విరుచుకుపడినా, ఫాస్ట్ బౌలర్లు నిప్పులు కురిపించినా, స్పిన్నర్లు బంతిని గింగిరాలు తిప్పినా.. అంతా ఏకాక్షరీ ప్రభావమే అని చెప్పక తప్పదు. టీ20లు వచ్చినా.. వన్డే ప్రపంచకప్ వన్నె తగ్గలేదు. అలాగే టెస్ట్ మ్యాచ్ ప్రభ తగ్గదు. అందులోనూ టీ బ్రేక్ తరువాత మలుపు తిరిగే సంప్రదాయమూ మారదు. ఇప్పటికైతే మంచి చాయ్ రుచి చూస్తూ వన్డే వరల్డ్ కప్ సమరాన్ని ఎంజాయ్ చేద్దాం. కోహ్లీ సెంచరీ చేస్తే మసాలా చాయ్, సూర్య కుమార్ దంచికొడితే ధమ్ చాయ్, రోహిత్ సిక్సుల వర్షం కురిపిస్తే జింజర్ చాయ్ తాగేద్దాం. ఈ ప్రపంచ కప్ మన జట్టు ముద్దాడిన రోజున మన జాతీయ పానీయాన్ని మరోసారి తల్చుకుందాం.
ఎవరైనా ‘టీ కావాలా? స్వర్గం కావాలా?’ అని అడిగితే! ‘టీని మించిన స్వర్గం మరేదైనా ఉంటుందా!?’ అని బదులిస్తాం!
-చైనా నానుడి