ఇంటర్ సెకండ్ ఇయర్‌కు వచ్చేసరికి.. నాకు ఇద్దరు కొత్త స్నేహితులు ఏర్పడ్డారు. వారు అంజని, జయశ్రీ. నాతో క్లోజ్‌గా మాట్లాడుతుండేవారు. అప్పటికి నాకెందుకో ఇంటి మీద బాగా బెంగ ఏర్పడింది. ఇక్కడ అస్సలు ఉండబుద్ధి అయ్యేది కాదు.
నేను హైదరాబాద్‌లో పుట్టినా, ఇక్కడి బంధువుల దగ్గరికి ఏడాదికి ఒకటిరెండు సార్లు వచ్చినా.. చూడటానికే తప్ప పెర్మనెంట్‌గా ఉండటానికి భాగ్యనగరం నచ్చేది కాదు. ఎప్పుడెప్పుడు మా ఊరికి వెళ్లిపోదామా?! అనిపించేది. నా అంతట నేను ఎవరినీ పలకరించి, పరిచయం చేసుకుని స్నేహం పెంచుకునేటంత చొరవ నాకు అప్పటికి లేదు. ఎవరైనా పలకరిస్తే మాట్లాడేదాన్ని, స్నేహం చేస్తే దగ్గరయ్యేదాన్ని.
అంజని నా కంటే కనీసం మూడేళ్లు పెద్దది. చీర కట్టుకుని కాలేజీకి వచ్చేది. అందువల్ల మరికాస్త పెద్దగా కనిపించేదేమో! కొంచెం పెద్దరికంతో నన్ను గారాబంగా చూసేది. “అన్నం తిన్నావా? ఏంటి ముందులాగా యాక్టివ్‌గా లేవు? ఏమైనా ప్రాబ్లమా?” అని ప్రశ్నలు వేస్తుండేది. “నీకు ముందు నుంచే ఇంత పెద్ద జడ ఉందా? తలకు ఏం రాస్తావు?” అనడిగితే.. “కొబ్బరి నూనె” అని చెప్పాను సిన్సియర్‌గా. అంజని పకపకా నవ్వి.. “కొబ్బరి నూనేలే! అందరూ అదే రాస్తారు. ఏ బ్రాండ్ అనీ!” అంది. నాకు అర్థమే కాలేదు. ఫ్యాషన్ ప్రపంచంలో నేను చాలా వీక్!
“అట్ల కాదబ్బా! నువ్వు వాడే కొబ్బరి నూనె సీసా మీద గానీ, డబ్బా మీద గానీ పేరుండదా? ఏమని ప్రింట్ అయి ఉంటుందో చెప్పు! ఏం లేదు, నేను కూడా వాడదామని” అంటూ వివరించింది. తన జుట్టు రింగులు రింగులుగా పొట్టిగా ఉండేది. “ఓ! టాటా కొబ్బరి నూనె. పైన కొబ్బరిచెట్టు బొమ్మ కూడ ఉంటది” చెప్పాను.
“నువ్వు ఎంత బాగుంటావు తెల్సా? మొహానికి ఏం రాస్తావు? నీ స్కిన్‌లో భలే గ్లో ఉంటుంది. ఏం వాడతావు?” అని అడిగి.. నేను సౌందర్య సాధనాలు ఏవీ వాడనని తెలిసి ఆశ్చర్యపోయింది.
“అదేంటబ్బా! ఫేస్ క్రీమ్ వాడవు, మాయిశ్చరైజర్ వాడవు, పెర్ఫ్యూమ్ వాడవు, ఏం పిల్లవసలు?” అంటూ బోలెడు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది. అసలు ఆడపిల్లలు అవన్నీ వాడతారని తెలియదు నాకు. ముందు వాటి పేర్లే తెలియని నేను ఆశ్చర్యపోయాను. అంతే కాదు.. జుట్టు కత్తిరించుకోవడం ఓవర్ ఫ్యాషన్‌గా భావించే రోజులవి. మా అమ్మ గానీ, చిన్నమ్మలు, అత్తలు గానీ అంతే. మొహాన కుంకుమ పెట్టుకునేవారుగానీ, మరేమీ వాడేవారు కాదు. ఎప్పుడైనా బయటి ఊర్లకు వెళ్తేనో, పెళ్లిళ్లకో, పేరంటాలకో, సినిమాలకో వెళ్లినప్పుడు మాత్రమే మొహాలకు కాస్త పౌడరు రాసుకునేవారు. కళ్లకు కాటుక కూడా అందరూ పెట్టుకునేవారు కాదు. కొందరు అప్పుడప్పుడూ మొహాలకు స్నో రాసుకునేవారు. దాన్ని ఇప్పుడు కోల్డ్ క్రీమ్ అంటున్నారు. పాండ్స్ పౌడర్, క్యూటికురా పౌడర్, హిమాలయా స్నో, ఐటెక్స్ కాటుక.. ఈ పేర్లు మటుకు తెలుసు నాకు.
అవును మరి, ఫీజులు కట్టడం, పుస్తకాలు, నోట్ బుక్స్, రికార్డ్ బుక్స్, ఇతర ఖర్చులకే వెతుక్కునే కుటుంబాల అమ్మాయిలు ఇవన్నీ ఎక్కడినుంచి వాడతారు? ఒక్క సినిమా తారలే మేకప్ వేసుకుంటారని అప్పటి నా ప్రగాఢ విశ్వాసం. మా కాలేజీలో చదివే అమ్మాయిలు రోజుకో డ్రెస్ వేసుకొస్తుంటే.. మొత్తానికే అయిదారు జతల బట్టలున్న నేను నోరెళ్లబెట్టి చూస్తుండేదాన్ని. వాళ్లతో అప్పియరెన్స్‌లో గానీ, చకాచకా మాట్లాడటంలోగానీ పోటీ పడలేని నేను.. మొహమాటంగా, బిడియంగా వెనకెనక ఉండేదాన్ని. నాలాంటి వాళ్లు కూడా మా క్లాసులో ఉండేవారేమో గానీ, వాళ్లను వెతికి పట్టుకోవడంలో నేను విఫలమయ్యాను.
ఇంతకూ నేను చాలా సిగ్గుపడి, గుర్తు చేసుకున్నప్పుడల్లా మొహమంతా ఎర్రబడేలా చేసే ప్రశ్న ఒకటి నన్ను అంజని అడిగింది. అదేమిటంటే.. “అసలు నువ్వు అయినవా?” అని. నాకు అర్థం కాలేదు. మళ్లీ అడిగింది. “నువ్వు మెచ్యూర్ అయినవా లేదా?” అని. లేదన్నాను. “ఇంటర్ సెకండ్ ఇయర్‌కు వచ్చావు, ఇంకా కాలేదా? మీ వాళ్లు ఎవరైనా డాక్టర్‌కు చూపించలేదా?” అన్నది. “ఎందుకు?” అన్నాను. అప్పటికే నా కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి. “నీ ఏజ్ ఎంత?” మళ్లీ అడిగింది. చెప్పాను. మా అక్క కూడా ఇంటర్‌లోనే అయిందని చెప్పాక.. “ఓ! నీకింకా పద్నాలుగేనా? అయినా నువ్వు లక్కీ లే! ఇప్పట్నుంచీ ఆ బాధలన్నీ ఎందుకు? కానీ, ఇంకా లేట్ అయితే మటుకు నా మాటలు గుర్తుపెట్టుకో!” అంది.
అంజని వాళ్లిల్లు మలక్‌పేట దగ్గర్లో చందానగర్‌లో ఉండేది. ఒకటి రెండుసార్లు మధ్యాహ్నం క్లాసులెగ్గొట్టించి మరీ నన్ను తీసుకెళ్లింది. వాళ్లమ్మ ఉంది ఇంట్లో. చాలా ప్రేమగా మాట్లాడింది. అలా నా విద్యా జీవితంలో మొదటిసారి నేను క్లాసు ఎగ్గొట్టింది. ఇప్పటి అమ్మాయిలు రెగ్యులర్‌గా బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లడం, బోలెడు డబ్బులు పోసి వాళ్లకు నచ్చినట్టుగా తయారవడం, రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవడం చూస్తుంటే.. తప్పని కాదు కానీ, ఇంత డబ్బు సౌందర్యం కోసం ఖర్చుపెట్టడమా!? అనిపిస్తుంది. ఇప్పుడు మనదేశంలో కోట్ల టర్నోవర్‌తో బ్యూటీ ఇండస్ట్రీ నడుస్తున్నది. ఇది గమనిస్తే ఆనాటి అంజని మాటలు గుర్తొస్తాయి. ఇంటర్ తరువాత అంజని మళ్లీ నాకెప్పుడూ కలవలేదు. ఫోన్లు లేని రోజులవి. ఎందుకో అడ్రెస్ తీసుకోవాలని కూడా తెలియలేదు. ఇప్పుడెక్కడుందో!
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి