అందరూ ఇష్టంగా తినే చిరుతిండి సమోసా. ఇట్టే కరిగిపోయే చిట్టి సమోసాలు మొదలు.. కిలోల కొద్దీ బరువుతో తయారయ్యే బాహుబలి సమోసాల వరకూ.. సమోసా భిన్న రుచిః. విదేశాల్లోనూ సమోసాల వ్యాపారంతో కోట్లకొద్దీ లాభాలు గడిస్తున్న వ్యాపారులు ఉన్నారు. భారతీయులు ఎక్కువగా ఇష్టపడే ఆనియన్ సమోసా, కార్న్ సమోసా, ఆలూ సమోసా, పనీర్ సమోసాతోపాటు నాన్‌వెజ్, చీజ్, చాక్లెట్, స్వీట్ సమోసా వంటి వెరైటీలు కూడా వచ్చేశాయి.
సమోసాల చరిత్ర ఈనాటిదేం కాదు. ఢిల్లీ సుల్తానుల కాలంలో బాగ్దాద్ నుంచి వచ్చాయని చెబుతున్నా.. వాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని కల్పించింది మాత్రం భారతీయులే. భారత వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రలోనూ చోటు దక్కించుకున్న చిరుతిండి ఇది. విదేశాల్లోనూ సమోసా తయారీ కోసం అనేక స్టార్టప్‌లు వెలిశాయి. కెనడా, అమెరికాల్లో వాల్‌మార్ట్, ట్రేడర్‌జోస్ వంటి సంస్థలు సమోసాలు విక్రయిస్తున్నాయి. ఒక్క మనదేశంలోనే రోజుకు ఆరు కోట్ల సమోసాలు అమ్ముడవుతున్నాయి. అంటే, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్టే.