Humanoid robot | ఒక్కసారి ఊహించుకోండి… మీరొక దేశంలో పర్యటిస్తున్నారు. అక్కడ గైడ్ రోబో అయితే? ఆ తర్వాత, వార్తలు చూద్దామని టీవీ పెట్టుకున్నారు. వార్తలు చదువుతున్నది మరమనిషి అయితే? అంతేకాదు.. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లు, చిత్రకారులు, వ్యోమగాములు…ఇలా మనుషులు చేసే రకరకాల పనుల్ని ఇప్పుడు రోబోలే చేస్తున్నాయి. ఇలాంటి మనుషుల్ని పోలిన ‘హ్యూమనాయిడ్’ రోబోల్ని పరిచయం చేసుకుందాం.
మనిషిలా కనిపించే, చొరవతో పలకరించే ‘నదిన్’ అనే ఈ రోబో సింగపూర్‌లోని ఒక బీమా సంస్థలో కస్టమర్ సర్వీస్ ఏజెంట్. ఎవరైనా సంప్రదించినప్పుడు ఏదో యాంత్రికంగా కావాల్సిన సమాధానాలు ఇవ్వడం కాదు, చక్కగా నవ్వుతుంది, షేక్‌హ్యాండ్ ఇస్తుంది. మళ్లీ వస్తే మిమ్మల్ని గుర్తుపడుతుంది. పాత విషయాలు గుర్తుపెట్టుకుని మరీ ఎంచక్కా కబుర్లు చెబుతుంది. ఇది హిందీ, ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచ్, చైనీస్, జపనీస్ మాట్లాడగలదు.
నిజమైన మనుషులను పోలిన మర మనుషుల్ని హ్యూమనాయిడ్ రోబోలు అంటారు. కానీ అసలు మనిషి ఎవరు, మర మనిషి ఎవరు అన్నది గుర్తుపట్టడమే కష్టమన్నట్టుగా ఒక రోబో తయారైతే అదే.. ‘జియా జియా’. చైనాకు చెందిన ఈ రోబోను అక్కడి జనం సౌందర్య దేవతగా పిలుస్తున్నారు. నిజంగానే తొలిచూపులోనే ఎవరినైనా ఆకట్టుకునే రూపురేఖలతో రూపొందించారు ఆ మరకాంతను. అంతేకాదు, ఎదుటివాళ్లు ఏదైనా మాట్లాడితే చక్కగా సమాధానం చెబుతుంది. కొత్తవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల నుంచి కొన్ని హావభావాలు, మాట్లాడే విధానం లాంటి నైపుణ్యాలు నేర్చుకుంటుంది. త్వరలోనే ఇది అచ్చం మనుషుల్లా ఏడవగలిగేలా, నవ్వగలిగేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు శాస్త్రవేత్తలు.
అంతరిక్షం అంచుల దాకా పయనించాలని ఔత్సాహిక వ్యోమగాములు తహతహలాడుతుంటారు. అలా వెళ్లేందుకు కఠిన శిక్షణ అవసరం. అంతరిక్షంలోకి వెళ్లాక అక్కడి పరిస్థితుల్ని బట్టి ప్రతిస్పందించడం, మిషన్‌ను జాగ్రత్తగా గమ్యస్థానానికి చేర్చేలా పనిచేయడం ఎంతో ముఖ్యం. అయితే ఇలాంటి అన్ని పనుల్నీ నేర్చుకుని గగనంలోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నది ‘వ్యోమమిత్ర’ అనే హ్యూమనాయిడ్ రోబో. అమ్మాయిలా కనిపించే ఈ రోబోను ఇస్రో రూపొందించింది. వచ్చే ఏడాది చేపట్టనున్న ‘గగన్‌యాన్’లో వ్యోమమిత్ర కూడా భాగం కానుంది. వ్యోమనౌక పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని అప్డేట్ చేయడంతోపాటు, అచ్చం మనిషిలాగే అక్కడి వాతావరణాన్ని కూడా వ్యోమమిత్ర తెలుసుకుంటుంది. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రథమ చికిత్స కూడా అందిస్తుంది.
ఐదా… ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటులో సందడి చేసిన రోబో. యూకే పెద్దల సభ హౌజ్ ఆఫ్ లార్డ్స్ సభ్యుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన యంత్ర వనిత ఐదా. ఇది తనకు తెలిసిన విషయాల్ని లేదా బొమ్మల్ని విశ్లేషిచుకొని.. కొత్త బొమ్మల్ని గీయగలదు. కళ్లలో అమర్చిన అత్యాధునిక కెమెరాల సాయంతో చూస్తూ, రోబోటిక్ హ్యాండ్‌తో కుంచెను కదిలిస్తూ చిత్రాల్ని ఆవిష్కరించగలదు. ‘కళ, సృజనాత్మక రంగాల భవిష్యత్తు ఎలా ఉంటుంది?’ అని పార్లమెంటు సభ్యులు ఈ రోబోను ప్రశ్నించారు. ఎక్కడా తడబడకుడా జవాబు చెప్పింది. ఈ రోబో కవితలు కూడా రాయగలదు. మనుషులు తమ అనుభవాల నుంచి కవిత్వం రాస్తారనీ, కాకపోతే తనకు అలాంటి అనుభూతులు తెలియవనీ చెప్పింది.
హ్యూమనాయిడ్ రోబోల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది.. సోఫియా. దీనికి సౌదీ అరేబియా దేశం అధికారికంగా పౌరసత్వాన్ని కూడా ఇచ్చింది. అత్యాధునిక కృత్రిమ మేధతో పనిచేసే ఈ రోబో ఐక్యరాజ్య సమితి, బీబీసీ లాంటి సంస్థలతోపాటు.. టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్ ఇన్ అమెరికా..లాంటి ప్రఖ్యాత కార్యక్రమాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఓసారి పాట కచేరీ కూడా నిర్వహించింది. అంతే కాదు.. కళ్లతో ప్రేమను కురిపించగలదు, కోపంతో పళ్లు నూరనూగలదు. మొత్తం 62 రకాల ముఖ కవళికలు వ్యక్తం చేసేలా దీన్ని రూపొందించారు. వృద్ధులకు ఈ రోబో మంచి తోడు. ఇవి కాకుండా.. వార్తలు చదివే జపాన్ రోబో ‘ఎరిక’, టోక్యోలోని ఒక షాపింగ్ సెంటర్లో పర్యాటకులకు అక్కడి విశేషాలు చెప్పే గైడ్ రోబో ‘జుంకో చిహిహిర’ లాంటి హ్యూమనాయిడ్ రోబోలు అచ్చం మనిషిని పోలిన రూపుతో, ముఖకవళికలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి.
“Humanoid Robot : వృద్ధులకు అండగా ఉంటానంటున్న అందమైన రోబో”