మహిళా కోటా పుణ్యమా అని స్థానిక ఎన్నికల్లో మహిళలను సర్పంచ్‌లుగా, ఎంపిటీసీ, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా గెలిపించుకుంటున్నాం. గెలువు ఎవరిదైనా పెత్తనం మాత్రం మగాడిదే! అది వేరే విషయం అనుకోండి. కానీ, ప్రస్తుతం చట్టసభల్లో ముప్పైమూడు శాతం కోటాను అమలు చేస్తే వాటివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుసుకోవాలంటే… ఇందులోని ముప్పై మూడు కథలను తప్పనిసరిగా చదవాల్సిందే. ప్రత్యేకంగా పనిగట్టుకొని చదవనవసరం లేదు. ఒక్కసారి మొదలు పెడితే చాలు.. మీతో చివరి వరకూ అవే చదివిస్తాయి. రాజకీయ మనుగడ కోసం మన నేతలు ఎంతకైనా తెగిస్తారు అనేదానికి ఉదాహరణే ఈ పుస్తకం. రాజకీయమంటేనే.. కులం, మతం, మార్కెట్, సినిమా, ఫ్యాక్షన్, మాఫియా, మీడియా, ప్రాంతం, మధ్యం, అవినీతి చుట్టూ తిరిగే సమ్మేళనం. పదవిమీదున్న ఆశతో పెళ్లిళ్లు పెటాకులైతాయి. చిన్నిండ్లు పెద్దిండ్లుగా మారుతాయి. అంటరానోడంటూ అవమానించిన వాడు వియ్యంకుడవుతాడు.
ఇంట్లో పనిమనుషులు కూడా ఎమ్మెల్యేలవుతారు. ఇలా కోటా మాటున మన ప్రజాప్రతినిధులు చేసే అరాచకాలను వ్యంగ్యంగా వివరించారు రచయిత సతీష్ చందర్. ఈ కథల్లోని కొన్ని పాత్రలు మనకు నిత్య సమాజంలో తారసపడినట్లుగానే అనిపిస్తాయి. వేదికలెక్కి మహిళా సాధికారత సాధించాలని ఉపన్యాసాలిచ్చే అనేకమందికి ఇదొక చెంపపెట్టులాంటిది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లు కావొస్తున్నా.. ఇంకా ముప్పై మూడు శాతం అమలైతే తప్ప ఆడవారికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్నమాట. అయినా ఈ కోటా లేకుండానే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మహిళలను చట్టసభల్లో చూడగలుగుతున్నాం కదా! మహిళా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో భవిష్యత్తులో ఎదురయ్యే ఎన్నో వింతలను రచయిత ముందే ఊహించి… ఈ కథల ద్వారా మనకు కనువిప్పు కలిగించారు. అధికారం కోసం అడ్డదారులెన్నో తొక్కే నేతలకు ఇది అంకితంగా ఇస్తే బాగుండేది. అన్ని వర్గాల ప్రజలు చదవాల్సిన పుస్తకమిది.
(‘కోటా’లో రాణుల రాజకీయ కథలు)
రచయిత: సతీష్ చందర్
పేజీలు: 280, ధర: రూ.350
ప్రతులకు: 411, హిమసాయి గార్డెన్స్, వీధి నెంబర్ 5, జవహర్ నగర్,
హైదరాబాద్.
-రాజు పిల్లనగోయిన