ఆ అమ్మడు ‘దెబ్బలు పడతయ్ రో’ అని చిందేస్తే.. అభిమానులు తాము మందేసినంతగా ఊగిపోయారు. హీరోలకు దీటుగా స్టెప్పులు వేయడంలో తడబాటు ఉండదు. లవ్లీ సీన్లలో బబ్లీగా నటించి మెప్పిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తూకం వేసినట్టు హావభావాలు ప్రకటిస్తుంది. అందుకే, వరుస హిట్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రీలీల. ఇటీవలే ‘పుష్ప 2’ సినిమాలో ‘కిసిక్..’ పాటతో జనాలను ఉర్రూతలూగించిన ఈ భామ పంచుకున్న కబుర్లు..
నటన గొప్ప కళ. ప్రేక్షకులను అలరించే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి? నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి, నాపై నమ్మకం ఉంచిన దర్శకులందరికీ రుణపడి ఉంటా. అయితే, నటిగా ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా.. నా లక్ష్యాన్ని విస్మరించను. నా అభిప్రాయం ప్రకారం.. ప్రతి అమ్మాయికీ వృత్తిపరంగా ఒక బ్యాకప్ తప్పకుండా ఉండాలి. ఒక నటిగా ప్రేక్షకులు నన్నెంతగానో ఆదరిస్తారు. వైద్యురాలిగా కూడా అలాగే గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా.
డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని. యాక్టర్ అయ్యానని నా లక్ష్యాన్ని పక్కన పెట్టలేదు. డాక్టర్ అవుతానని ఇంట్లో వాళ్లకు మాటిచ్చా. సినిమాలు చేస్తూనే.. ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు సిద్ధం అవుతున్నా. నా చిన్నప్పుడు ఒకసారి మా అమ్మమ్మ ఇంట్లో పడిపోయింది. ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. మా అన్నయ్య డాక్టర్. ఆయన వచ్చి చిన్నపాటి వైద్యం చేశాక క్షణాల్లోనే అమ్మమ్మ లేచింది. అప్పుడే ఎప్పటికైనా నేను వైద్యురాలు కావాలని డిసైడ్ అయ్యాను.
పుష్ప 2లో ‘కిసిక్’ పాటకు విపరీతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నా. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇన్ని అవకాశాలు రావడానికి కారణం ఇండస్ట్రీ, ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానమే. వారి ప్రేమను మంచి సినిమాలు చేయడం ద్వారా తిరిగి ఇవ్వాలన్నదే నా తపన.
చిన్నప్పటి నుంచి డ్యాన్స్ విపరీతంగా చేసేదాన్ని. అది గమనించిన మా అమ్మ నన్నెంతగానో ప్రోత్సహించింది. డ్యాన్స్ పరంగా నాకు వస్తున్న క్రెడిట్ అంతా మా అమ్మకు, గురువులకే చెందుతుంది. డ్యాన్స్ నా బలం. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఇండస్ట్రీలో కొనసాగుతున్నా! డ్యాన్స్‌తోపాటు నటన కూడా చాలా ముఖ్యం. రెండిటినీ సమన్వయం చేసుకోవాలి. నటన నాకు అబ్బింది నాట్యం వల్లే! చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నా. శాస్త్రీయ నృత్యంలో హావభావాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అలా అభినయం నాకు అబ్బింది.
కెరీర్ ప్రారంభంలోనే ఓ హీరో కూతురు పాత్ర చేసే అవకాశం వచ్చింది. అలాంటి పాత్ర చేస్తే కెరీర్ రిస్క్‌లో పడుతుందని చాలామంది భయపెట్టారు. కానీ, కథ బాగా నచ్చడంతో ఆ మాటలేం పట్టించుకోలేదు. ఆ సినిమా ఆనందంగా చేశాను. అందంగా కనిపించే పాత్రలు ఎన్నో చేస్తాం. కానీ, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న ఇలాంటి పాత్రలు ఎప్పుడోగానీ రావు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఒప్పుకోవాలి కానీ, మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే ఎలా?
నాట్యం విషయానికి వస్తే కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా గంభీరంగా ఉంటాయి. అయితే, అలాంటివి నటనకు పనికిరావు. కొన్ని సన్నివేశాల్లో చాలా క్యాజువల్‌గా నటించాల్సి ఉంటుంది. అలాంటి సీన్లు చేయడం కష్టమనిపిస్తుంది. ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా.. సీన్ పండించడం కత్తి మీద సామే! ఒక్కో సినిమా చేసేకొద్దీ నన్ను నేను మెరుగుపర్చుకుంటున్నాను. దర్శకులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా నటించే ప్రయత్నం చేస్తుంటా!