మ్యాట్రిఫగీ తేలు జాతి ఉండే బ్రెజిల్‌లోని సెరాడో ప్రాంతానికి చేరుకొన్నారు రుద్ర అండ్ టీమ్. ఇండియన్ అఫీషియల్స్ అప్పటికే, బ్రెజిల్ ఎంబసీతో మాట్లాడటంతో ‘మిషన్ డోలో’లోని తర్వాతి క్లూని పట్టుకోవడం రుద్రకు కాస్త తేలికైంది. అయితే, క్షణాల వ్యవధిలో ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయో అర్థంకాని హెడ్ కానిస్టేబుల్ రామస్వామి మౌనంగా ఉండలేక నోరు తెరిచాడు.
‘సార్.. క్షణాల్లో మనకు అన్ని అనుమతులు వస్తున్నాయంటే, పీఎంవో స్థాయిలోనే అంతా జరుగుతుందని అర్థమవుతున్నది. మరి, ఈ మిషన్ డోలోను కూడా వాళ్లే..’ అంటూ రామస్వామి ఇంకా ఏదో చెప్పబోతుండగా.. ‘బాబాయ్.. అది కాన్ఫిడెన్షియల్ విషయం. మన పని పూర్తయ్యాక.. దాని గురించి మీకు వివరంగా చెప్తా. ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేను’ అంటూ రుద్ర అంటుండగానే.. ‘అది సరేరా! మరి నెక్ట్స్ క్లూ ఏమైనా దొరికిందా? లేదా’ అంటూ టాపిక్ మార్చాడు స్నేహిల్. ‘అది దొరకాలంటే, ఈ ప్రాంతాన్ని మనం జాగ్రత్తగా గాలించాలి’ అంటూ రుద్ర బదులివ్వగానే.. ‘సార్.. అసలు మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామంటారా?’ అంటూ రామస్వామి అన్న మాటలకు అందరూ షాకయ్యారు. ‘అంటే?’ అని కరణ్ అనగానే.. ‘మరేంలేదు సార్! ‘మిషన్ డోలో’ తొలి దశ చైనాలో స్టార్ట్ అవుతుంది అని మనకు తెలుసు. మరి, డైరెక్టుగా అక్కడికి వెళ్లి దాని గురించి వెతక్కుండా.. ఈ బ్రెజిల్‌కి రావడమేంటో?! ఇదంతా చూస్తే, మనల్ని కావాలనే రాంగ్ రూట్లో డైవర్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తున్నది’ అంటూ తన మనసులోని సందేహాన్ని బయటపెట్టాడు రామస్వామి. ఆ మాటల్లో ఎంతోకొంత నిజమున్నట్టు కాసేపు మాట్లాడకుండా నిలబడిపోయారు కరణ్, జయ, స్నేహిల్.
ఇంతలో రుద్ర ముందు ఓ చిన్న డ్రోన్ హఠాత్తుగా కూలిపోయింది. అదెక్కడి నుంచి ఆపరేట్ అయిందో తెలుసుకోవాలనుకొన్న రుద్ర టీమ్‌కు అది సాధ్యపడలేదు. ఇక చేసేదేంలేక.. కూలిపోయిన డ్రోన్‌ను పరిశీలించాడు రుద్ర. దాంట్లో ఓ డిజిటల్ మెసేజ్ ఉంది. ‘హాయ్ రుద్ర.. మీపై మా నిఘా ఉంది. అంటే, ఇప్పటికి ఇప్పుడు మీ టీమ్‌ను, నిన్ను మేం చంపేయగలం. అయితే, అలా చేయం. అంతేకాదు.. మిషన్ డోలోను ఆపాలన్న మీ ప్రయత్నాలను మేం అడ్డుకోబోం. అలా అని ఈజీగా సాయం కూడా చేయబోం. ఇదంతా ప్రీ-షెడ్యూల్డ్ అల్ట్రా ఏఐ మాడల్.
ఇక, బ్రెజిల్ వరకు వచ్చావంటే నువ్వు అసాధ్యుడివే. సరే.. ఈ ప్రపంచాన్ని ఇంకా ఎంతసేపు చుట్టివస్తావు గానీ, ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా చైనాకు.. అదే తొలి దశ ‘సూసైడ్ వెపన్’ ఎగ్జాక్ట్‌గా ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి పంపించే బ్రహ్మాండమైన క్లూ నీకు కావాలంటే, నీ మెదడుకు ఇప్పుడు పని చెప్పు. అదేంటంటే.. ‘అది నీకు ఇష్టమైన మూవీ. నీ ఫేవరేట్ మూవీలో టాప్‌లో ఆ సినిమా కూడా ఉంటుంది. చిన్నప్పుడు తెగ చూసేవాడివి. 2009లో వచ్చిన ఆ హాలీవుడ్ మూవీ.. ఆ తర్వాత మూడేండ్లకు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఊహించి అందర్నీ భయపెట్టింది. అఫ్కోర్స్ అదేం జరుగలేదు. అదే జరిగుంటే, నువ్వు ఉండేవాడివి కాదుగా! ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, ఆ మూవీ టైటిల్ కార్డ్ పడిన నెక్ట్స్ సీన్ ఎక్కడ షూట్ చేశారో ఆ ప్రాంతానికి నువ్వు వెళ్లు. అప్పుడు చైనాలో ఎగ్జాక్ట్‌గా ఏ ప్లేస్‌కు వెళ్లాలో నీకు తెలుస్తుంది. రుద్ర.. త్వరగా వెళ్లు. ఇక్కడ ఈ డిజిటల్ మెసేజ్ ఆఫ్ అవగానే.. అక్కడ యాక్టివేట్ అయ్యే వాయిస్ కాల్ 8 గంటలపాటు మాత్రమే రిపీట్ అవుతుంది. ఆ తర్వాత అది డిస్కనెక్ట్ అవుతుంది. లేట్ చేస్తే కష్టం.. గో హరియప్’ అంటూ ప్రస్తుత మెసేజీ డిసప్పియర్ అయ్యింది.
వెంటనే దగ్గరకొచ్చిన జయ..‘ఒరేయ్.. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లాలిరా? అసలు ఈ మెసేజీలో ఏం చెప్తున్నారో కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు’ అంటూ జయ అంటుండగానే.. ‘నాకు అర్థమయ్యింది ఆంటీ.. త్వరగా మనం జెట్‌లో సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలాకు వెళ్లాలి. అక్కడే మనకు అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయ్. ఇక్కడి నుంచి అది 5 వేల కిలోమీటర్లు. 8 గంటల్లో చేరాలి. త్వరగా’ అంటూ తన టీమ్‌తో 7.50 గంటల్లో గ్వాటెమాలాలోని టికాల్ నేషనల్ పార్క్‌లో ఉన్న జాగ్వార్ టెంపుల్‌కు చేరుకొన్నాడు రుద్ర. అప్పటికే అక్కడ ఓ బల్ల మీద అమర్చిన డిజిటల్ డివైజ్ నుంచి వాయిస్ కాల్ ప్లే అవుతూనే ఉన్నది. ‘హాయ్ రుద్ర.. 10 నిమిషాల ముందే సరిగ్గా చేరుకొన్నావ్. ఏ మూవీని అనుసరించి ఇక్కడికి వచ్చావో.. ఆ మూవీలోనే ప్రాణాలను కాపాడుకోవడానికి వేటిని ఎక్కాలో కూడా చెప్పారు. అవి ఎక్కడ తయారుచేస్తున్నట్టు చూయించారో.. అక్కడే ‘సూసైడ్ వెపన్’ పురుడుపోసుకొంటుంది. వెళ్లు.. దీనికి టైమ్‌లైన్ ఏమీలేదు. కాకపోతే, లేట్‌గా వెళ్లావో.. మిషన్ యాక్టివేట్ అవుతుంది.. బైబై’ అంటూ ఆ వాయిస్ కాల్ ఆగిపోగానే.. ఎక్కడికి వెళ్లాలో పై అధికారులకు వెంటనే అప్డేట్ ఇచ్చిన రుద్ర.. అసలేం జరుగుతుందో అర్థంకాని తన టీమ్‌కు తన ఫేవరేట్ మూవీ ఏమిటో.. అందులో చూయించిన సీన్స్‌కు.. ఇప్పుడు జరుగుతున్న వాటికి లింక్ ఏమిటో అన్ని విషయాలను లోతుగా వివరించాడు. మీరు మూవీ లవర్స్ అయితే, ఆ మూవీ ఏమిటో? మిషన్ డోలోను ఆపడానికి రుద్ర ఎక్కడికి వెళ్తున్నాడో మీరు కనిపెట్టారా?
డిజిటల్, వాయిస్ మెసేజీలో చర్చించిన మూవీ పేరు.. 2012 సినిమా. 2009లో విడుదలైంది. మూవీ టైటిల్ కార్డ్ పడగానే.. గ్వాటెమాలాలోని టికాల్ నేషనల్ పార్క్‌లో ఉన్న జాగ్వార్ టెంపుల్‌ను చూయిస్తారు. మాయన్ క్యాలెండర్‌ను ఉదహరిస్తూ మాస్ సూసైడ్ సీన్ అది. 2009లో వచ్చిన నీకు ఇష్టమైన హాలీవుడ్ మూవీ అంటూ డిజిటల్ మెసేజీ వచ్చిందోలేదో.. రుద్రకు రెండు మూవీలు స్ఫురించాయి. అవి అవతార్ అండ్ 2012. అయితే, ‘ఆ మూవీ.. తర్వాత మూడేండ్లకు (2012) ప్రపంచంలో ఏం జరుగుతుందో ఊహించి అందర్నీ భయపెట్టింది’ అనగానే 2012 మూవీ అని రుద్ర ఫిక్సయ్యాడు. అందుకే, వెంటనే జాగ్వార్ టెంపుల్‌కు చేరుకొన్నాడు. ఇక, జల ప్రళయం నుంచి తప్పించుకోవడానికి చైనా-టిబెట్-భారత్ సరిహద్దులోని చుంబీ లోయకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో స్పేస్షిప్లను తయారు చేస్తున్నట్టు మూవీలో చూయిస్తారు. అంటే, చుంబీ లోయలోనే మిషన్ డోలో ఫస్ట్ ఫేజ్ ‘సూసైడ్ వెపన్’ పురుడు పోసుకోబోతున్నట్టు రుద్ర గ్రహించాడు. వెంటనే దాన్ని ఆపడానికి అక్కడికి తన టీమ్‌తో సహా ప్రయాణమయ్యాడు.