ఎన్నికలూ – ప్రచారాలూ
ఎన్నికలంటే చాలారోజుల వరకూ నాకేమీ అవగాహన లేదు. మామూలుగానే నాన్న ఎప్పుడూ వార్తలను చాలా ఆసక్తిగా వినేవాడు. ఇక ఎన్నికలప్పుడు చెప్పనే అక్కర్లేదు. నాన్న రేడియో వింటున్నప్పుడూ, అప్పుడప్పుడూ ఎవరైనా ఇంటికి న్యూస్‌పేపర్ తెస్తే..
ఎన్నికలంటే చాలారోజుల వరకూ నాకేమీ అవగాహన లేదు. మామూలుగానే నాన్న ఎప్పుడూ వార్తలను చాలా ఆసక్తిగా వినేవాడు. ఇక ఎన్నికలప్పుడు చెప్పనే అక్కర్లేదు. నాన్న రేడియో వింటున్నప్పుడూ, అప్పుడప్పుడూ ఎవరైనా ఇంటికి న్యూస్‌పేపర్ తెస్తే.. ఆ వార్తల ద్వారానే మాకు ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థి, ప్రత్యర్థి, నియోజకవర్గం, ప్రచార సరళి, ఆధిక్యత, డిపాజిట్ గల్లంతులాంటి మాటలు తెలిసేవి.
నేను తొమ్మిదేళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హయగ్రీవాచారి మా ఊరికి వస్తున్నారని అందరూ పెద్దగా హడావుడి పడుతూ ఉండటం చూశాను. మా ఘనపూర్ నియోజకవర్గానికి ఆఖరి జనరల్ అభ్యర్థి ఆయనే అనుకుంటా. ఆ తరువాత ఎస్సీలకు కేటాయించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆయన ఊరేగింపుగా వచ్చి ఊరిలోని ప్రధాన మార్గాల గుండా వెళతాడనీ, అందరూ ఎక్కడికీ వెళ్లకుండా ఆయన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనీ పొద్దున్నే చాటింపు వేశారు.
అమ్మ ఎప్పటిలాగే మేము బడి నుంచి వచ్చి స్నానం చేశాక.. రోజూ వేసుకునే బట్టలు కాకుండా ఇంకాస్త మంచివి సందుక లోంచి తీసి ఇచ్చింది. మా జడల్లో పూలదండలు పెట్టింది. ఆ రోజుకు మా సాయంత్రపు ఆటలన్నీ బంద్ అయ్యాయని మాకు కొంచెం కినుకగా ఉన్నా.. ఈ కొత్త వేడుక ఏమిటో చూద్దామని ఉబలాటపడ్డాం. అయితే వేచీవేచీ .. చూసీచూసీ.. సాయంత్రం వెళ్లిపోయి చీకటి కూడా పడటం మొదలయ్యింది. బట్టలు నలగకుండా, ఏమీ చేయకుండా అలా ఎదురు చూడటం ఎంత పెద్దశిక్షో మాకు అర్థమైంది. మేము రోజూ భోజనాలు చేసే టైం ఎనిమిది అవుతుండగా.. “ఆ అయ్యగారు ఎప్పుడొస్తడో.. ఏందో! పిల్లలకన్న అన్నాలు పెట్టరాదు. నిద్రపోయేటట్లున్నరు” అని మా బాధ అర్థం చేసుకున్న నానమ్మ చెప్పింది.
చేసేది లేక.. “తొందరగా తినండి.. మధ్యల ఆయన వొస్తే నాన పిలుస్తరు” అని మాకు భోజనం పెట్టింది అమ్మ. దాంతోని హడావుడిగానే తినేశాం. ఇక నిద్రాదేవిని ఆపడం మా తరమా?! ‘పండుకోవద్దు.. పండుకోవద్దు..’ అనుకుంటూనే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నామో తెలియదు. సడన్‌గా ఎవరో వచ్చి.. “లేవండి.. లేవండి! ఒచ్చిన్రు.. ఒచ్చిన్రు!” అంటూ లేపారు. “మీరు పొయ్యి ఎదుర్కుంటె కాదా? నిద్రపోయిన పిల్లలను లేపుడు ఎందుకు?!” అని అమ్మ అంటున్నా వినకుండా.. మమ్మల్ని ఎవరో బయటికి ఎత్తుకుపోయారు. పెద్దగా డప్పు చప్పుళ్లు, కోలాహలం వినిపిస్తూ అంతకంతకూ దగ్గరైంది. ఓ పెద్ద ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగుతూ.. తెల్లని బట్టల్లో ఉన్న ఒకాయన అందరికీ చేతులూపుతూ వస్తున్నాడు. అంతలోనే మా ఊరి సర్పంచ్ నారాయణ.. “మన చిన్నమ్మాయితోటి ఎమ్మెల్యే సారుకు దండ ఏయిద్దాం దొరా!” అని అప్పటికప్పుడు డిసైడ్ చేశాడు. “ఎందుకులే నారాయణా! నువ్వే ఎయ్యి!” అని నాన్న అన్నా కూడా వినలేదు. అందరూ కూడా.. “గంతే.. గంతే!” అన్నారు. వాళ్లంతా కలిసి నన్ను టార్గెట్ చేయడమెందుకో నాకైతే అర్థం కాలేదు. ఓ పక్కన నిద్ర వస్తున్నది. మరో పక్కన ఆ జీప్‌లో ఎక్కడం ఎలాగో కూడా తెలియకుండా ఉన్నది. చివరికి మా నాన్న తన రెండు చేతులతో నన్ను అమాంతం పైకెత్తాడు. ఎవరో నా చేతికి పూలదండ అందించి..
“అయ్యగారికి (హయగ్రీవాచారి గారిని అలాగే పిలిచేవారట) ఎయ్యమ్మా!” అని చెప్పారు. అంతెత్తుకు ఎగిరి ఎలా వెయ్యాలా అనుకుంటుండగా ఆయనే తలవంచారు. నా బుగ్గ పిండి.. “చిన్నపిల్ల కదా! భయపడుతున్నట్టుంది!” అన్నాడు. నా ఫీలింగ్‌ను అయిష్టతగా కాకుండా.. భయంగా అర్థం చేసుకున్నాడన్నమాట. మరో ఆరేడేళ్లకు మేము కొత్తింట్లోకి మారాక.. ఓసారి ఎన్నికలొచ్చాయి. మాకు అప్పటికీ కొత్తింటికి ఇంకా కాంపౌండ్ వాల్ లేదు. అప్పట్లో ప్రచారంలో భాగంగా ప్రహరీలకు పోస్టర్లు అంటించడం, గోడల మీద రాయడం చేస్తుండేవారు. ఇప్పటిలాగా ఇంతింత పెద్ద హోర్డింగ్స్ లేవు. గోడల మీద రాయడం, పోస్టర్లు అతికించడం ఇంటివాళ్లు చూస్తే అనుమతించేవారు కాదు. దాంతో ఆ పనులను రాత్రి పూటే చేస్తుండేవారు. ఓసారి మా ఇంటికి ఒక చుట్టాలాయన వచ్చాడు. ఆయనొచ్చి అప్పటికే వారమైంది. ఆయన కాస్త భోజనప్రియుడు. రోజూ ఇష్టమైన వంటలు చెప్పి మరీ చేయించుకుని తినేవాడు. ఆరోజు మా ఇంట్లో తద్దినం అయింది. చాలా రకాల వంటలతోబాటు గారెలూ, బూరెలూ చేశారు . ఆయన కాస్త ఎక్కువ తిన్నాడేమో.. రాత్రయ్యేసరికి విపరీతమైన గ్యాస్ సమస్యతో బాధపడుతున్నాడు. మావాళ్లు వంట సోడా నీళ్లల్లో కలిపి ఇచ్చారు. జాజికాయ, జాపత్రి, సున్నం, కాచు, పుదీనా వేసిన తమలపాకు తాంబూలం కూడా ఇచ్చారు.
నాన్నా, ఆయనా వరండాలో చెరో బల్ల మీద పరుపులు వేసుకుని పడుకున్నారు. అయితే.. ఆయన చేసే శబ్దాలకు నాన్నకు అస్సలు నిద్రపట్టలేదట. కాసేపటికి నాన్న లేచి వాకిట్లో చల్లగాలికి పచార్లు చేస్తున్నాడట. ఆ సమయంలోనే ఓ యువకుడు లై (గోధుమపిండి ఉడకబెట్టి చేసే బంక) డబ్బా, పోస్టర్ల కట్టా పట్టుకుని వచ్చాడట. పోస్టర్‌కు లై పూసి, మా గోడకు అతికించే సమయంలో పెద్ద శబ్దం వినిపించేసరికి అతడు భయపడి.. ఆ డబ్బా, పోస్టర్ల కట్ట అన్నీ అక్కడే పడేసి పరిగెత్తి పోయాడట. వాటిని తీసుకెళ్లమంటూ నాన్న పిలిచినా.. వెనక్కి తిరిగి కూడా చూల్లేదట. మర్నాడు వాకిలి ఊడ్చే మాలిమ్బీ.. “గివ్వన్ని ఎవలు పడేసిన్రు?!” అని అమ్మను అడిగితే.. అమ్మ నాన్నను అడిగింది. జవాబు చెప్పకుండా.. “ఏం జేస్తం? ‘శబ్ద భేది’ ప్రభావం! ఎదుటివాణ్ని ఆమడదూరం తరిమే సాధనం!” అంటూ నాన్న ఒకటే నవ్వడం! ఆ తరువాతెప్పుడో అసలు విషయం చెప్పాడు. అప్పుడు ఎన్నికల ప్రచారాల్లో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేదే చెప్పేవారు తప్ప.. ‘ముందటి వాళ్లు అది చేయలేదు. ఇది చేయలేదు’ అనడం తక్కువ. అంతేకాదు ప్రత్యర్థులను కూడా.. ‘వారు.. వీరు..’ అంటూ గౌరవంగా సంబోధించేవారు. ఇప్పట్లా తిట్టుకునేవారు కాదు. వ్యక్తిగత, కుటుంబసభ్యుల దూషణ కూడా ఉండేది కాదు. ఏమిటో.. మాయాబజార్ సినిమాలో చెప్పినట్టు కాల మహిమ!
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

