Personality Development Tips | నీ అలవాట్లే నీ ఆలోచనలు. నీ ఆలోచనలే నీ ఆచరణ. నీ ఆచరణలే నీ వ్యక్తిత్వం. నీ వ్యక్తిత్వమే నువ్వు. నిన్ను నువ్వు మార్చుకోవడం అంటే నీ అలవాట్లను మార్చుకోవడం. అలవాట్లలో చిన్నచిన్న మార్పుల ద్వారా గొప్ప ఫలితాలను సాధించవచ్చు.
ఎన్ని గంటలకు నిద్ర లేస్తామన్నది ఓ అలవాటు. లేవగానే బ్రష్ చేసుకుంటామా లేకపోతే, నేరుగా బెడ్‌కాఫీ తాగేస్తామా అన్నది ఓ అలవాటు. కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తామా, పేపర్ చదివాకే కాఫీ తాగుతామా అన్నది ఓ అలవాటు. అసలు కాఫీ, దినపత్రిక లాంటివి కూడా అలవాట్లే. ఎవరో ఒకరు చెప్పేదాకా ఫలానా అలవాటు మనకు ఉందన్న విషయం కూడా కొన్నిసార్లు తెలియకపోవచ్చు. కాబట్టి, ఇప్పటినుంచైనా ఎరుకతో వ్యవహరించండి. మీ ప్రతీ చర్యనూ గమనించండి. ఏది అలవాటో, ఏది కాదో మీకే అర్థమైపోతుంది. అందులో హానికరమైన అలవాట్లు ఏమిటి, హానికరం కాని అలవాట్లు ఏమిటి, మొగ్గలోనే తుంచాల్సిన అలవాట్లు ఎన్ని, మరింత పదును పెట్టుకోవాల్సిన అలవాట్లు ఎన్ని? అన్నది స్పష్టంగా అర్థమైపోతుంది.
గెలుపు హఠాత్తుగా ఆకాశంలోంచి ఊడిపడదు. అనేక సంవత్సరాల కృషి ఫలితమది. ఆ విజయ యాత్రను ఎప్పుడో ఎక్కడో చిన్నగా మొదలుపెట్టి ఉంటారు. అదే మలుపులు దాటుకుని, ఎగుడుదిగుళ్లు అధిగమించి.. ఆ విజేతను ఇక్కడిదాకా తీసుకొచ్చింది. ప్రతి గెలుపు వెనుకా ఓ స్త్రీ ఉంటుందో లేదో కానీ, ప్రతి విజేత వెనుకా కొన్ని అలవాట్లు మాత్రం ఉండే ఉంటాయి. తెల్లవారుజామునే మేల్కొనడం అనేది.. నూటికి తొంభై శాతం మంది విజేతల అలవాటు. ప్రపంచం గురకపెట్టి నిద్రపోతున్న సమయంలో వాళ్లు విజయ వ్యూహాలు రచించుకుంటారు. ఉదయాన్నే లేచే అలవాటు ఉన్నవారి చేతిలో ఓ రెండుమూడు గంటలు అదనంగా ఉంటాయి. విజేతలను, పరాజితులను నిర్ణయించేది.. ఆ కొద్దిపాటి
సమయమే.
కుటుంబం, సమాజం, స్నేహాలు, సినిమాలు.. మనకు తెలియకుండానే మన అలవాట్లను శాసిస్తాయి. ఇప్పటివరకూ ఆ ప్రవాహంలోనే కొట్టుకుని వచ్చారు మీరు. ఇక ఆనకట్ట కట్టేయండి. ప్రతి అలవాటునూ భరించాల్సిన పన్లేదు. మీ లక్ష్యానికి తగినట్టు మీ అలవాట్లను రీ డిజైన్ చేసుకోండి. గొప్ప రచయిత కావాలన్నది మీ ఆశయం అయితే.. పుస్తక పఠనాన్ని మీ అలవాటుగా ఎంచుకోండి. ఆంత్రప్రెన్యూర్‌షిప్ మీ స్వప్నం అయితే.. రోజుకో గంట కొత్త ఐడియాలకు అంకితం చేయండి. మార్కెటింగ్‌లో ఓ వెలుగు వెలగాలన్న కోరిక ఉంటే నెట్వర్కింగ్ కోసమే ఓ గంట కేటాయించండి. మీ లక్ష్యంతో ఏమాత్రం సంబంధంలేని అలవాట్లను సాధ్యమైనంత తగ్గించుకోండి. కానీ ఒక్క విషయం.. కొన్ని అలవాట్లు మన విజయానికి ఏమాత్రం సంబంధం లేనివైనా.. వాటి ద్వారా అపారమైన సంతృప్తి లభించవచ్చు. ప్రయాణాలు, సామాజిక సేవ, సంగీతం, చిత్రలేఖనం.. అలాంటివే. ఇవన్నీ లాభదాయకం కాకపోవచ్చు, కానీ ఆనందదాయకమైనవి. వాటిని మాత్రం వదులుకోవద్దు.
కొన్ని అలవాట్లను వదిలించుకోవాలంటే, కొన్ని అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలంటే.. కొత్త వాతావరణాన్ని సృష్టించుకోవాలి. మీ స్నేహితులకు పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే, మీలో కూడా క్రమంగా ఆ ఆసక్తి తగ్గిపోతుంది. ఇదంతా వాతావరణ మహత్యం. కాబట్టి, ఓ కొత్త వాతావరణాన్ని సృష్టించుకోండి. బుక్ రీడర్స్ క్లబ్ లాంటి సంస్థల్లో చేరండి. తరచూ లైబ్రరీకి వెళ్లండి. ఆన్లైన్ పుస్తక సమీక్షకుల గ్రూప్‌లో లాగిన్ అవ్వండి. దీనివల్ల కొత్త వాతావరణం పరిచయం అవుతుంది. పౌరాణిక సినిమాల్లో ఆగ్నేయాస్ర్తానికి విరుగుడుగా వారుణాస్త్రం ప్రయోగించినట్టు.. మీలోని చెడు అలవాట్లపై మంచి అలవాట్లను సంధించవచ్చు. కాఫీ అలవాటుకు దూరం కావడానికి పండ్లరసాన్ని అలవాటు చేసుకోవచ్చు. ఆలస్యంగా నిద్రలేచే అలవాటుకు తెల్లవారుజామునే జిమ్‌కు వెళ్లడం ద్వారా చెక్ పెట్టవచ్చు.
దుబారా-పొదుపు, ఆడంబరం-నిరాడంబరత, దీర్ఘకాలిక దృష్టి- స్వల్పకాలిక ప్రయోజనాలు.. ఇవన్నీ ఆర్థిక అలవాట్ల కిందికే వస్తాయి. నూటికి తొంభైతొమ్మిది మంది సామాన్యంగా జీవితాన్ని ప్రారంభిస్తారు. అంతిమంగా అతికొద్దిమందే కుబేరులు అనిపించుకుంటారు. వారెన్ బఫెట్ నుంచి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వరకూ.. ఆర్థిక అలవాట్లే వాళ్లను విశ్వ సంపన్నుల జాబితాలో చేర్చాయి. సామాజిక అలవాట్లు కూడా ముఖ్యమైనవే. ఆత్మీయులు, కుటుంబం కోసం కొంత సమయం కేటాయించడం.. ప్రత్యేక సందర్భాలను గుర్తుంచుకుని మరీ శుభాకాంక్షలు తెలపడం, వివాహాది శుభకార్యాలకు హాజరు కావడం, కష్ట సమయాల్లో ధైర్యం చెప్పడం, అవసరమైతే ఆదుకోవడం.. ఉత్తమ సామాజిక జీవికి ఉండాల్సిన అలవాట్లు.
బాస్‌తో వేగలేకపోతున్నారా? అతన్ని ఎలా మెప్పించాలో తెలియట్లేదా? ఈ టిప్స్ మీకోసమే!!