Embroidery Hoop Art Work Gift | ఏడు అడుగులు పడిన రోజు, మూడు ముళ్లూ పెనవేసుకున్న రోజు, బంధాన్ని తెలిపే ఉంగరాలు ఒక చేతి నుంచి మరో చేతికి సుతారంగా జారిన రోజు… ఏ జంటకైనా ఎంతో ప్రత్యేకం. మరపురాని బంధాన్ని మరింత మధురం చేసుకోవాలంటే ఈ పండుగకు తగిన కానుక ఉండాల్సిందే. అదీ ప్రేమ కుసుమంలా నిత్యనూతనంగా కనిపించాల్సిందే. అలాంటిదే.. ఎంబ్రాయిడరీ హూప్ ఆర్ట్ వర్క్ గిఫ్ట్. ఎంబ్రాయిడరీ చేసిన అమ్మాయీ, అబ్బాయీబొమ్మలతోపాటు పెళ్లిరోజును గుర్తుచేస్తూ, ప్రేమసందేశాన్ని తెలుపుతూ వస్తున్నాయివి.
పుట్టినరోజంటే ఒకరికే ప్రత్యేకం. పండుగంటే ఇంటిల్లిపాదికీ సంతోషం. కానీ భార్యాభర్తలకు మాత్రమే సొంతమైనది పెళ్లిరోజు ఒక్కటే. అందుకే ఏ జంటకైనా ఆ దినం ప్రత్యేకం. దీనికి గుర్తుగా ఎవరికి ఎవరు కానుక ఇచ్చుకున్నా, దాన్ని చూసి ఇద్దరూ సంతోషపడేలా సరికొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి ఈ ఎంబ్రాయిడరీ హూప్ బహుమతులు. ఒక హూప్మీద పెళ్లయిన నెలకు సంబంధించిన క్యాలెండర్ ఉంటుంది. అలాగే ఆలూమగల బొమ్మలూ, పేర్లూ ఉంటాయి. వీటితోపాటు చుట్టూ అందమైన డిజైన్లు ఉంటాయి. కావాలంటే కొన్ని కొటేషన్లూ రాయించుకోవచ్చు. వీటిలో క్యాలెండర్‌లోని అక్షరాలు సహా బొమ్మలకు సంబంధించిన ఆకృతులూ, దుస్తులూ అన్నీ ఎంబ్రాయిడరీ చేసినవే. దీనికోసం విభిన్న రంగుల మెరిసే దారాలను వాడతారు. కొన్నిసార్లు ఊలు కూడా ఉపయోగిస్తారు. ఇక బొమ్మలు ఎలా ఉండాలి, దానిమీద ఏం రాసి ఉండాలన్నది పూర్తిగా మన ఇష్టం.
ఈ ఎంబ్రాయిడరీ ఆర్ట్ వర్క్ హూప్లను ఆన్లైన్లో వివిధ సంస్థలు పూర్తి కస్టమైజ్డ్గా అందిస్తున్నాయి. వీళ్లకు పెళ్లిరోజుకు సంబంధించిన తారీఖు, నెల, సంవత్సరం పంపించాలి. అప్పుడు బహుమతిలో ఆ తేదీని ప్రత్యేకంగా కనిపించేలా తీర్చిదిద్దుతారు. ఇవికాక ఇందులో ఉండే బొమ్మలు ఎలా ఉండాలన్నది మనం ఎంచుకోవచ్చు. అంటే అమ్మాయి బొమ్మకు గౌను, లంగావోణీ, చీర… ఇలా ఏం ఉండాలో చెప్పొచ్చు. బహుమతిలో మిగతా భాగమంతా ఎంబ్రాయిడరీ చేసినా, అమ్మాయి దుస్తులు మాత్రం ప్రత్యేక వస్త్రంతో హైలైట్ అయ్యేలా రూపొందిస్తారు. అంతేకాదు అమ్మాయి జుట్టు కూడా ముడివేసి పూలు పెట్టినట్టు, విరబోసినట్టు, జడ వేసినట్టు… ఇలా విభిన్న హెయిర్ స్టైల్స్‌లో తయారు చేస్తున్నారు. అబ్బాయి బొమ్మల్ని కూడా ప్యాంటు చొక్కా, పంచె, కుర్తా… ఇలా రకరకాల దుస్తులతో అలంకరిస్తున్నారు. హూప్ కూడా మీడియం నుంచి పెద్ద సైజుల దాకా ఇష్టాన్ని బట్టి ఎంచుకోవచ్చు. ఎంగేజ్మెంట్లకూ, పెళ్లికీ బహుమతులుగా ఇచ్చేందుకు బాగుంటాయివి. ఇక, మరచిపోని ఈ రోజును మళ్లీమళ్లీ గుర్తుచేసుకునేలా గోడకు తగిలించుకునేలా ఇవి ముస్తాబవుతున్నాయి. అందుకున్న వారు, దీన్ని చూసిన ప్రతిసారీ ‘భలే మంచి రోజు’ అని పాడుకోవడమే తరువాయి.
“Selfie Cake | అచ్చం మనిషిలాగే ఉన్న ఈ కేకులను చూశారా.. ఇప్పుడివే ట్రెండింగ్ !!”