నగరాల్లో ప్రభుత్వ దవాఖానల దగ్గర తమ వాళ్ల చికిత్స కోసం వచ్చిన ఎంతోమంది పడిగాపులు కాస్తుండటం మనందరికీ అనుభవమయ్యే విషయమే. ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారంటేనే వాళ్లలో చాలావరకు రోజుకూలీలు, పేదలే అయ్యుంటారనేదీ తెలిసిన సంగతే. మామూలుగా అయితే మనం వాళ్లెవరి గురించీ పట్టించుకోం. నోయిడాకు చెందిన విదిత్ శర్మ మాత్రం అలా కాదు. తను నోయిడా ప్రభుత్వ దవాఖాన దగ్గరినుంచి వెళ్తుంటే బాధ్యతలు, పనుల బరువు, వైద్య ఖర్చులతో నీరసించిన వారిని గమనించేవాడు.
దవాఖానలో చికిత్స పొందుతున్న తమవాళ్ల కోసం ఎంతో శ్రద్ధ తీసుకునే వాళ్లు తమ గురించి, తమ ఆహారం గురించి పట్టించుకోకపోవడాన్ని విదిత్ గుర్తించాడు. ఆ దృశ్యాలను చూసి ఎంతో చలించిపోయాడు. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ ఏడాది విదిత్ ‘జన్ రసోయి’ పేరుతో వేడివేడి ఇంటివంటను అందించడం మొదలుపెట్టాడు. ఇందులో రాజ్మా చావల్, చోలే చావల్, పప్పన్నం ఉంటాయి. దీన్ని కేవలం ఐదు రూపాయలకే అందిస్తుండటం విశేషం.
మరి ఈ సదుపాయం ఉచితంగా ఎందుకు ఇవ్వడం లేదంటే… “ప్రజలు ఆహారం తమకు ఉచితంగా లభిస్తున్నది అనుకోవద్దు. ఎంతోకొంత రుసుము సంతోషంగా చెల్లిస్తున్నాం అనుకోవాలి” అంటాడు విదిత్. ఇలా జన రసోయి ద్వారా విదిత్ రోజుకు సుమారు 700 ప్లేట్ల ఆహారం సరఫరా చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో అతనికి పదిమంది బృందం సహకరిస్తున్నారు. కాగా ఈ అన్నసేవను నోయిడాలోని ఇతర దవాఖానల్లో రోజుకు 3,000 ప్లేట్లకు విస్తరించాలని విదిత్ ఆశిస్తున్నాడు.
ఐదు రూపాయలకే ఆహారం అందిస్తున్నప్పటికీ నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ ఉండదు. పైగా పూర్తి పోషకాలతో కూడిన ఆహారం. ఇక తను చేస్తున్న సేవకు “ఆహారం అందుకుంటున్న వారి కళ్లలో కనిపించే కృతజ్ఞత మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది. మేం పెట్టే భోజనం కూడా ప్రేమతో నిండింది. అదీ అత్యవసరమైన పోషకాలతో దాని అవసరం ఉన్నవాళ్ల ఆకలిని తీరుస్తున్నది” అని సంతృప్తి చెందుతాడు విదిత్. మరో మాట ఎవరూ పట్టించుకోని పశువుల కోసం విదిత్ ‘సేవ్ ఏ స్ట్రే ఫౌండేషన్’ కూడా నడుపుతున్నాడు. దీని ద్వారా రోజుకు మూడు వేల జంతువులకు ఆహారం, అవసరమైన చికిత్స అందిస్తున్నాడు. అన్నట్టు, విదిత్ ఓ ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.