మహిళామణుల కథాయాత్ర
స్త్రీ జీవితంలోని వివిధ దశలను స్పృశిస్తూ మద్దాళి ఉషాగాయత్రి అందించిన కథా సంపుటి.. అమ్మమ్మగారి కాశీయాత్ర. ఇందులోని కథలు.. మహిళల చుట్టూరా తిరుగుతాయి. వారి ఆలోచనా ధోరణులకు ప్రతీకలుగా నిలుస్తాయి. మొత్తం ఇరవై ఏడు కథల్లో ఎనిమిదోది ‘అమ్మమ్మగారి కాశీ యాత్ర’. ఇది కాశీ విశ్వేశ్వరుణ్ని దర్శించాలనుకొనే ఒక్క అన్నపూర్ణమ్మ కథే కాదు! ఇంటింటా నిరాదరణకు గురవుతున్న వృద్ధజీవుల వ్యథార్థగాథ. అన్ని వ్యసనాల్లోకెల్లా పరస్త్రీ వ్యామోహం అతి ప్రమాదకరమైనదని చాటే కథ ‘నన్ను క్షమించొద్దు’. ఇతర వ్యసనాలతో డబ్బు, ఆరోగ్యాన్ని కోల్పోతే.. పరస్త్రీ వ్యామోహం కుటుంబ విచ్ఛిన్నానికి కారణం అవుతుందని హెచ్చరిస్తుంది. ‘ఆనందపుటంచులు’లో కన్నతల్లికి పెళ్లి చేసే కూతురి ఉదారత్వాన్ని ఆవిష్కరించారు. కొన్ని కథల్లో ‘కరోనా’ మహమ్మారి వల్ల ప్రపంచం ఎంతగా అల్లాడిందో హృద్యంగా చెప్పారు. ముఖ్యంగా కరోనా చావు ఎంత ఘోరమైనదో చాటుతూ.. ‘ఆత్మ నిరీక్షణ’ను రాశారు. సరదాగా సాగుతూనే కరోనా కష్టాలను కండ్లముందు ఉంచిన కథ ‘ముహూర్తబలం’. ఇందులో లాక్డౌన్ ఇబ్బందులను వివరిస్తూనే ముహూర్తబలం గొప్పదనాన్నీ చాటిచెప్పారు. ‘జీవితమంటేనే సర్దుకుపోవడం’ అంటుంది.. ‘అపార్ట్మెంట్’ కథ. భార్యాభర్తలుగా ఎలా ఉన్నా.. తల్లిదండ్రులుగా పిల్లల బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలంటారు ఈ కథలో. ఇలా సామాజిక, కుటుంబ వ్యవస్థలకు అద్దం పడుతూ, మహిళల ఆకాంక్షలను కండ్లముందు ఉంచారు రచయిత్రి ఉషాగాయత్రి.
అమ్మమ్మగారి కాశీయాత్ర
రచన : డా.మద్దాళి ఉషాగాయత్రి
పేజీలు : 256, వెల : రూ.150
ప్రచురణ : కిన్నెర పబ్లికేషన్స్
ప్రతులకు : డా.మద్దాళి ఉషాగాయత్రి,
99890 41777
వేములవాడ మట్టి పరిమళం
తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ. లేంబులవాడ అనే నామాంతరం కలిగిన ఈ ఊరు ఒకప్పుడు వేములవాడ చాళుక్యుల రాజధానిగా విరాజిల్లింది. అంతటి చారిత్రక ప్రశస్తి ఉన్న ఊరి మట్టితో పెనవేసుకుపోయిన యథార్థ సంఘటనల నేపథ్యంలో, పిన్నంశెట్టి కిషన్ స్వగతంగా అక్షరీకరించినవే ‘లేంబాళవాటిక కథలు’. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన ‘అమరావతి కథలు’ ప్రేరణగా ఈ కథలకు అంకురారోపణ జరిగిందన్నది రచయిత మాట. అక్కడ అమరేశ్వరుడు సాక్షిగా ఉంటే, ఇక్కడ సాక్షి రాజరాజేశ్వరుడు. కథకుడు బాల్యంలో బొంబాయి ప్రయాణం చేసిన ‘ఛుక్ ఛుక్ బండి’తో మొదలయ్యే ఈ కథలు చివరి వరకు విరామం, విసుగు లేకుండా చదివిస్తాయి. తెలంగాణ మాండలికంలో సాగిన ఈ కథలు వేములవాడ మట్టితోపాటు మానవత్వపు పరిమళాల్ని వెదజల్లుతాయి. రాజరాజేశ్వరస్వామి దేవాలయం, దర్గా, కోనేరు, చెరువు, వాగు, తీర్థయాత్రకు వచ్చే జనాలు… ఇలా ఆ ఊరి సందడినంతా కండ్లకు కడతాయి. అంతేకాదు ఇంత సందడి ఉన్న దేవుని సన్నిధానంలోనూ దురదృష్టం వెంటాడిన సంఘటనల్నీ రచయిత హృద్యంగా చిత్రించారు. పిన్నంశెట్టి కిషన్ తన జీవితానుభవాలను ఒక దగ్గర చేర్చి మానవీయ విలువలకు పెద్దపీట వేసి రాసిన ‘లేంబాళవాటిక కథలు’ వేములవాడ జీవనచిత్రానికి కాలయంత్రం లాంటివి. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి అవసరమైన సామరస్యాన్ని చాటుతాయి ఈ కథలు. మట్టిని ప్రేమించేవారంతా ఈ కథలను తప్పక ఇష్టపడతారు.
లేంబాళవాటిక కథలు
రచన: పిన్నంశెట్టి కిషన్
పేజీలు: 248; వెల: రూ. 200
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు ఫోన్: 98487 87284
ఉర్దూ సువాసన తెలుగులో
బద్ధకంగా ఓ రోజు. కరోనా తాలూకు దగ్గు పొడిగా, తడిగా గొంతును సవరిస్తూనే ఉంది. చేతుల్లో ఒక పుస్తకం. పేరు ‘మంటో కథలు..’ ఏంటో ఈ కథలు అని చదవడం మొదలుపెట్టా. ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో దశాబ్దాల కింద రాసిన కథలు. మెహక్ హైదరాబాదీ పుణ్యాన అచ్చతెలుగులో ఊరిన ఉర్దూ కథలు చదవడం మొదలుపెట్టా. 27 కథలు.. ఏకబిగిన చదివేశా. కొన్ని కథలు.. మళ్లీ మళ్లీ చదివా. మూల రచయిత రచనా వైచిత్రికి గులామ్ అయిపోతాం. వాటిని అంతే హుందాగా, అందంగా తెలుగులోకి అనువదించిన మన హైదరాబాదీకి సలామ్ చెబుతాం. కథలన్నీ కల్పనలో, ఆయన చూసిన మనుషుల జీవితాలో, స్వయంగా తానే చవిచూసిన జీవన అనుభవాలో అర్థం కావు. ఎవరి జీవితంలో జరిగితేనేం.. జరగకపోతేనేం కొన్ని కథలు గుండెలో గుబులు రేపుతాయి, కొన్ని శృంగారవాంఛను రేకెత్తిస్తాయి, కొన్ని మనలో అణగారిన మంచితనాన్ని తట్టిలేపుతాయి, కొన్ని మరచిపోయిన నాణ్యమైన నవ్వును మళ్లీ పెదవులపై పూయిస్తాయి. ఎన్ని పార్శాలో ఆయన కథల్లో. ఆనాటి సామాజిక అంశాలు, మానసిక ప్రవర్తనలు, కపట వైఖరులు, మనిషి బలహీనతలు.. ఇలా ఒక్కో కథ ఒక్కో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఆలూమగల మధ్య సంవాదాన్ని ‘జ్ఞానదంతం’ కండ్లకు కడుతుంది. సరసానికి, స్వర్గానికి మధ్య సన్నటి గీత ఉందని చెబుతుంది ‘వాసన’ కథ. ఓ అమ్మ ఆవేదనను భయానకంగా చూపుతుంది ‘సంతానం’ కథ. ఒక యువతికి పట్టిన ప్రేతాత్మ ఎలా విడిపోయిందో చెప్పిన ‘దయ్యం’ కథ దశాబ్దాల కిందటే రచయిత చేసిన చమత్కారమని తెలిసి విస్తుపోతాం. ఇలా ప్రతి కథలోనూ ఓ ప్రయోగం కనిపిస్తుంది. ఏండ్లు గడిచినా ఏదో కొత్తదనం తొంగిచూస్తుంది.
– టి.ఎన్.ఆర్
సాదత్ హసన్ , మంటో కథలు
అనువాదం: మెహక్ హైదరాబాదీ
(పీవీ సూర్యనారాయణమూర్తి)
పేజీలు: 202, వెల: రూ. 160
ప్రతులకు: నవచేతన బుక్‌హౌస్ (అన్ని శాఖలు)