‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? రాజాజ్ఞ దైవాజ్ఞ. రాజ్యాధికారం దైవదత్తం’… ఇవన్నీ పూర్వకాలపు మాటలు, నమ్మకాలు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. ఈ రాచరికపు గబ్బు వాసనలు పోగొట్టుకోకుండా జీవిస్తున్నాం. పాలకులు రాజ్యాధికార లాలసత్వానికి ఎంతగా పాకులాడుతారో, రాజధర్మం పేరిట ఎంతటి నయవంచన గావిస్తారో తెలియజెప్పే వ్యంగ్య నాటిక ‘జంబూ ద్వీపం’.
‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అన్న మహాకవి శ్రీశ్రీ వాక్కులతో తెర తొలగుతుంది. తుఫాన్‌కు కొట్టుకొచ్చిన ఓ చిన్న పడవలోంచి ప్రజాపతి, నంది బయటపడతారు. ప్రజాపతి మూర్చిల్లుతాడు. చనిపోయాడని నంది కంగారు పడతాడు. అది జంబూద్వీపం. ఆ ద్వీపానికి రాజు బృహస్పతి. ‘ప్రజాపతి.. అంటే ప్రజలకు మొగుడు. వీడు బతికున్నప్పుడు మీరు వెధవలైతే, పోయాడుగా.. ఇప్పుడు విధవలు. గుళ్లు కొట్టించుకోండి!’ ఇలా పచ్చిగా చురకలంటిస్తుంటాడు బృహస్పతి.
సింహాసనం పేరు వినబడగానే ప్రజాపతి దిగ్గున లేచి కత్తి దూస్తాడు. ‘ఎవడ్రా నా సింహాసనంపై కన్నేసి అధిష్టించే కుక్క. వాడి తల తీసి కోట గుమ్మానికి వేలాడకడతా’ అంటాడు. ప్రజాపతి పెళ్లి చూపులకు వెళ్తుంటే ఆ ప్రమాదం సంభవిస్తుంది. వారి పెళ్లి క్రమంలో గతంలో దాదాపు ఏడుగురు స్త్రీలు గతిస్తారు. రాజు ప్రజాపతి, నందికి ఆకలేస్తుంది. జంబూ ద్వీపంలో గాలి భోంచేసి బతుకుతారని చెప్పి బృహస్పతి వారిని ఆటపట్టిస్తాడు. జింక, పావురాయి, నెమిలి దేన్నో ఒకదాన్ని తెచ్చి ఆకలి తీర్చమని నందికి ఆదేశాలిస్తాడు ప్రజాపతి. అవేవీ దొరకవు. అక్కడ ఓ చెట్టుకు పళ్లుంటాయి. పళ్లు రాల్చే క్రమంలో రాజుగారి కత్తి కొమ్మల్లో చిక్కుకుపోతుంది. కత్తి అధికార చిహ్నం ఇప్పుడెలా?
‘అమాయకుల కంఠాన్ని ఉత్తరించు కత్తి మేధావుల విజ్ఞానాన్ని వెక్కిరించుకత్తి పారంపర్యం అంటూ పరవశించే పవరు కత్తి చేజారింది. పవర్ ఫెయిల్యూర్’ ఇప్పుడు అధికారం నీ చేతికి వస్తే నీవే రాజువని నందిని ఎగదోస్తాడు బృహస్పతి. ‘నేనంత అధికారాన్ని మోయగలనా?’ అని నంది అంటే… ‘ఫర్వాలేదు. అధికారమే నిన్ను మోస్తుంది. రాజుకి బుర్ర ఉండక్కర్లేదు. హృదయం ఉండక్కర్లేదు. స్వార్థం ఉంటే చాలు. అది నీకు పుష్ఠిగా ఉంది’ అని బృహస్పతి బదులిస్తాడు. నందికి ఆ మాటలు నచ్చుతాయి. అధికారం చేబూని ప్రజాపతికే ఆజ్ఞలు జారీ చేస్తాడు నంది. తిమ్మి బమ్మి అయింది. బృహస్పతి ఆ తమాషా చూస్తుంటాడు. ఇప్పుడు నందికి విందుతోపాటు పొందు కూడా కావాల్సి వచ్చింది. నడమంత్రపు సిరికి కామం ప్రకోపించింది. ఇది సరికాదని భావించి చెట్టున ఇరుక్కున్న కత్తిని తీసి ప్రజాపతికి అందిస్తాడు బృహస్పతి. నందిని శిక్షించడానికి ప్రజాపతి కత్తితో వెంట పడతాడు. ఆ దారి మధ్యలో మూగవాడు హన్మంతు వారికి ఎదురుపడతాడు. అతడు గంగపుత్రుడు. అతని సహాయంతో ఓ పెద్ద చేపను పడతారు. నిప్పు రాజేసి, రాజు గారి కత్తికి చేపలు గుచ్చి కాలుస్తారు. అవి ఆరగించిన రాజు తృప్తి చెందుతాడు. ఆకలి తీరిన తర్వాత వినోదం మొదలవుతుంది. హన్మంతు వలను చెట్టుపైకి విసిరి ఓ కొసనలాగుతూ, అందిపుచ్చుకోమని ఇద్దరి మధ్యన పోటీ పెడతాడు. ఇప్పుడు తెలిసిందా… రాజు అంటే ఎవరో? మీ కడుపులు కొట్టి తమ కడుపులు నింపుకొనే వారు’ అని హెచ్చరిస్తాడు బృహస్పతి.
హన్మంతు సహకారానికి మెచ్చిన రాజు ఆకాశం రాసి ఇస్తాడు. ఆకాశం అందరిది. అదీ శూన్యం. ‘చూశావా నీ చుట్టూ మాయాపొరలు. అధికారపు సాలె గూళ్లు అల్లుకుంటున్నాయి. మేలుకో’ అని బృహస్పతి హెచ్చరిస్తాడు. ‘ఏరా నోరులేని ప్రజల్ని రెచ్చగొట్టి విప్లవం లేవదీయాలని చూస్తావా’ అంటూనే బృహస్పతి జుట్టుపట్టుకుని రాజు కర్కశంగా ఈడుస్తాడు. ‘మనది శాంతిని కామించే దేశం. ధర్మాన్ని ప్రేమించే దేశం. ఇలాంటి వారికి ఇదే కఠిన శిక్ష’ అంటూ బృహస్పతి నాలుక తెగ్గోస్తాడు రాజు. ఆ పనికి నంది సహకరిస్తాడు. హన్మంతుకు ఏడుపులో నుంచి కోపం తన్నుకు వస్తుంది. ఉగ్రుడవుతాడు. ఆ ఇరువుర్ని సంహరిస్తాడు. తెరపడుతుంది. ముప్పై ఏళ్ల క్రితం నాటికైనా సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతుంది. సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారు రవీంద్ర భారతిలో ఇటీవల ప్రదర్శించారు.
నాటిక పేరు : జంబూ ద్వీపం
రచన: తనికెళ్ల భరణి
దర్శకత్వం: మంజునాథ్
ప్రదర్శన: సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్
పాత్రధారులు: గోవర్ధన రెడ్డి,
సతీష్, మంజునాథ్, ప్రశాంత్