జీవితంలో రోజూ ఎన్నో రకాల భావాలు మనల్ని పలకరిస్తుంటాయి. ఎప్పుడూ సంతోషంగా ఉండటం సాధ్యం కాదు, అలాగే ఎప్పుడూ బాధలో ఉండటం కూడా జరగదు. అయితే ఒక నిర్దుష్ట సమయంలో ఏ భావోద్వేగానికి లోనవుతామో గుర్తించడమే భావోద్వేగ అవగాహన. దీనిపై పట్టు సాధిస్తే లైఫ్ బిందాస్‌గా సాగిపోతుంది.
చాలామంది తమ కోపాన్ని, బాధని తెలుసుకోలేరు, కేవలం ఆ భావానికి లోనవుతుంటారు. భావోద్వేగ అవగాహన ఉన్న వ్యక్తి ఆ క్షణంలో తనకు కలుగుతున్న భావనను గుర్తించగలరు. అది ఎందుకు కలుగుతుందో అర్థం చేసుకోగలరు. ఆ భావన తన శరీరంపై, ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనించగలరు.
భావోద్వేగాలను మనం సరిగా గుర్తించినప్పుడు, వాటిని అణచివేయకుండా ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తపరచవచ్చు. అప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. మన భావాలను అర్థం చేసుకుంటేనే, ఇతరుల భావాలను కూడా గౌరవించగలరు. దీనివల్ల కుటుంబం, స్నేహితులతో బంధాలు బలపడతాయి. కోపంలో, అతి సంతోషంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు తరచుగా గురి తప్పుతుంటాయి. భావోద్వేగ అవగాహన మనసుని స్థిమితంగా ఉంచి, మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. బలహీనతలు, బలాలు తెలిసినవారు మనం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలరు.
భావోద్వేగ అవగాహన ఒకేసారి వచ్చేది కాదు. అది ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందుతుంది. దీనిని ప్రధానంగా ఐదు స్థాయులుగా విభజించవచ్చు. మన భావోద్వేగాలను మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటున్నామో ఈ దశల ద్వారా తెలుసుకోవచ్చు.
1. శారీరక సంచలనాలు ఇది ప్రాథమిక స్థాయి. ఇక్కడ వ్యక్తికి తన మనసులో ఏ భావం ఉందో తెలియదు. కానీ, శరీరంలో మార్పులను గమనిస్తారు. ఉదాహరణకు కోపం వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, భయం వేసినప్పుడు కడుపులో తిప్పినట్లు అవ్వడం లేదా చేతులు వణకడం లాంటివి. ఇక్కడ వ్యక్తి ‘నాకు భయంగా ఉంది’ అని చెప్పలేడు, కానీ ‘నా గుండె ఆగిపోతున్నట్లు ఉంది’ అని అంటాడు.
2. చర్య తీసుకోవాలనే ధోరణి ఈ స్థాయిలో భావోద్వేగం ఒక పని చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ ఆ భావం ఏమిటో మనకు స్పష్టంగా తెలియదు. ఉదాహరణకు ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వెంటనే ఎదురుదాడి చేయాలనిపించడం లేదా అక్కడి నుంచి పారిపోవాలనిపించడం. ఇక్కడ భావోద్వేగం ఒక ‘రియాక్షన్’ లాగా బయటికి వస్తుంది.
3. ఏక భావోద్వేగం ఈ స్థాయిలో వ్యక్తి తనకు కలుగుతున్న భావాన్ని ఒక పేరుతో గుర్తించగలడు. ఉదాహరణకు ‘ప్రస్తుతం నేను చాలా విచారంగా ఉన్నాను’ లేదా ‘నాకు చాలా కోపంగా ఉంది’ అని స్పష్టంగా చెప్పగలగడం. ఇది అవగాహనలో ఒక ముఖ్యమైన మెట్టు. ఇక్కడ వ్యక్తి తన భావాలను మాటల్లో వ్యక్తపరచగలడు.
4. మిశ్రమ భావోద్వేగాలు జీవితంలో ఏ సంఘటన కూడా ఒకే రకమైన భావాన్ని ఇవ్వదు. ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒకే సమయంలో రెండు మూడు రకాల భావాలు కలుగుతున్నాయని గుర్తించగలడు. ఉదాహరణకు ఒక విద్యార్థికి విదేశాల్లో చదువుకోవడానికి సీటు వచ్చినప్పుడు, వెళ్తున్నందుకు సంతోషం, ఇల్లు వదిలి వెళ్తున్నందుకు బాధ, కొత్త చోట ఎలా ఉంటుందో అని ఆందోళన.. ఇలా అన్నీ కలిపి ఉండటాన్ని గుర్తించడం.
5. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం ఇది అత్యున్నత స్థాయి. ఇక్కడ వ్యక్తి తన భావాలను మాత్రమే కాకుండా, అవతలి వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం చేసుకుంటాడు. దీన్నే ‘ఎంపథీ’ అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి మనపై కోప్పడితే అతను కేవలం కోపంతో లేడని, బహుశా ఏదో ఒత్తిడిలో ఉన్నాడని లేదా బాధలో ఉన్నాడని గ్రహించడం.
భావోద్వేగ అవగాహన పెంచుకుంటే ఆలోచనలపై, ప్రవర్తనపై మంచి నియంత్రణ లభిస్తుంది. దీని కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి.
మీకు ఏదైనా అనిపించినప్పుడు, నాకు ఏదోలా ఉంది అని కాకుండా, కచ్చితంగా ఆ భావన ఏమిటో గుర్తించండి. ఉదాహరణకు కోపం, అసూయ, భయం, నిరాశ లేదా ఒంటరితనం ఇలా! మీలో కలిగే భావానికి పేరు పెట్టినప్పుడు దాని ప్రభావం మెదడుపై తగ్గుతుంది.
ప్రతి భావోద్వేగం శరీరంలో ఒక ప్రతిచర్యను కలిగిస్తుంది. కోపం వస్తే గుండె వేగంగా కొట్టుకోవడం లేదా ముఖం వేడెక్కడం, ఆందోళన కలిగితే కడుపులో తిప్పినట్లు ఉండటం, ఒత్తిడి ఉంటే భుజాలు పట్టేసినట్లు అవ్వడం వంటివి. శరీర సంకేతాలను గమనిస్తే మీ మనసులో ఏం జరుగుతుందో త్వరగా అర్థమవుతుంది.
‘నాకు ఎందుకు ఇలా జరుగుతున్నది?’ అని ప్రశ్నించుకోవడం వల్ల మనం నిందారోపణల వైపు వెళ్తాము. దానికి బదులుగా ‘నాలో ఏ భావన కలుగుతున్నది? ఈ భావన నాకు ఏం చెప్పాలనుకుంటున్నది?’ అని అడగండి.
రోజూ రాత్రి పడుకునే ముందు ఒక డైరీలో మీ భావాలను రాయండి. ఈ రోజు సంతోషం కలిగించిన విషయం ఏమిటి? ఇబ్బంది పెట్టిన సందర్భం ఏది? ఇలా రాయడం వల్ల ఎమోషనల్ పాటర్న్స్ స్పష్టంగా అర్థమవుతాయి.
ఒక కష్టమైన భావం కలిగినప్పుడు వెంటనే స్పందించకుండా, ఒక నిమిషం ఆగి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఎస్.టి.ఓ.పి (స్టాప్) పద్ధతి పాటించండి. ఒక్క క్షణం ఆగిపోండి, శ్వాస తీసుకోండి, శరీరం, మనసులో ఏం జరుగుతుందో గమనించండి, ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
భావోద్వేగాల్లో మంచిచెడులు ఉండవు. కోపం రావడం తప్పని, భయం కలగడం బలహీనతని అనుకోకండి. భావాలను ఒక సమాచారంగా మాత్రమే చూడండి.
ఈ పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, నిర్వహించడం సులభం అవుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎమోషన్స్ అదుపులో ఉండకుండా, వాటిని కంట్రోల్లో ఉంచగలిగినప్పుడు జీవితం మీద అదుపు వస్తుంది. ఈ రోజు నుంచే భావోద్వేగ అవగాహన పెంచుకోవడంపై దృష్టి సారించండి. అవసరమైతే సైకాలజిస్ట్ సాయం తీసుకోండి.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261