పరీక్ష ఫెయిల్ అయ్యాడని ఓ విద్యార్థి బలవన్మరణం.. సంసారంలో ఇబ్బందులు వచ్చాయని దంపతుల ఆత్మహత్య.. ఫోన్ ఇవ్వలేదని యువతి సూసైడ్.. ఇలా చిన్నాపెద్దా కారణాలకు జీవితం చాలించడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఆత్మహత్య అనేది వ్యక్తిగత సమస్య నుంచి సామాజిక పీడగా మారింది. వీటి నివారణకు ప్రపంచ వ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ పదో తేదీన ఆత్మహత్యల నివారణ దినం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలు ఏంటి? వాటిని నివారించడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.
వ్యక్తులు ఆత్మహత్యకు పూనుకోవడం అనేది మానసిక, సామాజిక, జీవశాస్త్ర, భావోద్వేగ అంశాల కలయిక. సైకాలజీ ప్రకారం ఆత్మహత్య ఆలోచనలు, చర్యలకు దారితీసే ముఖ్యమైన మానసిక కారణాలు ఇలా ఉన్నాయి.
మానసిక విశ్లేషణలో ఆత్మహత్యకు హోప్లెస్నెస్ను అత్యంత ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు. ‘నా పరిస్థితి ఎప్పటికీ మారదు’, ‘నా సమస్యలకు పరిష్కారమే లేదు’ అనే నమ్మకం బలపడటం. భావోద్వేగాల తీవ్రతను తట్టుకోలేక, ఆ బాధ నుంచి బయటపడటానికి ఆత్మహత్యే ఏకైక మార్గమని భావించడం.
సుమారు 90% ఆత్మహత్య కేసులలో ఏదో ఒక రకమైన మానసిక రుగ్మత ముడిపడి ఉంటుంది. క్లినికల్ డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్, స్కిజోఫ్రెనియా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నవారిలో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.
సైకాలజిస్ట్ థామస్ జాయ్నర్ సిద్ధాంతం ప్రకారం ఆత్మహత్య ధోరణి రావడానికి ప్రధానంగా రెండు భావనలు కారణమవుతాయి.
భారంగా భావించడం: ‘నేను నా కుటుంబానికి, సమాజానికి ఒక భారం’, ‘నేను లేకపోతే అందరూ బాగుంటారు’ అనే అభిప్రాయం ఏర్పడటం.
సంబంధాల తెగతెంపులు: నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని, సమాజం నుంచి పూర్తిగా విడిపోయామనే తీవ్రమైన ఒంటరితనం పెరిగిపోవడం.
ఒత్తిడి తీవ్రమైనప్పుడు వ్యక్తి ఆలోచనా పరిధి చాలా కుచించుకుపోతుంది. సమస్యకు ఉండే ఇతర పరిష్కారాలు కనిపించవు. కొందరు ఆ క్షణంలో వచ్చిన తీవ్రమైన భావోద్వేగాన్ని నియంత్రించలేక ఆవేశంలో నిర్ణయం తీసుకుంటారు.
మద్యం, డ్రగ్స్ వంటి వ్యసనాలు నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇవి స్వయం నియంత్రణను తగ్గించి, ఆత్మహత్య ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశాన్ని పెంచుతాయి.
సమాజంలో ఆత్మహత్యల నివారణ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు, ఇది మానసిక విశ్లేషణ, సమాజ భాగస్వామ్యం, సకాలంలో అందించే మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ఆత్మహత్య ధోరణులను నిరోధించడానికి కొన్ని ప్రధాన వ్యూహాలు ఇలా ఉన్నాయి.
ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తి ప్రవర్తనలో మార్పులను ముందుగానే గుర్తించడం అత్యంత ముఖ్యం.
భావోద్వేగ సంకేతాలు: తీవ్రమైన నిరాశ, ఆశాహీనత, తమను తాము భారంగా భావించడం (‘నేను లేకపోతే అందరూ బాగుంటారు’ అనుకోవడం).
అందరికీ దూరంగా: స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా వేరుపడటం, ఒంటరిగా గడపడం.
ఇష్టమైనవి ఇచ్చేయడం: తమకు ఇష్టమైన వస్తువులను ఇతరులకు ఇచ్చేయడం లేదా అకస్మాత్తుగా వీలునామా వంటివి రాయడం.
మానసిక ఆరోగ్యం లేదా మానసిక సమస్యల గురించి మాట్లాడటం బలహీనత కాదని, చికిత్స తీసుకోవడం సాధారణ విషయమని అవగాహన కల్పించడం చాలా అవసరం. పాఠశాల స్థాయి నుంచే ఒత్తిడి నిర్వహణ, వైఫల్యాలను తట్టుకునే మానసిక శక్తి, భావోద్వేగ నియంత్రణను బోధించడం ముఖ్యం. ఆత్మహత్య వార్తలను సెన్సేషనలైజ్ చేయకుండా, పద్ధతులు వివరించకుండా, హెల్ప్‌లైన్ నంబర్లతో బాధ్యతాయుతంగా ప్రచురించేలా చూడాలి. చివరిగా, ఆత్మహత్యల నివారణ ఏ ఒక్కరి ప్రయత్నంతో సాధ్యం కాదు. ప్రభుత్వాలు, సమాజంలోని అన్ని వర్గాల వారు సమష్టిగా కదిలితేనే వీటిని ఆపగలం. ఇది అందరి బాధ్యత.