2012 సినిమా ఆధారంగా చైనా-టిబెట్-భారత్ సరిహద్దులోని చుంబీ లోయకు ఉత్తరంగా ఉన్న ప్రాంతానికి సాయంత్రం 4.30 గంటలకు చేరుకొన్నారు ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్. ఆ ప్రాంతాన్ని తీక్షణంగా పరిశీలిస్తే, ఓ బండరాయి కింద ఏదో డివైజ్ నుంచి బీప్స్ శబ్దం వస్తున్నట్టు రుద్ర గమనించాడు. కరణ్, స్నేహిల్, రామస్వామి, జయ సాయంతో ఆ బండరాయిని పక్కకు జరిపారు. అలా ఓ పది నిమిషాలు వెతగ్గా.. ఓ బంకర్ కనిపించింది.
ఆబంకర్లో ఉన్న టైమర్లోని డిస్ప్లే +2.20 గంటల సమయాన్ని చూయిస్తుంది. ‘ఒరేయ్ రుద్ర.. ఫస్ట్ ఫేజ్ ‘సూసైడ్ వెపన్’ స్టార్ట్ కావడానికి ఇంకా 2.20 గంటల సమయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ లోపు మనం ఈ ఘోరకలిని ఎలాగైనా ఆపేయాలి’ అంటూ టెన్షన్‌తో జయ అన్నది. ‘అది నిజమే ఆంటీ.. దీన్ని, ఎలా ఆపాలో.. ఏంటో..’ అంటూ తల గోక్కున్నాడు పక్కనే ఉన్న స్నేహిల్. ఇంతలో డివైజ్‌ను డీయాక్టివేట్ చేయడానికి వచ్చిన కొందరు నిపుణులు దాన్ని పరిశీలించి రుద్రతో ఇలా అన్నారు. ‘సర్.. ఈ డివైజ్‌లో 3.40 గంటల డిస్ప్లే డిలేను మేము గమనించాం’ అన్నారు సదరు నిపుణులు. అర్థంకానట్టు తలూపాడు రుద్ర. దీంతో మళ్లీ కొనసాగించిన ఆ నిపుణులు.. ‘సార్.. అసలు ఈ డివైజ్ ఏంటీ? ఇప్పుడు ఏం జరుగబోతున్నదో మాకు చెప్తారా?’ అని అడిగారు.
‘ఇక్కడేం జరుగుతుందో ఏ మాత్రం తెలియకుండా వచ్చారా?’ కాస్త అసహనంతో అన్నాడు కరణ్. ‘సార్.. పీఎంవో అధికారులు మాకు ఆ వివరాలు ఏమీ చెప్పలేదు. ఇన్స్పెక్టర్ రుద్ర టీమ్‌కు అవసరమైన సాయం చేయమన్నారు అంతే. ఇప్పటివరకూ మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటో మాకు చెప్తేనే, ఇకపై ఏం జరుగబోతున్నదో మేం చెప్పగలం’ అన్నారు వాళ్లు. దీంతో ప్రారంభించాడు రుద్ర. ‘సార్.. మన దేశాన్ని నాశనం చేయడానికి ఓ మిషన్‌ను శత్రువులు స్టార్ట్ చేశారు. అందులో తొలి దశ పేరు ‘సూసైడ్ వెపన్’. అది యాక్టివేట్ అయితే, మన ప్రజల ప్రాణాలు దక్కవు’ అంటూ డోలో చెప్పిన విషయాలను ఆ నిపుణులకు వివరించాడు. అది విన్న నిపుణుల బృందం.. ‘సార్.. ఈ సూసైడ్ వెపన్ గురించి మీకు ఎలా తెలుసు?’ అన్నారు. దీంతో మధ్యలో కలుగజేసుకొన్న కరణ్.. కాస్త అసహనంతో ‘ఇప్పుడు అంత టైమ్ లేదు.. ముందు ఈ డివైజ్ గురించి చెప్పండి చాలు’ అన్నాడు ఆవేశంగా. దీంతో నిపుణుల బృందం చెప్పడం మొదలుపెట్టింది.
‘సార్.. మీరు చెప్పిన సూసైడ్ వెపన్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది’ అని నిపుణుల బృందం అంటుండగానే.. మధ్యలో కలుగజేసుకొన్న రుద్ర.. ‘లేదు లేదు.. మిషన్ యాక్టివేట్ అవ్వడానికి టైమ్‌లిమిట్ అనేది ఏదీ ఉండదని చెప్పారు’ అంటూ గ్వాటెమాలా నేషనల్ పార్క్‌లో ఉన్న డిజిటల్ డివైజ్ వాయిస్ కాల్ చెప్పినదాన్ని గుర్తు చేసుకొన్నాడు రుద్ర. ఇంతలో స్నేహిల్ కలుగజేసుకొంటూ.. ‘ఒరేయ్ రుద్ర.. లేట్‌గా వెళ్లావో.. మిషన్ యాక్టివేట్ అవుతుంది.. బైబై అని ఆ వాయిస్ కాల్ చెప్పింది కదరా’ అని అసలు విషయాన్ని మళ్లీ గుర్తు చేశాడు స్నేహిల్. అవునన్నట్టు తలూపిన రుద్ర.. నిపుణుల బృందం వైపు తిరిగి.. ‘సార్.. మీరు డివైజ్‌ను ముందుగా పరిశీలించగానే.. ఈ డివైజ్‌లో 3.40 గంటల డిస్ప్లే డిలే ఉందని అన్నారు. ఇప్పుడేమో సూసైడ్ వెపన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందంటున్నారు. ఏంటిదంతా?’ అంటూ భయంభయంగా ప్రశ్నించాడు.
ఇంతలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో కొన్ని రోబోలు లేజర్ రేస్‌తో దాడులు ప్రారంభించాయని, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని లైవ్ స్ట్రీమింగ్‌లో వార్తలు మొదలయ్యాయి. రుద్ర గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇంతలో ‘ఎందుకు ఇలా టైమ్‌ను మార్చి మార్చి పెట్టారు? దీని అర్థం ఏంటీ?’ అంటూ రుద్ర గట్టిగా అరిచాడు. ఇంతలో డివైజ్‌ను లోతుగా పరిశీలించిన నిపుణుల బృందంలోని హరిశ్వ అనే ఓ యంగ్‌స్టర్ రుద్రను దగ్గరకు రమ్మని పిలిచాడు. ‘సార్.. నేను చెప్తుంది వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు. అయితే, ఈ టైమ్‌ను మార్చి పెట్టడంలోనే ఓ పజిల్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే, ఈ తొలి దశ ఆగిపోవచ్చు. బట్ ఐయామ్ నాట్ ష్యూర్’ అంటూ చెప్తూ పోయాడు. ‘ముందు తొలి దశను ఆపేయాలి. అప్పుడే ప్రజల ప్రాణాలను కాపాడగలం. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి’ అంటూ రుద్ర అంటుండగానే.. మధ్యలో కలుగజేసుకొన్న నిపుణుల బృందం హెడ్.. ‘దానికి నేను ఒప్పుకోను. పై నుంచి పర్మిషన్ వచ్చేవరకూ ఏమీ చేయడానికి వీలులేదు’ అంటూ హరిశ్వను వెనక్కి రమ్మంటూ గద్దించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రుద్ర.. కన్నెర్రజేస్తూ ‘మిస్టర్ ఆఫీసర్.. ఇన్ఫామ్ మీ ఇమ్మీడియెట్లీ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఆల్టర్నేటివ్ టు స్టాప్ దిస్ మసాకర్. వాటెవర్ హ్యాజ్ హ్యాపెన్డ్ ఈజ్ మై సోల్ రెస్పాన్సిబిలిటీ’ అంటూ కోపంగా అన్నాడు. అది విన్న ఆఫీసర్ వెనక్కి తగ్గాడు. ధైర్యం తెచ్చుకొన్న హరిశ్వ.. ‘సార్.. ఈ కోడ్‌ను క్రాక్ చేస్తున్నా..’ అంటూ ఏదో ప్రొగ్రామ్ అప్లయి చేశాడు.
దీంతో ఆ డిస్ప్లే మీద ఓ క్వశ్చన్ రెయిజ్ అయ్యింది. ‘ఎంటర్ ఎగ్జాక్ట్ స్టార్ట్ టైమ్ ఆఫ్ ‘సూసైడ్ వెపన్’ ఫేజ్. యూ హ్యావ్ వన్ మినట్ ఆఫ్ టైమ్’ అని టైమ్ స్టార్ట్ అయ్యింది. వెంటనే గ్రౌండ్‌లోని నలుగురైదుగురు అధికారులకు కరణ్ ఫోన్ చేసి మెట్రో స్టేషన్లో ఎటాక్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో అడిగాడు. దాడి మొదలైన ఓ 15 నిమిషాలు, అరగంట తర్వాతే తాము స్పాట్‌కు చేరుకొన్నామని చెప్పిన సదరు అధికారులు ఒక్కొక్కరు ఒక్కో టైమ్‌ను చెప్పారు. ఒకరు రఫ్‌గా మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో అంటే, ఇంకొకరు మూడింటికి అన్నారు, మరొకరు మూడున్నరకు అని చెప్తే.. మరొకరు అంతకు ముందే స్టార్ట్ అయినట్టు చెప్పారు. దీంతో సూసైడ్ వెపన్ ఎప్పుడు స్టార్టయ్యిందోనని అర్థంకాక అందరూ తలలు పట్టుకొంటుండగా.. ‘సార్.. ఇంకా ఎనిమిది సెకండ్ల టైమ్ మాత్రమే మిగిలి ఉందం’టూ హరిశ్వ భయపడుతూ అన్నాడు. ఇంతలో రుద్ర ఆ డివైజ్‌పై తను అనుకున్న టైమ్ టైప్ చేసి ఎంటర్ చేశాడు. అంతే ‘రోబోల ఎటాక్ (సూసైడ్ వెపన్)’ ఆగిపోయిందంటూ న్యూస్ రావడం మొదలైంది. ఇంతకీ, రుద్ర సూసైడ్ వెపన్ స్టార్టింగ్ టైమ్ ఏమని ఎంటర్ చేసినట్టు?
సమాధానం: రుద్ర ఆ డివైజ్‌లో 3.20 పీఎం అని టైమ్‌ను ఎంటర్ చేశాడు. వివరంగా చెప్పాలంటే.. బంకర్లో డివైజ్‌ను కనిపెట్టిన సమయం 4.40 పీఎం. అప్పుడే ఈ డివైజ్ డిస్ప్లేలో 2.20 గంటల సమయాన్ని చూయించింది. కానీ, డివైజ్‌ను పరిశీలించిన నిపుణులు.. 3.40 గంటల డిస్ప్లే డిలే ఉన్నట్టు చెప్పారు. అంటే, 3.40 గంటల నుంచి 2.20 గంటలను తీసేయాలి. అప్పుడు 1.20 గంటలు వస్తుంది. అంటే, డివైజ్‌ను తొలిసారిగా చూసినప్పుడు ఏ సమయమైతే (4.40పీఎం) కనిపించిందో.. దాంట్లోంచి ఈ 1.20 గంటలు తీసివేస్తే, అప్పుడు సూసైడ్ వెపన్ యాక్టివేట్ అయిన సమయం (3.20 పీఎం) వస్తుంది. అదే రుద్ర ఎంటర్ చేశాడు. అంటే సూసైడ్ వెపన్ దశ.. 3.20 పీఎంకు యాక్టివేట్ అయినట్టు లెక్క.