మనందరిదీ ఒకే ప్రపంచం. కానీ, ప్రజలు రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నారు. ఆర్థిక అంతరాలు ఒకే ప్రపంచాన్ని రెండుగా మార్చాయి. ఉన్నవాళ్లు మరిన్ని సౌకర్యాల కోసం ఆరాటపడుతున్నారు.లేనివాళ్లు బతికేందుకు జీవన పోరాటం చేస్తున్నారు. నగరాల్లో ఒక పక్కన సంపన్నులు ఉండే గేటెడ్ కమ్యూనిటీలు, ఆ పక్కనే పందులతో సహజీవనం చేసే పేదల మురికివాడలు ఉన్నాయి. రచయిత ఈ ఉభయ ప్రపంచాల్లోని ఆధునిక జీవన శైలిని రంగస్థలంపై ఏకకాలంలో ఆవిష్కరించడానికి పెద్ద సాహసమే చేశారు.
దివ్య కిషోర్ భార్యభర్తలు. వాళ్లిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఉద్యోగ బాధ్యతల రీత్యా వాళ్లు దాంపత్య జీవితాన్ని అనుభవించడం గగనమవుతుంది. కుటుంబ వృద్ధి కోసం పిల్లలను కనాలనీ, పుట్టిన బిడ్డను అపురూపంగా పెంచాలన్న కోరిక వారిద్దరికీ కలగలేదు. పిల్లలంటే తమకు ఇష్టం లేదని రైలు బాబాయి (ఓ పాత్ర) ఎదుట కుండబద్దలు కొడతారు. పిల్లలను కని, పెంచడంలో ఉన్న కష్టాలను ఏకరువు పెడతారు. ‘అసలు పిల్లల్ని సక్రమంగా కని, పెంచే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయా?’ అని ఎదురు ప్రశ్న కూడా వేస్తారు. ‘ఇద్దరూ లక్షలకు లక్షలు సంపాదిస్తారు. కానీ, పిల్లల్ని కనరన్న మాట’ అని రైలు బాబాయి ఎద్దేవా చేసినా పట్టించుకోరు. ‘పిల్లలు కలగకపోతే మనవాళ్లు జాలి చూపిస్తారు. అసలు వద్దనుకునే వాళ్లను అసహ్యించుకుంటారు’ అని రైలు బాబాయి హెచ్చరిస్తాడు. కానీ, ఎవరి కారణాలు వారు చెబుతారు. వరుసగా ఆడపిల్లలు పుట్టారని తన తండ్రి, తన తల్లిని నిత్యం కొడుతూనే ఉండేవాడని, అందుకే తనకు అమ్మతనమంటే ఏవగింపు పుట్టిందని దివ్య చెబుతుంది. తన సోదరుడు బుద్ధిమాంద్యుడని, అమ్మానాన్నలు ఎప్పుడూ అతనిపైనే దృష్టిపెట్టేవారని, తనను పట్టించుకునేవారుకారని కిషోర్ చెబుతాడు. చాలాకాలం ఒంటరిగా బతికిన తన జీవితంలోకి దివ్య వచ్చాకనే సుఖ సంతోషాలు పొందుతున్నానని అంటాడు.
సంపన్నుల ఆధునిక జీవనశైలిలో భాగమైన రేవ్ పార్టీలు చేసుకోవడం, పబ్‌లకు వెళ్లడం, జల్సా చేయడం, మద్యం తాగడం, స్త్రీలోలత్వానికి లొంగడం సాధారణమని కిషోర్ భావిస్తుంటాడు. డింక్ జీవన (డ్యూయల్ ఇన్కమ్.. నో కిడ్స్) విధానాన్ని ఆయన బలపరుస్తాడు. అయితే కిషోర్ స్నేహితుడు నాగు దాన్ని ఆసరాగా తీసుకుని దివ్యపై కన్నేస్తాడు. నాగు అసభ్య ప్రవర్తన, అశ్లీల భాష దివ్యకు అస్సలు నచ్చదు.
దివ్య ఇంట్లో పనిమనిషి సముద్రాలు మురికివాడలో ఉంటుంది. నాగు కీచకబుద్ధిని గమనించి ఎప్పటికప్పుడు కుక్క కాటుకు చెప్పుదెబ్బలా బదులిస్తుంటుంది. నాగు నుంచి దివ్యను కాపాడుతుంటుంది. కిషోర్ మరో స్నేహితుడు పార్థు మంచివాడు. బతికి చెడ్డవాడు. విలువలకు గౌరవం ఇచ్చేవాడు. స్వశక్తితో ఎదుగుతూ, పిల్లలను క్రమశిక్షణగా పెంచుతూ, భార్యతో కలిసి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు.
సూరీడనే పదేళ్ల పిల్లవాడిని సముద్రాలు సాకుతూ ఉంటుంది. పార్థు శిక్షణలో సూరీడు చెస్‌లో గ్రాండ్ మాస్టర్‌గా ఎదుగుతాడు. సూరీడు కోసం సముద్రాలు సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమవుతుంది. పోలియో సోకిందని ఆ పిల్లవాడిని చిన్నప్పుడే కిషోర్ వదిలించుకున్నాడన్న విషయం రైలు బాబాయి ద్వారా బయటపడుతుంది. మధ్యలో సూరీడు చిన్న ప్రమాదంలో గాయపడటం, దివ్య ఇంట్లోనే ఉంటూ అతనికి సపర్యలు చేయడంతో తనలో నిద్రాణమైన ‘అమ్మతనం’ కొద్దికొద్దిగా మేల్కొంటుంది. ఆ బాబుకు తానే అసలు తల్లినన్న విషయం దివ్యకు తెలియడంతో కథ సుఖాంతమవుతుంది.
నాటిక ప్రారంభంలోనే పంది తన పిల్లల కోసం సివంగిలా పోరాడే వైనాన్ని చూపుతారు. ఈ నాటిక అమ్మతనానికి ఆలంబన అయిన కుటుంబ జీవనాన్ని కాపాడుకోవాలనే సందేశం ఇస్తుంది. బిడ్డలను కనడం వేరు. పెంచడం వేరు. అమ్మతనం (మదర్‌హుడ్) కేవలం స్త్రీలకే పరిమితం కాదు. పురుషుల్లోనూ, థర్డ్ జెండర్లోనూ ఉంటుంది. పిల్లలను ప్రేమానురాగాలతో బేషరతుగా సాకడం ప్రకృతి ధర్మం. తమ సొంత పిల్లలు కాకపోయినా ఆ మాతృత్వప్రేమ (అమ్మతనాన్ని) పార్థు దంపతులు, సముద్రాలులో మనం చూస్తాం. మానవ సంబంధాలను, మానవ ధర్మాలను, మానవ విలువలను ప్రస్తుత ధనస్వామ్య వ్యవస్థ ధ్వంసం చేస్తుంది. అమ్మతనం దెబ్బతినడం అందులో భాగమే. దీనినే ‘పరాయీకరణ’ అంటున్నాం. నాటకంలో చెప్పవలసిన అంశాన్ని నాటికగా కుందించినట్లయింది. పాత్రలు ఎదిగే తీరు కుంచించుకుపోవడం వల్ల ప్రేక్షకులు లీనం కాలేకపోయారు. ‘ఆధునిక జీవనశైలిలో వస్తున్న వికృత పోకడలకు ఎలా మంగళం పలకాలి?’ అన్న సందేహం శేషప్రశ్నగానే మిగిలిపోతుంది.
నాటిక: ఇది రహదారి కాదు
రచన: ఆకురాతి భాస్కర్ చంద్ర
దర్శకత్వం: ఎస్.ఎం.బాషా
ప్రదర్శన: మిత్ర క్రియేషన్స్, హైదరాబాద్
పాత్రధారులు: దేవేష్, నాగరాణి, జగదీశ్, సింధూరి, మంజునాథ్,
సాయిమురళి తదితరులు…
-కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు