ఒక సినీనటి ఓ బంధంలో సైకలాజికల్‌గా ఎంతో ఇబ్బంది పడ్డానని, అందులో నుంచి బయటపడటానికి రెండేండ్లు పట్టిందని ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం చూసే ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఆమె ఒక్కరే కాదు, ఎంతోమంది మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. దీన్నే సైకాలజీలో ట్రామా బాండింగ్ అంటారు. దీని బారి నుంచి ఎందుకు అంత త్వరగా బయటపడలేరో, ఎలాంటి చర్యల ద్వారా బయటపడొచ్చో తెలుసుకుందాం.
నార్సిసిస్టిక్ బంధాల్లో మహిళలు మానసిక లేదా శారీరక హింసకు, అప్పుడప్పుడు కురిపించే ప్రేమకు మధ్య నలిగిపోతూ ఉండే స్థితిలో ఏర్పడే అత్యంత విషపూరితమైన అనుబంధమే.. ‘ట్రామా బాండింగ్’. నార్సిసిస్టిక్ బంధంలో ఉన్న స్త్రీలలో ఈ ట్రామా బాండింగ్ ఎంత తీవ్రంగా పనిచేస్తుందో స్పష్టం చేసే కొన్ని ముఖ్యమైన మానసిక కోణాల గురించి తెలుసుకుందాం.
ట్రామా బాండింగ్ కేవలం ఆలోచనలకు సంబంధించింది మాత్రమే కాదు, అది మెదడులోని రసాయన మార్పులతో ముడిపడి ఉంటుంది. భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు బాధితురాలి మెదడులో ‘కార్టిసోల్’ పెరుగుతుంది. అదే భాగస్వామి మళ్లీ సడన్‌గా అనురాగం చూపినప్పుడు ‘డోపమైన్’, ‘ఆక్సిటోసిన్’ విడుదల అవుతాయి. ఈ మార్పుల వల్ల ఆ స్త్రీ మెదడు, భాగస్వామి ఇచ్చే ఆ కాస్త అనురాగం కోసం తీవ్రంగా నిరీక్షించేలా అలవాటు పడుతుంది. ఇది ఒక రకమైన డ్రగ్ అడిక్షన్ లాగా మారుతుంది.
బాధితురాలు బంధం తెంచుకోకపోవడానికి ప్రధాన కారణం భాగస్వామి నిలకడలేని ప్రవర్తన. భాగస్వామి ఎప్పుడూ చెడుగా ప్రవర్తిస్తే ఆ బంధం నుంచి బయటపడటం సులభం. కానీ, 90% హింసించి, 10% అత్యంత ఆప్యాయతగా ఉండటం వల్ల ‘అతను నిజానికి మంచివాడే, నేనే సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు’ అనే భ్రమలో స్త్రీలు ఉండిపోతారు.
నార్సిసిస్ట్ కలిగించిన మానసిక వేదన నుంచి ఉపశమనం పొందడానికి, బాధితురాలు మళ్లీ అదే నార్సిసిస్ట్ అనురాగం కోసం ప్రయత్నిస్తుంది. నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు కలిగే ఆందోళనను తగ్గించుకోవడానికి అతని కాళ్లావేళ్లా పడటం, అతని కోరికలకు లొంగిపోవడం ద్వారా శాంతిని వెతుక్కుంటుంది. దీనివల్ల అతనే బాధించేవాడు, అతనే రక్షకుడు అనే ఒక విచిత్రమైన మానసిక స్థితి ఏర్పడుతుంది.
ట్రామా బాండింగ్‌లో ఉన్న స్త్రీలు తమ భాగస్వామి ప్రవర్తనను సమర్థించడం ప్రారంభిస్తారు. ‘అతనికి చిన్నప్పుడు సరైన పెంపకం లేదు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు’, ‘నేను ఆ మాట అనకుండా ఉంటే అతను అంతగా కోప్పడేవాడు కాదు’ ఇలా తనపై తాను తప్పు వేసుకుంటూ, అతణ్ని నిరపరాధిగా చూపించడానికి తన మనసులోనే రకరకాల కారణాలను సృష్టించుకుంటారు.
కాలక్రమేణా బాధితురాలు తన సొంత ఇష్టాయిష్టాలు, లక్ష్యాలు, విలువలను పూర్తిగా మరచిపోతుంది. ఆమె ఆలోచనలన్నీ ‘భాగస్వామిని ఎలా సంతోషపెట్టాలి?’, ‘అతని కోపానికి గురికాకుండా ఎలా తప్పించుకోవాలి?’ అనే దాని చుట్టూనే తిరుగుతాయి. దీనివల్ల ఆమె స్వయం ప్రతిపత్తిని పూర్తిగా కోల్పోతారు.
ట్రామా బాండింగ్ నుంచి బయటపడటం సాధ్యమే కానీ, కొంచెం కష్టం. వీలైనంత వరకు ఆ వ్యక్తితో మాట్లాడటం, కలవడం పూర్తిగా ఆపేయాలి. భాగస్వామి వల్ల ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన మానసిక వేదనను డైరీలో రాసుకుని, అసలు నిజాలు ఏమిటో ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవాలి. సైకోథెరపీ ద్వారా మెదడులోని ఈ ఫిజియోలాజికల్, సైకలాజికల్ బంధాలను క్రమంగా తెంచుకోవచ్చు.
ట్రామా బాండింగ్ అనుభవించిన మహిళలు ఆ మానసిక విషవలయం నుంచి సురక్షితంగా, శాశ్వతంగా బయటపడటానికి ఉపయోగపడే అత్యంత శాస్త్రీయమైన వైద్య విధానం ట్రామా ఇన్ఫార్మ్డ్ థెరపీ. సాధారణ కౌన్సెలింగ్ ‘నీకేమైంది?’ అని ప్రశ్నిస్తే, ఈ థెరపీ ‘నీతో ఏం జరిగింది?’ అనే సానుభూతి కోణంలో బాధితురాలిని అర్థం చేసుకుంటుంది. నార్సిసిస్టిక్ బంధాల వల్ల ఏర్పడే ట్రామా బాండింగ్‌ను తెంచడంలో ‘ట్రామా-ఇన్ఫార్మ్డ్ థెరపీ’ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం.
నార్సిసిస్టిక్ బంధంలో ఉన్న మహిళలు నిరంతరం భయం, ఆందోళనలతో బతుకుతారు. థెరపిస్ట్ ముందుగా బాధితురాలికి సంపూర్ణమైన మానసిక భద్రతని అందిస్తారు. బాధితురాలు చెప్పే ప్రతిమాటను ఎలాంటి జడ్జ్మెంట్ చేయకుండా వింటారు. ‘అంత హింసించినా ఆ బంధంలోనే ఎందుకున్నావు?’ అని ప్రశ్నించకుండా, ఆమె పడ్డ వేదనను గుర్తిస్తారు.
ట్రామా బాండింగ్‌లో ఉన్న స్త్రీలు తమ పరిస్థితికి తమనే నిందించుకుంటారు. థెరపిస్ట్ వారికి శాస్త్రీయ నిజాలను వివరిస్తారు. నార్సిసిస్ట్ చూపించే అస్థిరమైన ప్రేమ వల్ల మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్ రసాయనాలు ఎలా ప్రతిస్పందిస్తాయో స్పష్టం చేస్తారు. ఇది ప్రేమ కాదు, మెదడులోని రసాయన వ్యసనం అనే నిజాన్ని బాధితురాలు గ్రహించేలా చేస్తారు. దీనివల్ల ఆమెలో ఉండే తీవ్రమైన తప్పుడు అభిప్రాయం తొలగిపోతుంది.
నార్సిసిస్ట్ చేసిన గ్యాస్ లైటింగ్ వల్ల బాధితురాలి ఆలోచనా సరళి దెబ్బతింటుంది. థెరపీ ద్వారా ‘నేను దేనికీ పనికిరాను’, ‘నా వల్లే ఇదంతా జరిగింది’ అనే ప్రతికూల ఆలోచనలను గుర్తించి, వాటి స్థానంలో వాస్తవికమైన, ధనాత్మక ఆలోచనలను స్థాపిస్తారు. బాధితురాలు గతం గురించి మోహంతో ఉన్నప్పుడు వారు పడిన మానసిక హింస వాస్తవాలను గుర్తుచేస్తారు.
ట్రామా-ఇన్ఫార్మ్డ్ థెరపీ కేవలం ఓదార్పు మాత్రమే కాదు. ఇది బాధితురాలిని ‘బాధితురాలి స్థాయి’ నుంచి ‘విజేతగా’ మార్చే ఒక వైజ్ఞానిక ప్రయాణం. నిపుణులైన సైకాలజిస్టుల సహాయంతో ఈ చికిత్స తీసుకోవడం ద్వారా కోల్పోయిన ఆత్మగౌరవాన్ని, మానసిక ప్రశాంతతను పూర్తిగా తిరిగి పొందవచ్చు.