అప్పుడే పుట్టిన బిడ్డ.. నూరేండ్లు బతకాల్సిన బుజ్జాయి.. అమ్మ చనుబాల రుచి తెలియకుండానే వచ్చిన చోటుకు తిరుగు ప్రయాణం కావడం ఎంత ఘోరం? వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన చోట.. నిరుపేద తల్లిదండ్రులకు బిడ్డను బతికించుకునే మార్గం ఎవరు చెబుతారు? మేమున్నామనే ధైర్యం ఎవరు ప్రసాదిస్తారు? ఆ బాధ్యతను నియోనేట్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఐ) సవినయంగా తీసుకున్నది.
చిట్టితల్లికి ఎన్ని గండాలో.పుట్టకముందే గుండె సమస్యలు.పుట్టగానే కాలేయ రుగ్మత.ఒకటిరెండు రోజులకే విషజ్వరం.బతుకును చిత్తు చేస్తామంటూ.. ఊపిరితిత్తుల లోపాలు. ఎముకలు తేలిన శరీరం.బరువు తూచే యంత్రం కంటే కూడా తక్కువ బరువే.
యమధర్మరాజు అనేవాడు నిజంగానే ఉంటే.. తనకు అల్పాయువు ఖరారు చేసి ఉంటాడు. యమభటులు కూడా ఉండి ఉంటే.. ఆ బిడ్డ ప్రాణాల కోసం నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బయట కాచుకుని ఉంటారు. ఆ మృత్యు రాయబారులకు తెలియాల్సిన విషయం మరొకటి ఉంది. నియోనేట్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఐ) ఆ బిడ్డకు అండగా ఉందని, కంటికి రెప్పలా కాపాడుతుందని. బిడ్డ హాస్పిటల్‌కు చేరుకోవడమే ఆలస్యం.. ఇంక్యుబేటర్‌లో ఉంచారు. కామెర్ల నుంచి విముక్తి కలిగించడానికి ఫొటోథెరపీ ఇచ్చారు. పాతిక రోజుల పోరాటం తర్వాత..
ఆ బిడ్డ మృత్యువును జయించింది. బెంగళూరులోని ఓ పెద్ద దవాఖాన నుంచి విడుదలై అమ్మ ఒడిని చేరింది, నాన్నకు ఆనందాన్ని పంచింది. ఎన్ఎఫ్ఐ అండతోనే బెంగళూరు నివాసి ప్రియాంక తన కవలల్ని రక్షించుకుంది. ఆమె భర్త మంజునాథ ఆటో డ్రైవర్. అతని సంపాదనే ఇంటికి ఆధారం. పెళ్లయిన చాలా కాలానికి ప్రియాంక గర్భం ధరించింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ, పుట్టీపుట్టకముందే ఆ కవలల్ని అనారోగ్యాలు ఆవహించాయి. రక్తహీనత సమస్య ఎదురైంది. అనుమానం వచ్చి వైద్యులు పరీక్షలు చేయించారు. ఊపిరితిత్తులు, గుండె సక్రమంగా పనిచేయడం లేదని తేలింది. లక్షలకు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించలేని పేదరికం. దీంతో మంజునాథ ఎన్ఎఫ్ఐని ఆశ్రయించాడు. క్రౌడ్ ఫండింగ్‌తో చికిత్స మొదలైంది. ఇప్పుడు బిడ్డలిద్దరూ క్షేమమే. ఈ ఫౌండేషన్ వివిధ దవాఖానలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నది. దీంతో తగ్గింపు ధరకు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.
పుట్టెడు కష్టాలు..
నవజాత శిశువు చుట్టూ గండాలే. పోషకాల లోపం, వాతావరణ ప్రభావం, కలుషిత జలాలు.. పొట్టలో ఉన్నప్పుడే బలహీనంగా మార్చేస్తాయి. పదిహేడేండ్ల లోపు, ముప్పై అయిదు తర్వాత.. గర్భం దాల్చడం అంటే బిడ్డ ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే. పుట్టుకతోనే అతితక్కువ బరువుతో బలహీనంగా ఉంటారు. తక్షణం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించాల్సి రావచ్చు. వెంటిలేటర్‌పై ఉంచాల్సిన అవసరమూ ఏర్పడవచ్చు. ఆ స్తోమత ఎంతమందికి ఉంటుంది? కన్నతల్లి బరువు కూడా పెద్ద సమస్యే. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు.. ఆ తల్లి ఎంచుకున్న అపసవ్య జీవనశైలి కూడా కొంపలు ముంచుతుంది. ముఖ్యంగా పేదల్లో.. రక్తహీనత ప్రభావం అధికం. ఒత్తిడి చేసే కీడు అంతా ఇంతా కాదు. కామెర్లు, ఫంగల్ సెప్సిస్ తదితర సమస్యలే డబ్భుశైతం చిన్నారుల మరణాలకు కారణమని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఏటా ముప్పై అయిదు లక్షలమంది నెలలు నిండని శిశువులు జన్మిస్తున్నారు. అందులో ప్రతి పదిమందిలో నలుగురికి పుట్టిన ఇరవైనాలుగు గంటల్లోనే నూరేళ్లు నిండుతున్నాయి. ఇన్ని సవాళ్లను దాటుకుని.. అన్ని సంక్షోభాలను అధిగమించి ఊపిరి నిలుపుకొంటున్నారు పసికూనలు. అందుకే, నియోనేట్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా.. నవజాత శిశువులే లక్ష్యంగా పనిచేస్తున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసిగుడ్డులను బతికించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. ఆ పోరాటంలో విజయం సాధిస్తున్నది. అల్పాయువులను చిరంజీవులను చేస్తున్నది.
ఎన్నో ఉదాహరణలు
చిన్నారి శ్రేయాంశు, చిట్టి నీలూ, పాలబుగ్గల అశ్విని.. ఇలా ఇప్పటివరకు ఎన్ఎఫ్ఐ అనేక ప్రాణాలను కాపాడింది. అందులో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల పసిబిడ్డలూ ఉన్నారు. ‘దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యిమంది నవజాత శిశువులలో ఇరవై ఆరుమంది సరైన వైద్యం అందకపోవడం వల్ల .. రోజుల వయసులోనే మరణిస్తున్నారు. సమస్య తీవ్రత గ్రామా ల్లో మరీ ఎక్కువ. అత్యంత బాధాకరమైన విషయం ఇది. అందుకే మేం కేవలం పసిబిడ్డల మీదే దృష్టి పెడుతున్నాం. స్వచ్ఛంద సంస్థలు, దాతల నుంచి అందే విరాళాలే మాకు ఆధారం. దాదాపు డబ్భు అయిదు లక్షలతో ఇరవై ఆరు ప్రాణాలను కాపాడగలిగాం’ అని వివరిస్తారు ఫౌండేషన్ ప్రతినిధి విశాల్ బాలీ. ‘మాకు పరిమితులు లేవు. పరిధుల్లేవు. ఎవరికైనా సాయం చేస్తాం’ అంటా రాయన. పుట్టిన ప్రతి బిడ్డకూ బతికే హక్కు ఉంది.బతికించాల్సిన బాధ్యత మాత్రం సమాజానిదే.
చాలా సందర్భాల్లో.. తక్షణం నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించగలిగితే.. బిడ్డ ప్రాణాలు నిలబడతాయి. కానీ, రోజుకు పదివేల నుంచి పాతికవేల రూపాయల వ్యయాన్ని భరించే స్తోమత ఎంతమందికి ఉంటుంది? ఆ పరిమితి బిడ్డకు శాపం కాకూడదు. ఈ పోరాటంలో మీ సహాయమూ కోరుతున్నాం.
-విశాల్ బాలీ జనరల్ కౌన్సిల్ మెంబర్, ఎన్ఎఫ్ఐ