Photography | ఫొటోగ్రఫీలో ‘రూల్ ఆఫ్ థర్డ్స్’ అనేది అత్యంత ముఖ్యమైన, ప్రసిద్ధమైన కంపోజిషన్ సూత్రం. ఇది మీ సబ్జెక్ట్‌ను ఫొటోలో ఎడమ లేదా కుడి మూలన మూడో భాగంలో ఉంచుతుంది. మిగిలిన రెండు భాగాలను ఓపెన్‌గా చూపిస్తుంది. దాంతో.. ఫొటో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫొటోగ్రఫీలో మరింత పురోగతి సాధించడంలో ‘రూల్ ఆఫ్ థర్డ్స్’ సహాయపడుతుంది. ఇది పోర్ట్రెయిట్లు, ల్యాండ్‌స్కేప్స్, వైల్డ్లైఫ్తోపాటు అన్ని రకాల ఫొటోగ్రఫీల్లో ఉపయోగపడుతుంది.
ఇప్పుడొస్తున్న అన్ని రకాల ప్రొఫెషనల్ కెమెరాలు, స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో ‘గ్రిడ్ లైన్స్’ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేస్తే.. ఫ్రేమ్‌పై అడ్డంలో మూడు, నిలువుగా మూడు గీతలు కనిపిస్తాయి. ఈ గీతలు ఫ్రేమ్ మొత్తాన్నీ తొమ్మిది సమాన భాగాలుగా విభజిస్తాయి. ఈ అడ్డం – నిలువు గీతలు నాలుగు చోట్ల కలుస్తాయి. ఆ నాలుగు పాయింట్లను.. ‘పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా పిలుస్తారు. వీటి సాయంతోనే రూల్ అఫ్ థర్డ్స్ని అమలు చేయవచ్చు. ఇక మీరు ఫొటో తీయాలనుకున్న ముఖ్యమైన అంశం (సబ్జెక్ట్ లేదా దృశ్యం).. ఈ గ్రిడ్ లైన్స్ కలిసే ‘పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్’పై ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మిగతా భాగం మొత్తం ఓపెన్‌గా కనిపిస్తూ.. మీ మెయిన్ సబ్జెక్ట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత, ఆకర్షణను తీసుకొస్తుంది.
సాధారణంగా మెయిన్ సబ్జెక్ట్‌ను మధ్యలో ఉంచి ఫొటోలు తీస్తుంటారు. ఇలాంటివి ఒక్కోసారి బాగున్నట్లు అనిపించినా.. చాలా సందర్భాల్లో బోరింగ్‌గా అనిపిస్తాయి. అదే ‘రూల్ ఆఫ్ థర్డ్స్’ ఉపయోగించడం వల్ల.. ఆయా చిత్రాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఈ ‘రూల్ ఆఫ్ థర్డ్స్’ నియమం.. ‘నెగటివ్ స్పేస్’ భావనతో ఉంటుంది. అంటే.. ఎడమ/ కుడివైపు చూస్తున్న సబ్జెక్టును ఫొటో తీసేటప్పుడు, ఫ్రేమ్‌లోని ఓపెన్ సైడ్‌లోకి చూసేలా ఉండాలి. ఇది ఫొటోకు ‘బ్రీతింగ్ రూమ్’గా పనిచేస్తుంది. సబ్జెక్టు చూపులను వీక్షకులు అనుసరించడానికి అనుమతించే నెగటివ్ స్పేస్‌ను అందిస్తుంది.
వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ, యాక్షన్ ఫొటోగ్రఫీ చేసేటప్పుడు ‘రూల్ ఆఫ్ థర్డ్స్’ను పాటించేంత సమయం దొరక్కపోవచ్చు. కొన్నిసార్లు క్షణాల్లోనే ఫొటోలు తీయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో.. ఎడిటింగ్ ద్వారా ‘రూల్ ఆఫ్ థర్డ్స్’ను ఇంప్లిమెంట్ చేయొచ్చు. అన్నిరకాల ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లలో ‘క్రాప్’ టూల్స్ ఈ రూల్ ఆఫ్ థర్డ్స్ నియమాన్ని కలిగి ఉంటాయి. మీ ఫొటోలు ఈ నియమాన్ని పాటించేలా క్రాప్ చేసుకునే వీలు కల్పిస్తాయి.
మీ కెమెరాలో ‘గ్రిడ్ లైన్స్’ను ఎనేబుల్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. పార్కులోనైనా, వీధుల్లోనైనా.. ‘రూల్ ఆఫ్ థర్డ్స్’ను అనుసరిస్తూ ఓ పది ఫొటోలు తీసుకోండి. మీ సబ్జెక్ట్ ఎక్కడ ఉంటే.. ఫొటో అందంగా కనిపిస్తున్నదో గమనించండి. మీరు దీన్ని ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే.. అది మీ తలలో అంతగా నాటుకుపోతుందని తెలుసుకోండి. చివరగా.. రూల్ ఆఫ్ థర్డ్స్ను కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరంలేదు. ఇది ఒక మార్గదర్శకం మాత్రమే! శాసనం కాదని గుర్తుంచుకోండి.