ఇప్పుడు తీరొక్క పూలతో
ఊరూరు అలంకరించుకుంటున్నది
సబ్బండ వర్ణాలతో
జాతి అంతా కొత్త పాటై మోగుతున్నది
నవ్వు నవ్వులో
తంగేడు వెల్లి విరుస్తున్నది.
పిలుపు పిలుపులో
ఆత్మీయత తొణికిసలాడుతున్నది
అంతటా ఆనందం
అలంకరణై అలరారుతున్నది.
పేర్చిన రంగు రంగుల పూలల్లే
బతుకులన్నీ
ఇంద్రధనసులై సింగారించుకుంటున్నాయి
మంచి, మమత, స్వచ్ఛత కలబోసుకుని
ఆడబిడ్డల మనసులు వెచ్చగా నవ్వుకుంటున్నాయి
అందరూ కూడి ఉన్న ఈ చోట
అనుబంధాలు తీగలై అల్లుకుంటున్నాయి..
బతుకునిచ్చిన అమ్మ
ఇంటికొచ్చిందని
బంగారమోలే దాసుకుంటూ
గారబంగా సూసుకుంటూ
పసుపుముద్దలల్ల
ప్రేమను నింపుకుంటూ
సంబురాలు సేసుకుంటుండ్రు..
నీడనిచ్చిన తల్లికి
వాడవాడలా వేడుకలు జేస్తుంటే
రెండు కళ్ళు పూలతీర్గ మెరుస్తున్నాయి..
ఇపుడు.. తెలంగాణ నేల
అంతా పూలజాతర్లే..
గడప గడపలల్ల కొత్తకాంతులే..
గుండెల్ల కొలువున్న తల్లిని
నెత్తికెత్తుకుంటుంటే
ప్రతి బిడ్డ గుండె
ఓ బతుకమ్మైపోతున్నది
నెత్తికెత్తుకున్న ఆ బతుకమ్మ
జాతి ఆత్మగౌరవానికి
ఆనవాళ్ళై కనబడుతున్నది
తిరునగరి శరత్ చంద్ర: 63098 73682