యంత్రాల సాయంతో శస్త్ర చికిత్సలు చేయడం కొత్తేమీ కాదు. లాప్రోస్కోపీ గురించి రకరకాల వార్తలు, ప్రకటనలు చూస్తేనే ఉన్నాం. ఈ విధానంలో చిన్నపాటి కోతలతోనే సర్జరీ పూర్తయ్యే మాట వాస్తవమే కానీ… రెండు లొసుగులు ఉన్నాయి. ఒకటి- శస్త్రచికిత్స చేసే యంత్రాన్ని నిరంతరం ఓ నిపుణుడు గమనిస్తూ ఉండాలి. అంటే అటు యంత్రమూ, ఇటు మనిషీ కూడా పని చేయాల్సిందే. రెండు- పేగులు లాంటి కణజాలం మీద యంత్ర చికిత్స అంత తేలిక కాదు. కారణం! కుట్టులో వెంట్రుకవాసి తేడా వచ్చినా ప్రాణాంతకమే. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ఈ పరిమితులను అధిగమించే రోబోను రూపొందించారు. ‘స్టార్’ (Smart Tissue Autonomous Robot) అని పిలుచుకునే ఈ రోబో ఇప్పటికే జంతువుల్లో మృదుకణజాలం మీద విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించింది. పేగుల కొసలను కచ్చితంగా కలుపుతూ కుట్లు వేసింది. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ, ఏమాత్రం తొట్రుపాటు లేకుండా సర్జరీ చేసే ఈ రోబోను మధ్యమధ్యలో వైద్యులు గమనించుకుంటే చాలు.