పెండ్లయిన మూడోనెల కోడలమ్మ మామిడి కాయ కోరాల్సిందే! ఇది పాత రోజుల సంగతి. ఏడాది దాటినా పిల్లలు కలగకపోతే గుళ్లూగోపురాలు తిరగడం మొన్నటి మాట. ఓ నాలుగేండ్లు ఎంజాయ్ చేసి పిల్లలను ప్లాన్ చేద్దాం… ఇది నిన్నటి ఈక్వేషన్. అసలు పిల్లలే వద్దనుకోవడం ఇవాళ్టి ఫ్యాషన్. రెండు రెండ్ల నాలుగు చేతులా సంపాదిస్తున్నా… పిల్లలు వద్దనుకుంటున్నారు కొందరు. ‘డ్యూయెల్ ఇన్‌కం నో కిడ్స్’ (డింక్) మాయలో పడిపోతున్నారు.
డింక్ లైఫ్‌ైస్టెల్ అమెరికా, యూరోపియన్ దేశాల్లో చాలా ఏండ్ల క్రితం నుంచే ఉంది. ఇప్పుడు మన దగ్గర యువత ‘డింక్’పై మోజుపడుతున్నారు. మన దేశంలో కొత్తజంటల్లో ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నవారి సంఖ్య 30 శాతానికి చేరువగా ఉందని ‘గిట్నెక్స్’ డేటా ఉవాచ! పిల్లలు వద్దనుకుంటున్నాం అని చెప్తున్న జంటలను చూసి పెద్దలు ఇదేం పిదప కాలం అనడం కామన్. అయితే, అందుకు వాళ్లు చెప్తున్న కారణాలు బోలెడు. అందులో ప్రధానమైనది ఆర్థిక కష్టాలే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం ఆర్థికంగా మోయలేని భారమని చాలామంది యువజంటల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే పిల్లల్ని కనే ముందు లెక్కలు వేసుకుంటున్నారు. పుట్టిన పిల్లలకు 18 ఏండ్లు నిండేసరికి సగటున రూ.కోటిన్నర నుంచి రెండు కోట్ల దాకా ఖర్చవుతున్నదని ఓ అంచనా. ఒక బిడ్డను సెటిల్ చేయాలంటే జీవితాన్ని పణంగా పెట్టాల్సిందేనని భావిస్తున్నారు.
నార్మల్ డెలివరీ జరిగితే ఓకే! కానీ, సిజేరియన్ అయినా, నెలలు నిండకుండానే కాన్పు వచ్చినా బిల్లు తడిసి మోపెడవుతున్నది. తల్లికి ప్రసూతి సెలవులు అయిపోగానే పాపను డే కేర్ సెంటర్లో చేర్చేందుకు మళ్లీ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఆ తర్వాత స్కూల్లో వేయడం అనేది లక్షల్లో ‘చదివించు’కోవడమే. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో చేర్పించాలంటే రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చుపెట్టాలి. ఇలా లక్షలతో కూడుకున్న చదువును పిల్లలకు అందించాలంటే ఈ రోజుల్లో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎంత ఉన్నతోద్యోగం చేస్తున్నా ప్రైవేట్ కొలువు రాత్రికి రాత్రి ఊడిపోవచ్చన్న బెంగ వారిని మరింత కంగారుపెడుతున్నది. ఇలాంటి ఆలోచనల్లో నుంచే పిల్లలు వద్దనుకొని డింక్ లైఫ్‌ైస్టెల్‌కు మారిపోతున్నారు కొందరు. దేశంలో దాదాపు 65 శాతం తల్లిదండ్రులు తమకు వచ్చే వార్షికాదాయంలో స్కూల్ ఫీజులకే ఖర్చు పెడుతున్నారనేది అధ్యయనాలు తేల్చడం వీరి అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నది.
‘డింక్’పై మనసు పారేసుకోవడానికి అమ్మాయిలు చెప్తున్న కారణాలు ఆలోచింపజేసేలా ఉంటున్నాయి. మన దేశంలో పేరెంటింగ్ అనేది అమ్మ బాధ్యతే అని చాలామంది భావన. ఈ తరుణంలో తల్లిగా ఇంటిని, పిల్లలను బ్యాలెన్స్ చేయాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఊసే లేకపోవడంతో.. పెద్దల అండాదండా కరువైంది. ఈ క్రమంలో తల్లిదండ్రులే పిల్లలను చూసుకోవాల్సి వస్తున్నది. ఇద్దరిలో అమ్మ నెత్తిన అదనపు బాధ్యతలు పడుతున్నాయి. తన ఉద్యోగాన్ని వదులుకొని పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికి ఈ తరం ఆడవాళ్లు సిద్ధంగా ఉండటం లేదు. అశోక యూనివర్సిటీ చేసిన ఒక సర్వే ప్రకారం.. దేశంలో 50 శాతం మహిళలు పిల్లల పెంపకం కోసం 30 ఏండ్లకే ఉద్యోగాలను వదిలేసుకుంటున్నారట. ఒకవేళ తిరిగి ఉద్యోగంలో చేరితే కనీసం నాలుగు నెలలైనా తిరక్కుండానే రిజైన్ చేస్తున్న మహిళా ఉద్యోగుల సంఖ్య 48 శాతంగా ఉన్నదట.
పిల్లల్ని కని, పెంచే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, వ్యక్తిగతంగా లైఫ్ మిస్ అవుతామన్న భ్రమల్లో కొందరు ఉంటున్నారు. అందుకే ఒత్తిళ్లతో కూడిన జీవితం తమకు వద్దని డింక్ లైఫ్ైస్టెల్ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా జనరేషన్ జెడ్ యువత వ్యక్తిగత స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్త్తున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డింక్ కపుల్స్ పిల్లలు వద్దనుకోవడానికి మరో పెద్ద కారణం.. జనాభా పెరిగిపోవటం, పర్యావరణానికి ముప్పేనట. ఆధునిక ప్రపంచంలో ఆహార కొరత వెన్నాడుతున్నది. నీళ్ల కొరత ఉండనే ఉంది. స్వచ్ఛమైన గాలి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కల్తీ లేని ఆహారం కాసులు పోసి కొందామన్నా దొరకని దుస్థితి. ఇలాంటి సమస్యల మధ్యకు మళ్లీ మేం పిల్లల్ని కని తీసుకురావటం కన్నా పాప కార్యం లేదని యువ జంటలు ఆలోచిస్తున్నాయి. అంతేకాదు, తాము పిల్లల్ని వద్దనుకోగా& ‘పిల్లల్ని కనకండి’ అని ప్రచారం చేస్తున్నారు. వీళ్లను యాంటీ నేటలిస్టులుగా పిలుస్తుంటారు. వీళ్లు చెప్పే మాట ఏంటంటే.. ‘తల్లిదండ్రులు కావాలనుకుంటే మీరే పిల్లల్ని కనాల్సిన పనిలేదు. దేశంలో అనాథ పిల్లలకేం కొరత లేదు. వాళ్లను దత్తత తీసుకొని వారికి జీవితం ఇవ్వండి’ అని చెబుతున్నారు. కానీ, యువశక్తే భారత్‌కు బలం. ఆ యువతే పిల్లల్ని కనడానికి ఇష్టపడని పరిస్థితి. ఇదే ట్రెండ్ కొనసాగితే మరో 30 ఏండ్లనాటికి దేశ జనాభా పూర్తిగా తగ్గిపోతుంది. వృద్ధ భారతంతో అభివృద్ధి కుంటుపడుతుంది. డింక్ ఉచ్చులో చిక్కుకోకుండా ఉన్నంతలో ఉన్నతంగా బతకడం అలవాటు చేసుకుంటే పిల్లలను కనడం, పోషించడం పెద్ద కష్టమేం కాదు!
పిల్లలు వద్దు సరే.. మరి ప్రేమించడం ఎలా? ప్రపంచాన్ని చుట్టడం, లగ్జరీ లైఫ్‌లోనే సంతోషాన్ని వెతుక్కుంటే ఎలా? అన్న ప్రశ్నకూ వారి వద్ద సమాధానం లేకపోలేదు. అందుకోసం కొందరు ‘డింక్ లైఫ్’ను కాస్తా ‘డింక్ వాడ్’గా మార్చేసుకున్నారు. అంటే ‘డబుల్ ఇన్‌కాం నో కిడ్స్ విత్ ఏ డాగ్’. పిల్లలు వద్దనుకొని కుక్కల్ని పెంచడమే డింక్వాడ్. బిడ్డ బదులుగా ఓ పెట్ని పెంచుకుంటారన్నమాట.