మహాపురుషుడు
ఇంతటిదీ అని ఒక పరిమితి చెప్పడానికి వీలులేనంత శక్తి సంపన్నుడికి, శ్రీరాఘవునికి.. దశరథ కుమారునికి, సీతాపతికి, రఘువంశాన్ని ప్రకాశింప చేసిన రత్నదీపం వంటివానికి.. మోకాళ్ల వరకు పొడవైన బాహువులు కలవాడికి..
భక్తరామదాసు
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం
ఆజానుబాహుమరవిందదలాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి
ఇంతటిదీ అని ఒక పరిమితి చెప్పడానికి వీలులేనంత శక్తి సంపన్నుడికి, శ్రీరాఘవునికి.. దశరథ కుమారునికి, సీతాపతికి, రఘువంశాన్ని ప్రకాశింప చేసిన రత్నదీపం వంటివానికి.. మోకాళ్ల వరకు పొడవైన బాహువులు కలవాడికి.. పద్మపు రేకుల వంటి కన్నులున్నవాడికి.. రాత్రించరులైన రాక్షసులను నాశనం చేసేవాడైన రామునికి నమస్కరిస్తున్నాను.
కంచర్ల లింగన్న మంత్రి వరండాలో అటూఇటూ తిరుగుతూ శ్రీరామ కర్ణామృత శ్లోకాలను వల్లె వేసుకుంటున్నారు. అక్కడికి సమీపంలోని పురిటిగదిలో ఆయన భార్య కామమ్మ నొప్పులు పడుతోంది. పెళ్లయిన చాలాకాలం వరకు ఆ దంపతులకు సంతానం కలగలేదు. వయసు మీదపడుతున్న వేళ జరుగుతున్న ప్రసవం కాబట్టి లింగన్నమంత్రి ముఖంలో కొద్దిపాటి ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అది లింగన్న మంత్రికి అత్తవారిల్లు.
హనుమకొండ నివాసి భానోజీ పంతులు పెద్దల్లుడు కంచర్ల లింగన్న మంత్రి. భానోజీ పంతులుగారికి నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. అందరిలోనూ పెద్దకూతురు కామమ్మ. అప్పటికే తన చెల్లెళ్లిద్దరికీ పెళ్లిళ్లయి పిల్లలు పుట్టారు. ఆమె తమ్ముళ్లలో పెద్దవాళ్లయిన అక్కన్న, మాదన్నలిద్దరూ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. వారి వివాహాలు కూడా అయ్యాయి. ఇక కామమ్మ పెళ్లయిన ఇరవై ఏళ్లకు గానీ ఆమె కడుపు పండలేదు.
ఆలస్యంగా వచ్చిన గర్భం, తొలిచూలు ప్రసవం. కామమ్మ ఆరోజు ఉదయం నుంచే నొప్పులు పడుతోంది. ఇహనో ఇప్పుడో కానుపు కావచ్చు. అది స్వస్తిశ్రీ చాంద్రమాన అంగీరస నామ సంవత్సరానికి సరియైన సా.శ. 1633 జనవరి 13వ తేదీ… మాఘ శుద్ధ చవితి గురువారం నాటి గోధూళి వేళ. మరికొద్ది సేపటిలో శతభిష నక్షత్రం ముగిసి, పూర్వాభాద్ర నక్షత్రం ప్రవేశించనున్నది.
భానోజీ పంతులు పంచాంగం ముందరేసుకుని, గ్రహగతులతో కుస్తీ పడుతున్నారు.
రాహుకేతువులు మేష తులా రాశుల్లో ఉన్నారు. మామూలుగా అయితే కాలసర్పదోషమే. కానీ గురుడు ఆ దోషాన్ని కొద్దిపాటి తేడాతో తప్పిస్తున్నాడు. మహాపురుష యోగాల్లో ఒకటైన రుచకయోగం నడుస్తోంది. గ్రహయుద్ధం ముగిసి కుజుడు గెలిచాడు. ఆ సమయంలో పిల్లవాడు పుడితే గొప్ప సాహసి అవుతాడు… సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వాడవుతాడు.
భానోజీ పంతులు ఈ విషయాలనే మననం చేస్తుండగా పురిటి గది తలుపు తీసుకుని మంత్రసాని ఇవతలికి వచ్చింది. “పిల్లవాడు పుట్టాడండోయ్… దబ్బపండులా ఉన్నాడు” అని కేకపెట్టింది. ఆ మాటలు వినగానే… లింగన్న మంత్రి మనసులో పుత్రోత్సాహం ఉదయించింది. “తల్లి కులాసాగా ఉన్నదా?” అడిగాడు ఆదుర్దాగా.
బదులుగా మంత్రసాని చిరునవ్వు నవ్వి లోనికి వెళ్లిపోయింది. లోపల నవజాత శిశువుకు, ఇవతల తండ్రికి స్నానానికి ఏర్పాట్లయ్యాయి.
లింగన్నమంత్రి నలుగురు బావమరుదులూ ఇంటిలో ఒకటే హడావుడి చేయసాగారు. వారిలో పెద్దవారైన అక్కన్న మాదన్నలు బావగారికి స్నానానికి ఏర్పాట్లు చేశారు. బావిగట్టున లింగన్న మంత్రి సచేల స్నానానికి కూచున్నాడు. బావిపై ఒడుపుగా నుంచుని అక్కన్న బొక్కెనతో నీరు తోడి పోస్తున్నాడు. మాదన్న దూరంగా పొడివస్ర్తాలు పట్టుకుని, నుంచుని ఉన్నాడు. అక్కన్న అప్పటికప్పుడు తోడిపోస్తుండగా మధ్యలో వస్తున్న విరామకాలంలో లింగన్న మంత్రి తన ఎదురుగా ఉన్న మాదన్నతో మాట్లాడటం సాగించాడు.
“మాదన్నా! మీ అక్కయ్య పాపం సంతానం కోసం ఎన్ని కష్టాలు పడిందనుకున్నావు! నోములు నోచింది. ఉపవాసాలు పడింది. దేవతా ప్రదక్షిణలు చేసింది. పుట్టకు పాలు పోసింది. చీమలకు చక్కెర చల్లింది. గోమాతను పూజించింది. తులసికి మొక్కింది. ముత్తయిదువలకు పండు పసుపు పంచి పెట్టింది. బొమ్మల పెళ్లిళ్లు జరిపించింది. నిరుపేదలకు ఎన్నెన్నో ధర్మాలు నెరవేర్చింది. సాధుజనాలను సేవించింది. కనిపించిన ప్రతి రాయికీ దండం పెట్టింది. రావి, వేప చెట్లను పూజించి, కల్యాణాలు చేసింది. ఎన్ని నియమాలు పాటించినా ఏం లాభం… ఆమె కడుపు మాత్రం పండలేదు. చివరికి మా వేణుగోపాల స్వామి దయవల్ల మా నేలకొండపల్లికి ఒకానొక యతీశ్వరుడు విచ్చేశాడు. ఆయన పేరేమిటో తెలియదు కానీ ఒక్కపూట ఆతిథ్యమిచ్చిన భాగ్యానికి…
ఆయన తన అనుగ్రహాన్ని మాపై కురిపించాడు. సంతాన హీనులమని తెలుసుకుని, గొప్ప మార్గనిర్దేశం చేశాడు. ఆ మార్గంలోనే ఈనాటికి మీ అక్కయ్య తాను తల్లి కాగలిగింది”. అని లింగన్న మంత్రి చెబుతుండగా స్నానం పూర్తయింది. మాదన్న ఇచ్చిన పొడి వస్ర్తాలను ధరించి, లింగన్న మంత్రి పదకొండు రోజులపాటు జాతాశౌచాన్ని పాటించాడు. పదకొండో రోజున శుద్ధి అనంతరం బారసాలకు ఏర్పాట్లు జరిగాయి.
ఆనాడు నేలకొండపల్లికి విచ్చేసిన యతీశ్వరుడు… లింగన్న మంత్రి దంపతులకి, సంతానగోపాల మంత్రాన్ని ఉపదేశించాడు. వారిద్దరూ నిష్ఠగా ఆరు నెలలపాటు వేణుగోపాలస్వామి ఆలయంలో జప, హోమ, తర్పణాదులు నిర్వహించారు. అది జరిగిన కొద్దికాలానికే కామాంబ కడుపు పండి, మగబిడ్డను ప్రసవించింది. అందుకు గుర్తుగా లింగన్న మంత్రి తన కొడుక్కి.. ‘గోపన్న’ అని నామకరణం చేశాడు. మరునాడే బయలుదేరి తాను నేలకొండపల్లికి వెళ్లాడు. కామాంబ ఆరు నెలల కాలం పుట్టింటనే ఉంది. గోపన్న మాతామహుని ఇంట ఆరోగ్యంగా పెరుగుతున్నాడు.
భానోజీ పంతులు హనుమకొండ పరగణాకు భూమ్యాదాయ శాఖాధికారిగా పని చేస్తున్నారు. అప్పటికే అక్కన్న, మాదన్నలకు వివాహాలయ్యాయి. ఇద్దరూ సంస్కృతం, తెలుగు, హిందీ, పారసీ భాషలో ఆరితేరినవారు. తహసీళ్లు రాయడంలో నేర్పరితనం పొందారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పరగణాలో అన్నదమ్ములిద్దరూ మంచి పలుకుబడి సాధించుకున్నారు.
అక్కన్న కంటే మాదన్న చురుకైనవాడు. అవకాశం లభిస్తే తన కొడుకు రాజాస్థానంలో మంచిస్థానం పొందగలడని భానోజీ పంతులు తరచుగా అనుకుంటూ ఉండేవారు. అంతమాత్రం చేత అక్కన్న మరీ తీసిపోయిన వాడేమీ కాదు. చిన్నతనం నుంచి సాముగరిడీలలో ప్రతిభ చూపించాడు. శస్త్రవిద్యలంటే తగని ప్రీతి. తమ పరగణాలో యువకులైన వారిని తన జట్టులో చేర్చుకుని, ఒక చిన్నతరహా సైనిక దళాన్ని తయారు చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు భానోజీ పంతులుకి ఒక లేఖ వచ్చింది.
‘మా సంస్థానంలో ఈ మధ్య దొంగల బెడద ఎక్కువగా ఉంది. దానిని తప్పించడానికి, మీ అక్కన్న మాదన్నలిద్దరినీ వారి స్వంత సైన్యంతోపాటు ఒకసారి మా సంస్థానానికి పంపవలసింది. ఇది మాత్రమే కాకుండా వారివల్ల నెరవేరవలసిన ప్రభుత్వ కార్యాలు మరికొన్ని ఉన్నాయి’ అని లేఖ సారాంశం. రాసినవాడు రాజగోపాలపేట సంస్థానాధీశుడు. భానోజీ పంతులుకి చాలా దగ్గర బంధువు. భానోజీ తన బంధువు మాట తీసేయలేక కుమారులిద్దరికీ అక్కడికి వెళ్లడానికి అనుమతినిచ్చాడు.
అక్కన్న సమరోత్సాహంతో తన స్వంత జట్టును సమకూర్చుకుని, రాజగోపాలపేటకు ప్రయాణమయ్యాడు. మాదన్న అతణ్ని అనుసరించాడు. సంస్థానమంతా బాగా శోధించి అలీపురం గండి అనేచోట దొంగల స్థావరాన్ని కనిపెట్టాడు అక్కన్న. తన ఫౌజుతో కాపు కాసి… వారిని అక్కడి నుంచి తరిమికొట్టాడు. అక్కన్న దెబ్బకి మళ్లీ ఆ చుట్టుపక్కల మసలడానికే దొంగలకు బేజారెత్తింది. సంస్థానాధీశుడు అక్కన్నను అనేక బహుమానాలతో సంతోషపెట్టాడు. ఆ తర్వాత తన సంస్థానం పరిధిలో ఉన్న అనంతగిరి నుంచి కోడూరు వెళ్లే రహదారి నిర్మాణ పనులను అక్కన్న మాదన్నలిద్దరికీ అప్పగించాడు. అటవీ మార్గాన్ని నిష్కంటకం చేస్తూ రహదారి పనులను మూడు మాసాల్లో పూర్తి చేశారు అన్నదమ్ములు. మార్గమధ్యంలో వచ్చే గ్రామాలను పూర్తిగా కట్టుదిట్టం చేసి సంస్థానానికి అప్పగించారు. అలా తమ కర్తవ్యాన్ని నెరవేర్చి అక్కడినుంచి తిరిగి హనుమకొండకు వెళ్లే దారిలో ఒక ముఖ్య సంఘటన చోటుచేసుకుంది.
అన్నదమ్ములిద్దరూ తమ జట్టుతో అటవీమార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒకచోట ఒకానొక మోదుగచెట్టు కింద ఏడెనిమిదేళ్ల బాలుడు నిద్రిస్తున్నాడు. ఒక కాలసర్పం అతనికి పడగనీడ పట్టి నిలుచుని ఉంది. చుట్టుపక్కల ఆ బాలుడికి సంబంధించిన వారెవరూ లేరు. అక్కన్న మాదన్నలిద్దరూ కొద్దిసేపు అక్కడే నిలిచి చూడసాగారు. కాలసర్పం కదలికను నిశితంగా పరీక్షించసాగారు. అది నిశ్చలంగా కొద్దిసేపు నిలిచి… మెల్లిగా అక్కడినుంచి వెళ్లిపోయింది.
అక్కన్న మాదన్నలిద్దరూ ఆ బాలుడిని సమీపించి, నిద్రలేపారు. బాలుడు కన్నులు నులుముకుంటూ లేచాడు. అతని ఒంటిమీద రాజోచితమైన వస్ర్తాభరణాలున్నాయి. “ఎవరు నువ్వు?” అని ప్రశ్నించాడు మాదన్న.
“నా పేరు అబుల్ హసన్” అని మాత్రం జవాబిచ్చాడా కుర్రవాడు.. అచ్చమైన పారసీ భాషలో. “ఊరికే పేరు మాత్రం చెబితే ఎలా తెలుస్తుంది? మీ తల్లిదండ్రులెవరు? మీదే ఊరు?! ఇక్కడికెలా వచ్చావు?” అని మళ్లీ ప్రశ్నించాడు మాదన్న.
“మా తండ్రి పేరు అయినుల్ ముల్క్. మాది అసలు గోల్కొండ. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాం. మా గురువైన ఉస్తాద్ షారాజు కత్తాల్ను కలుసుకుని తిరిగి వెళ్తుంటే… దారి తప్పిపోయాను. మా తండ్రి నాకోసం వెతుకుతుంటాడు. కాసేపట్లో ఇక్కడికి వస్తాడు” అని ధీమాగా సమాధానమిచ్చాడు ఆ బాలుడు. అతని ముఖంలో తండ్రి రాకపోతే తన గతి ఏమిటనే దిగులు ఏ మాత్రమూ లేదు. “అయినుల్ ముల్క్ అంటే… సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా తమ్ముడే కదా!” మళ్లీ అడిగాడు మాదన్న. “అవును” చెప్పాడు అబుల్ హసన్.
‘ఓహో!’ అన్నట్లు తలపంకించాడు మాదన్న. ఆ తర్వాత చిరునవ్వు నవ్వుతూ అబుల్ హసన్ వైపు తిరిగి.. “చూడు హసన్! నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ దగ్గరికి ఓ పాము వచ్చింది తెలుసా? నీకు పడగ పట్టింది. కొంచెం ఉంటే నిన్ను కాటేసేది” చెప్పాడు. “ఊ…” అన్నాడు నిర్లిప్తంగా బాలుడు. అతని ముఖంలో ఏమాత్రం భయం లేదు. “నీకొక మంచిమాట చెప్పనా?! మా హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైతే పాముకి పడగ పడుతుందో… అతను చక్రవర్తి అవుతాడు. కాబట్టి నువ్వు కూడా పెద్దయ్యాక సుల్తాన్ కావచ్చు” అని ఆగాడు మాదన్న.
“షుక్రియా!” అన్నాడు బాలుడు సలాం చేస్తున్నట్లుగా. “తమాషా కాదు… నా జోస్యం ఫలిస్తుంది. నువ్వు సుల్తాన్ అవుతావు. అప్పుడు నాకు మంత్రి పదవి ఇవ్వాలి” షరతు చెబుతున్నట్లుగా అన్నాడు మాదన్న.
“నీకొక్కడికే ఏం?! ఇదిగో ఈయనకు కూడా ఇస్తాను” అన్నాడు అబుల్ హసన్ పక్కనే ఉన్న అక్కన్నను చూపిస్తూ. అక్కన్న మాదన్నలిద్దరూ అప్పటికప్పుడే సుల్తాన్‌కి సలాం చేసే తీరులో సలాములు చేశారు. బాలుడైన అబుల్ హసన్ వారి చర్యకు ఆనందంతో చప్పట్లు కొట్టాడు. ఇంతలో అక్కడికి కొద్దిపాటి సైన్యంతోపాటు అయినుల్ ముల్క్ రానేవచ్చాడు.
తన కుమారుడిని సంరక్షిస్తున్న అక్కన్న మాదన్నలిద్దరినీ అభినందించాడు. వారికి కొన్ని నజరానాలు ఇవ్వబోయాడు. మాదన్న వాటిని అందుకోకుండానే.. “షహజాదా!” అనే సంబోధనతో తన మాటను మొదలుపెట్టాడు. ఆ సంబోధనకే ముల్క్ వదనం విప్పారింది. మాదన్న మరోసారి సలాం చేసి.. “షహజాదా! ఇతను మా అన్న… అక్కన్న. నాపేరు మాదన్న. మా ఇద్దరికీ మీ దయతో హైదరాబాదులో ఉద్యోగాలు ఇప్పించాలి” అని కోరుకున్నాడు. “తప్పకుండా. మీరిద్దరూ వేగిరం నగరానికి వచ్చి, మమ్మల్ని కలుసుకోండి” అని పలికి అయినుల్ ముల్క్ తన కొడుకు అబుల్ హసన్తోపాటు అక్కడినుంచి కదిలిపోయాడు.
కొద్దిపాటి ప్రయాణంతో అక్కన్న మాదన్నలిద్దరూ హనుమకొండకు చేరుకున్నారు. కొడుకుల రాకకోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న భానోజీ పంతులికి ఆనందం కలిగించారు. కాళ్లకు నీళ్లిచ్చిన ధర్మపత్నులిద్దరినీ కన్నులతోనే పలకరించారు. ఆ తర్వాత కామాంబను చూసి కుశల ప్రశ్నలు వేశారు. “అక్కయ్యా! గోపన్న బోర్లా పడ్డాడా! గుమ్మాలు దాటుతున్నాడా?” అని ప్రశ్నలు గుప్పించారు. “ఆ… అన్నీ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఉయ్యాలలో ఉన్నాడు” అంటూ వారిని తీసుకువెళ్లి చూపించింది కామాంబ.
ఉయ్యాలలో నిద్రిస్తున్న కుర్రవాడిని చూసి బుగ్గలు పుణికారు మేనమామలిద్దరూ.
కామాంబ అక్కన్న కేసి చూసి.. “తమ్ముడూ! మీరు వచ్చాక నన్ను మా ఇంటికి పంపిస్తానని నాన్న అంటున్నాడు” చెప్పింది కామాంబ. “కొడుకు ఆటపాటలు చూసుకోవాలని బావగారు ఆరాటపడుతున్నారా?! కబురు మీద కబురు పంపిస్తున్నారా?!” హాస్యానికి అన్నట్లుగా అడిగాడు అక్కన్న. కామాంబ తలదించుకుంది.
“అలాగే అక్కయ్యా! త్వరలో తీసుకువెళ్తాం” అన్నాడు అక్కన్న.. అక్కయ్యకు భరోసా ఇస్తూ.
(వచ్చేవారం… అప్పుడే పుట్టివుంటే…)
– నేతి సూర్యనారాయణ శర్మ, 99517 48340
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

