నాన్న అంతే!! బాధ్యతల బరువునీ, కాసుల కష్టాలనీ, తప్పనిసరి త్యాగాలనీ నిభాయిస్తూనే… ఎదుగుతున్న పిల్లల చులకన భావాన్ని కూడా తట్టుకుంటాడు. అయితే ఓ దశాబ్దకాలంగా తను మరింత బాధ్యతను తలకెత్తుకున్నాడు. ఇంటిని మరింతగా గమనించుకుంటున్నాడు.
జీవితంలో ఎదురయ్యే ప్రతి బంధం అపురూపమైనదే! బడిలో పరిచయం అయిన తొలి మిత్రుడి దగ్గర్నుంచీ, అర్ధరాత్రి తలుపు తడితే కష్టాన్ని పంచుకునే పొరుగు వరకూ అంతా మనవాళ్లే. కానీ, ఇన్నేసి అనుభవాలతో సాగే జీవితాన్ని ఇచ్చి, దాన్ని నడిపించే తల్లిదండ్రులు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. తొమ్మిది మాసాలు మోసి అమ్మ కన్న శిశువును.. తప్పటడుగుల నుంచి తన కాళ్ల మీద నిలబడే దాకా గుండెల మీద మోస్తాడు తండ్రి. కాకపోతే తల్లి గురించి వినిపించే కావ్య వర్ణనలూ, పొగడ్తలూ తండ్రికి కనిపించవు. అంత మాత్రాన ‘నాన్న ఎందుకో వెనకబడినట్టు’ కాదు. తన తీరు అంతే! గుర్తింపుతో సంబంధం లేకుండా గుట్టుగా సాగిపోతాడంతే. తన కడుపున బడబాగ్నులు ఉన్నాయని సంద్రం చెప్పదు, నీకు ఆయువుని ఇస్తున్నానని చెట్టూ అరవదు, నీ గొంతు తడుపుతున్నానని నీరు పలవరించదు. తమ బాధ్యతగా అవి చేసుకుపోతాయంతే. నాన్న కూడా అంతే!! బాధ్యతల బరువునీ, కాసుల కష్టాలనీ, తప్పనిసరి త్యాగాలనీ నిభాయిస్తూనే… ఎదుగుతున్న పిల్లల చులకన భావాన్ని కూడా తట్టుకుంటాడు. అయితే ఓ దశాబ్దకాలంగా తను మరింత బాధ్యతను తలకెత్తుకున్నాడు. ఇంటిని మరింతగా గమనించుకుంటున్నాడు.
ఉద్యోగం పురుషలక్షణం, మగవాడు తిరగక చెడ్డాడు, మగవాడి జీతం అడగకూడదు.. లాంటి సవాలక్ష సామెతలు వింటూ వచ్చాం. అన్నీ కూడా లోకం ఏం కోరుకుంటుందో చెప్పేవే. భర్త అనేవాడు ఉపాధి చూసుకుంటే, భార్య ఇంటి పనులు చూసుకోవాలని సూచించేవే. కానీ కాలం మారింది! ఓ నలభై ఏళ్ల క్రితం భర్తతో పాటు భార్య కూడా ఉద్యోగం చేయడం చోద్యం. క్రమంగా ఆ హద్దులు చెరిగిపోయాయి. ఇక ఇరవై ఏళ్ల క్రితం భార్య మాత్రమే ఉద్యోగం చేస్తూ భర్త ఇల్లు చూసుకోవడం నామోషీ. ఇప్పుడు ఆ పరిస్థితులూ మారాయి. హౌజ్ వైఫ్ లాగా హౌజ్ హజ్బెండ్ అనే గుర్తింపు ఇప్పుడు సహజం అయిపోయింది.
కంప్యూటర్, ఆ తర్వాత ఇంటర్నెట్.. ఈ రెండింటి కలయికతో ఉద్యోగావకాశాలు పెరిగిపోయాయి. మహిళలకు కెరీర్ కలలు నెరవేర్చుకునే సానుకూలత వచ్చేసింది. దానికి వర్క్ ఫ్రం హోం కూడా తోడవడంతో.. ఎవరైనా ఇంటి నుంచి పనిచేసే సౌలభ్యం కుదురుతున్నది. అడపాదడపా, అది కూడా కొద్దిమందికి మాత్రమే పరిమితమైన ఇంటి నుంచి పని సూత్రం కొవిడ్ దెబ్బతో జీవితభాగమైపోయింది. దాంతో ఆడవారు పనికి వెళ్తే పిల్లలను చూసుకుంటూ వర్క్ ఫ్రం హోం చేయడం లేదా ఏ ఉపాధీ లేకపోయినా ‘నేను ఇల్లు చూసుకుంటానులే’ అని భరోసా ఇవ్వడం ఇప్పుడు నామోషీ ఏం కాదు. అమెరికాలాంటి సంపన్న దేశంలోనే 2023 నాటికి ఈ హోజ్ హజ్బెండ్స్ శాతం ఏకంగా 18 శాతం ఉందట. 1989లో 11 లక్షలుగా ఉన్నవీరి సంఖ్య.. నేటికి రెట్టింపు అయిందని Pew Research Center తేల్చింది. ఇది కేవలం నిరుద్యోగం వల్ల చేసుకున్న ఎంపిక కాదు. ఎందుకంటే ఓ నాలుగో వంతు హోజ్ హజ్బెండ్స్ పిల్లల్ని చూసుకోవడం కోసమే తాము ఇంటికి పరిమితం అవుతున్నామని తేల్చారు.

ఓ తండ్రి పిల్లలతో ఎక్కువసేపు ఉంటే ఏదన్నా ఉపయోగం ఉంటుందా అనే అనుమానానికి సవాలక్ష పరిశోధనలు జవాబుగా నిలుస్తున్నాయి. హౌజ్ హజ్బెండ్‌గా ఉన్నవారికి ఇవి అదనపు లాభాలు.. తొలిరోజుల బంధంతో: లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో జరిపిన ఓ పరిశోధనలో మొదటి మూడు నెలలపాటు పిల్లలతో ఆడుతూపాడుతూ సమయం గడిపిన తండ్రుల వల్ల, ఆ పిల్లల విశ్లేషణ శక్తి బలపడినట్టు తేలింది. తొలి రోజులలో తండ్రికి దగ్గరగా ఉన్నవారికీ, లేనివారికీ మధ్య వ్యత్యాసం రెండేళ్ల తర్వాత కూడా కనిపించింది. మానసికంగా దృఢంగా: కెనడాలో మూడు నుంచి పదమూడేళ్ల లోపు వయసున్న 138 పిల్లలను నిశితంగా గమనించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తేలాయి. వాళ్ల తండ్రులతో ఎక్కువ సమయం గడిపినప్పుడు తెలివితేటలతో పాటు టీనేజ్ వయసులో ఎదురయ్యే మానసిక సమస్యలను ఎదుర్కొనే పరిణతి కూడా మెరుగుపడుతున్నట్టు గమనించారు. ఈ ప్రభావం ఆడపిల్లల మీద ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరం.

బుద్ధిమంతుల కోసం: తెలివితేటలు, మానసిక దృఢత్వం మాత్రమే కాదు.. ప్రవర్తనాపరంగా కూడా తండ్రులకు దగ్గరగా ఉండే పిల్లల్లో పరిణతి కనిపించింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దాదాపు 200 కుటుంబాలను నిశితంగా గమనించిన తర్వాత తేల్చిన విషయమిది. తొలి రోజుల్లో తండ్రులకు దగ్గరగా ఉన్న పిల్లలు ఎదుగుతున్న కొద్దీ, వారిలో ప్రవర్తనాపరమైన సమస్యలు చాలా తక్కువగా కనిపించాయట.
చదువులో మేటి: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో పిల్లలకు చదువు కూడా సమస్యగానే ఉంటుంది. న్యూనతా భావం, ట్యూషన్లకు వెళ్లే స్తోమత లేకపోవడం, ఆర్థిక సమస్యల వల్ల ఏకాగ్రత లోపించడం లాంటి కారణాలు కనిపిస్తాయి. ఆశ్చర్యకరంగా ఇంట్లో తండ్రుల ప్రోత్సాహం ఉంటే కనుక చదువులో రాణించగలుగుతున్నట్టు తేలింది. టెక్సాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ పరిశోధనలో తండ్రుల ప్రేమతో ఆత్మవిశ్వాసం మెరుగుపడుతున్నదనీ, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతోతున్నదనీ… ఫలితంగా అలాంటి తండ్రులు ఉన్న ఆడపిల్లలు లెక్కల్లోనూ, మగపిల్లలు భాషలోనూ మెరుగైన మార్కులు తెచ్చుకుంటున్నారని బయటపడింది.
నియంత్రణలోనూ నెం.1: తల్లీతండ్రీ ఇద్దరూ కూడా చంటిపిల్లలతో ఆడతారు. అయితే వారు ఆడే విధానం వేరేగా ఉంటుంది. తల్లి మాటలతో ఎక్కువగా ఆడిస్తే, తండ్రి భౌతికంగా చొరవ చూపిస్తాడు. గాల్లోకి ఎగరేయడం, చక్కిలిగింతలు పెట్టడం, పరిగెత్తించడం లాంటివి చేస్తాడు. విచిత్రంగా ఇలాంటి ఆటలు పిల్లల ఉద్వేగ నియంత్రణకు సాయపడతాయట. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 1977-2017 మధ్య జరిగిన ఓ 78 పరిశోధనల ఆధారంగా తేల్చిన విషయమిది.
ఇలాంటి ఎన్నో పరిశోధనలు పిల్లలతో తండ్రులు దగ్గరగా గడిపినప్పుడు కలిగే లాభాల జాబితాను వల్లె వేస్తున్నాయి. కేవలం పిల్లలుగా ఉన్నప్పుడే కాదు, వారు పెద్దవారయినప్పుడు కూడా తండ్రి త్యాగం పట్ల కృతజ్ఞతతో ఉంటారు. ఇది మగపిల్లల పని, ఇది ఆడపిల్లల పని అన్న భేషజాలు లేకుండా పెరుగుతారు.

ఇంట్లో ఓ హౌజ్ హజ్బెండ్ ఉంటే.. తను పిల్లలతో అనుబంధాన్ని పెంచుకుంటే ఎన్ని లాభాలో తెలుస్తూనే ఉంది. మరి ఆ తండ్రుల సంగతేంటి. పిల్లలకు దగ్గరగా ఉన్నప్పుడు తండ్రికి జరిగే మేలు కూడా సామాన్యమేం కాదు. మానసికంగా ఎలాగూ వాళ్ల తృప్తిని లెక్కకట్టలేం. శారీరకంగానూ ఓ తండ్రికి ఎన్నో లాభాలు ఉంటాయని సాక్షాత్తు సైన్సే చెబుతున్నది.
అంతేకాదు, తోటివారితో పోలిస్తే పిల్లల్ని కన్నవారి ఆయుష్షు కాస్త పెరుగుతుందనీ, గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుందనీ, తన జీవితానికి కూడా అర్థం ఉందనే సంతృప్తి కలుగుతుందనీ… ఇలా చాలా పరిశోధనలే వెలువడ్డాయి. ఈ ఫలితాలు పిల్లలున్న తండ్రులందరికీ ఒకేలా వర్తించవు. వారికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఫలితం. దానర్థం హౌజ్ హజ్బెండ్లకే ఎక్కువ లాభం అన్నమాట! చివరిగా ఓ కథ చెప్పుకొని ముగిద్దాం. అనగనగా ఓ కుర్రాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ, తను పీలగా, చిన్నగా ఉండటం వల్ల ఎవరూ అతణ్ని ఆడించుకునేవారు కాదు. ఆ పిల్లాడి తండ్రి అతని తపనని గ్రహించాడు. రోజూ అతన్ని వెంటబెట్టుకుని మైదానానికి వెళ్లేవాడు. అక్కడ ఎవరూ తోడు లేకపోయినా తనే బంతులు విసిరేవాడు. వాళ్ల నిబద్ధతను చూసిన మిగతా ఆటగాళ్లు క్రమంగా ఆ కుర్రవాడిని తమ జట్టులో చేర్చుకున్నారు.

ఊహించినట్టుగానే కుర్రాడు చాలాబాగా ఆడేవాడు. తన ఆట చూసేందుకు తండ్రి కూడా వెంట వచ్చేవాడు. ఓ రోజు చాలా ముఖ్యమైన పోటీకి అతను సిద్ధమయ్యాడు. అద్భుతంగా ఆడి గెలిచాడు. కానీ, ఆ రోజు తన వెంట తండ్రి లేకపోవడాన్ని కెప్టెన్ గమనించాడు. అందుకు కారణం అడిగితే ‘నిన్నే మా నాన్న చనిపోయారు’ అని ఏడుస్తూ చెప్పాడు ఆ కుర్రాడు. ఆ జవాబు విన్నవాళ్లందరికీ ఒళ్లు మండిపోయింది. ‘నీకు మీ నాన్నకంటే క్రికెట్ ఎక్కువయ్యిందా!’ అంటూ విరుచుకుపడ్డారు. అది విన్న ఆ కుర్రాడు బాధగా ‘నేను గొప్ప క్రికెటర్ కావాలనే మా నాన్న తపించాడు. నా జట్టును గెలిపించే రోజు చూడాలనుకున్నాడు. ఆయన చనిపోయినా తన ఆశను గెలిపించాలనుకున్నాను. రోజూ నా ఆటను చూడ్డానికి వచ్చినట్టే ఇవాళ కూడా తన ప్రాణం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది! అలాంటి ఆశయాన్ని ఎలా నిరుత్సాహపరచను’ అని భోరుమన్నాడు.
ఇంటిని చక్కబెట్టుకునే బాధ్యతలు భార్యాభర్తలలో ఎవరైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పటికాలానికి ఆ చొరవ మరింత అవసరంగా కనిపిస్తున్నది.
1 ఉద్యోగం కష్టమైనప్పుడు లేదా భార్యకు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు తన బదులుగా ఇంటిపనిని చక్కబెట్టుకోవడం.
2 పిల్లల్ని గమనించుకోవడం అన్నది ఖర్చుతో కూడుకున్న పనిగా మారుతున్నది. చిన్న కుటుంబాలు, పోటీ ప్రపంచం వల్ల వారిని తీర్చిదిద్దడంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇంట్లో ఉండే తండ్రిగా ఈ సవాళ్లను అధిగమించవచ్చు.
3 చాలా సంస్థలు ఇస్తున్న వర్క్ ఫ్రం హోం సౌలభ్యం కూడా మెరుగైన బాధ్యతలకు సాయపడుతున్నది.
4 ఇంట్లో ఎవరు ఏ పని చేయాలంటూ గత తరాలను వెంటాడిన పరిమితులు ఇప్పుడు లేవు.
5 వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌లో భాగంగా చాలామంది మగవారు మరీ ముఖ్యంగా కార్పొరేట్ చట్రంలో విసిగిపోయినవారు, కొంతకాలం పాటైనా హౌజ్ హజ్బెండ్‌గా భార్యాపిల్లలతో గడపాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు.

అది 1907 డిసెంబర్ 6, అమెరికాలోని మొనొన్గ అనే చిన్న పట్టణం. ఆ ఊరి ప్రత్యేకత బొగ్గుగనులు. కష్టంగాను, తక్కువ జీతంతోను ఉండే ఆ గని పనుల్లో ఇటలీ, పోలాండ్, ఆస్ట్రియా, హంగెరీ, గ్రీక్ వంటి దేశాల నుంచి పొట్టచేతపట్టుకుని వచ్చిన శరణార్థులే ఉండేవారు. ఆ రోజు వారి పాలిట సజీవ నరకంగా మారింది. గని లోపల ఉన్న మీథేన్ వాయువుకు నిప్పంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దాంతో గనిలో రెండు ముఖ్యభాగాలు కుప్పకూలిపోయాయి. కాసేపటికి అక్కడికి సహాయక బృందాలు చేరుకున్నా, ఈ శిథిలాల్లోకి విషవాయువుల మధ్య లోపలికి వెళ్లలేని పరిస్థితి. ఈ ప్రమాదంలో 362 మంది చనిపోయారు. చాలామంది కార్మికులు తమ బంధువులను, పిల్లలను గనులలో సహాయకంగా తీసుకువెళ్తారు కాబట్టి.. అనధికారికంగా మృతుల సంఖ్య మరింతగా ఉండవచ్చని అనుమానం.
ఈనాటికీ అమెరికా మైనింగ్ చరిత్రలో ఈ సంఘటనను అత్యంత దారుణమైన ప్రమాదంగా భావిస్తుంటారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారంతా మగవారే కావడంతో.. వారి మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మృత్యు కూపాలని తెలిసినా కూడా తమ కుటుంబాల కోసం గనులలో మగ్గిపోయినవారిని తల్చుకుని పిల్లల గుండెలు బద్దలయ్యాయి. వాళ్లలో ఒకరే ‘గ్రేస్ క్లేటన్’. మొనొన్గ ప్రమాదంలో తన తండ్రి కూడా చనిపోయారు. ఆ ప్రమాదంలో చనిపోయినవారి త్యాగానికి గుర్తింపుగా క్లేటన్ 1908లో ‘ఫాదర్స్ డే’ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. అది మొదటి ఫాదర్స్ డే అయ్యిందేమో కానీ, అంతగా ప్రచారంలోకి రాలేదు. మరుసటి ఏడాది ‘సొనారా’ అనే యువతి కూడా తన తండ్రి జ్ఞాపకంగా నాన్నలందరికీ ఓ రోజు ఉండాలనే ఉద్యమం మొదలుపెట్టింది. మాజీ సైనికుడు అయిన తన తండ్రి ఆరుగురు పిల్లలను ఒంటిచేత్తో పెంచిపోషించిన తీరే సొనారాకు స్ఫూర్తి. అయితే తన కృషి కూడా అంతగా ప్రచారంలోకి రాలేదు.
1920ల దశకంలో హ్యారీ మీక్ అనే లయన్స్ క్లబ్ సభ్యుడు ‘ఫాదర్స్ డే’ గురించి విస్తృతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఇలాంటి ఓ రోజు ఉంటే వ్యాపారానికి ఉపయోగంగా భావించిన కంపెనీలు దాన్ని తలకెత్తుకున్నాయి. పూల షాపుల నుంచి దుస్తుల దుకాణాల వరకూ ఫాదర్స్ డే పేరుతో ప్రకటనలు ఊదరగొట్టేశాయి. కానీ అది ఏ రోజు అనేదాని మీద గందరగోళం ఉండేది. చిట్టచివరికి 1972లో అప్పటి అమెరికన్ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ జూన్ నెల మూడో ఆదివారాన్ని ఫాదర్స డేగా ప్రకటించడంతో కథ సుఖాంతం అయ్యింది.

ఓ లక్ష్యం లేకుండా సాగితే ఏ పని అయినా బోర్ కొట్టేస్తుంది. రోజువారీ షెడ్యూల్ తయారుచేసుకుంటే దాన్ని అధిగమించేయవచ్చు. ఇంటి పనులు, స్కూల్లో దింపడం, లంచ్, వ్యాయామాలు, వాహ్యాళి.. అన్నీ ఓ దినచర్య ప్రకారం సాగితే ఆసక్తిగా ఉంటుంది.
పిల్లల అల్లరి, ఇంటి పనుల చిరాకు, ఒకవేళ వర్క్ ఫ్రం హోం చేస్తుంటే ఆ సవాళ్లు, భాగస్వామి ఆలస్యంగా రావడం, ఆర్థిక సమస్యలు.. లాంటి సవాలక్ష విషయాలు కోపం తెప్పించేస్తాయి. మాటామాటా పెరిగేలా చేస్తాయి. వాదన బదులుగా మనసులో ఉన్న చిరాకును నేరుగా భాగస్వామితోనో మిత్రులతోనో చెప్పుకోగలిగితే భారం తీరిపోతుంది. పరిష్కారమూ దక్కుతుంది.
సామాజిక బంధాలు సానుకూలంగా ఉంటే ఒంటరితనం, కుంగుబాటు, న్యూనత లాంటి సమస్యలు రానేరావు. ఆన్లైన్ కమ్యూనిటీలు, యోగా క్లాసులు, పార్క్, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా తనలాంటి మరింతమందిని కలుసుకునే అవకాశాలే!
ఇంటి బాధ్యతల మధ్య… అదీ వేరే ఉపాధి ఏం లేకపోతే కనుక ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు. ఇలాంటప్పుడు ఏదో ఓ కొత్త స్కిల్, కోర్స్ నేర్చుకోవడం ఉపయోగపడుతుంది. అది ఎంతోకొంత ఆదాయానికీ సాయపడుతుంది.
ప్రతి తండ్రీ కోరుకునేది ఇదే. కృతజ్ఞతలు, కావ్య వర్ణనలు, కవితల కన్నా మన సామర్థ్యానికి తగిన విజయం సాధించాలనే, నలుగురిలో తన పేరు నిలబెట్టే వ్యక్తిత్వం అలవర్చుకోవాలనే, తన త్యాగానికి తగిన ఫలితం దక్కాలనే, ఓ పరిపూర్ణమైన మనిషిగా తన వారసత్వాన్ని కొనసాగించాలనే. ఏ ఫాదర్స్ డే నాడైనా తనకి ఇవ్వగలిగే గొప్ప బహుమతి అదే!