ఆ మధ్య వచ్చిన ఫిదా మూవీలో హీరోయిన్ సాయి పల్లవి హీరో వరుణ్ తేజ్‌తో ‘గట్టిగా అనుకో.. ఐపోయిద్ది’ అంటూ ఉంటుంది. సినిమాల్లో అంతే చెప్తుంటారులే, మంత్రాలకు చింతకాయలు రాలతాయా.. అనే సందేహం కలగొచ్చు. ఓ శాస్త్రీయ పద్ధతిలో అనుకుంటే మాత్రం మాటే మంత్రం అవుతుందని, సానుకూల ఫలితాలు వస్తాయని సైకాలజీలోని స్వీయ ధ్రువీకరణ సిద్ధాంతం చెబుతున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల అసెంబ్లీ సమయంలో విద్యార్థులకు రోజుకు కనీసం రెండు స్వీయ ధ్రువీకరణలను అలవాటు చేయాలని సీబీఎస్ఈ ఆదేశించడంతో వీటిపై అందరి దృష్టీ పడింది. అసలు ఈ స్వీయ ధ్రువీకరణలు ఏంటి, మనుషులపై వాటి ప్రభావం ఎంత.. అనే విషయాలు తెలుసుకుందాం.
‘మాటే మంత్రము .. మనసే బంధము..’ ఇది అప్పుడెప్పుడో వచ్చిన సీతాకోకచిలుక సినిమాలోని పాట. అందులో చెప్పినట్టుగానే మాటకు, మనసుకు బంధం ఉంది. మంచి మాట మనసుపై మంత్రంలా పనిచేసి మేలుచేస్తుంది. అలాంటి మాటలనే స్వీయ ధ్రువీకరణలు అంటారు. వీటి ప్రభావంపై మానసిక నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, స్వీయ ధ్రువీకరణల సాయంతో సానుకూల ఫలితాలు సాధించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. స్వీయ ధ్రువీకరణలు మనసు, శరీరంపై ప్రభావం చూపి ఆలోచన విధానం, ప్రవర్తనలను మార్చడంతో పాటు కష్ట కాలాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తాయని ఈ పరిశోధనలు రుజువు చేశాయి. రోజూ సానుకూల స్వీయ ధ్రువీకరణలను సాధన చేయటం ద్వారా మెదడులో నూతన నాడీకణ దారులు ఏర్పడి సానుకూల ఆలోచనలు, సానుకూల ప్రవర్తన వృద్ధి చెందుతాయి.
సానుకూల స్వీయ ధ్రువీకరణలను రూపొందించుకుంటే సరిపోదు, వాటిని రోజు సాధన చేస్తేనే అనుకున్న ఫలితాలు దక్కుతాయి. సైకోథెరపిస్ట్ రోనాల్డ్ అలెగ్జాండర్ ప్రకారం స్వీయ ధ్రువీకరణలను రోజు మొత్తంలో కనీసం మూడు నుంచి ఆరుసార్లు సాధన చేయాలి. ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు మనసులోగానీ, బయటికి గానీ గట్టిగా సాధన చేయాలి. రోజూ డైరీలో రాయడంతో పాటు, అద్దం ముందు నిల్చుని పలుకుతూ సాధన చేయాలి. ఇలా చేస్తే స్వీయ ధ్రువీకరణల నుంచి మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
ఎవరో రూపొందించిన స్వీయ ధ్రువీకరణలను సాధన చేయడం కంటే సొంతంగా రూపొందించుకున్న వాటితోనే ఫలితాలు బాగుంటాయని సైకాలజీ చెప్తుంది. స్వీయ ధ్రువీకరణ రూపకల్పన, సాధనలో థింక్ అప్, షైన్, యునిక్ డైలీ అఫ్రిమేషన్స్ వంటి యాప్‌ల సాయం తీసుకోవచ్చు. యద్భావం తద్భవతి అని భగవద్గీతలో చెప్పింది ఈ సానుకూల స్వీయ ధ్రువీకరణల గురించే. ధ్రువీకరణలను శాస్త్రీయ పద్ధతిలో రూపొందించి, క్రమపద్ధతిలో సాధన చేయడంద్వారా విజయాలను అందుకోవచ్చు. శాస్త్రం చెప్పినా, సంస్కృతి చెప్పినా మనిషి మనుగడ కోసమే, మంచి కోసమే. ఇది గుర్తెరిగి సానుకూల స్వీయ ధ్రువీకరణలను సాధనచేస్తే వ్యక్తి శ్రేయస్సుతోపాటు సమాజ శ్రేయస్సుకూడా సాధ్యమే! శుభం భూయాత్!
స్వీయ ధ్రువీకరణలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా, సాధన చేసి సాధించేద్దాం అనుకుంటే పొరపడినట్టే. వీటి సాధనకు నిర్దిష్ట పద్ధతులు, ప్రమాణాలు ఉన్నాయి. మూడు ‘పీ’లు ముఖ్యం.. స్వీయ ధ్రువీకరణలను రూపొందించడంలో మూడు ‘పీ’లు చాలా ముఖ్యమైనవి. అవి ప్రెజెంటెన్స్, పాజిటివ్, పర్సనల్. స్వీయ ధ్రువీకరణ ఎప్పుడూ కూడా వర్తమాన కాలాన్నే సూచించాలి. భూత, భవిష్యత్తు కాలాలతో రూపొందించిన ధ్రువీకరణలు ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. ధ్రువీకరణలు ఎప్పుడూ సానుకూలంగానే ఉండాలి. ప్రతికూల ధ్రువీకరణలతో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ధ్రువీకరణ ఎప్పుడూ కూడా వ్యక్తిగత విషయాలకు సంబంధించే ఉండాలి. వీటితో వ్యక్తిలో మార్పు రావచ్చుగాని, సమాజంలో ఎలాంటి మార్పూ రాదు.