ఊరికి వెళ్లేందుకు టికెట్ బుకింగ్ ..హోటల్ రిజర్వ్.. క్యాబ్ బుకింగ్.. సాధారణంగా వీటన్నింటికీ కనీసం మూడు నాలుగు యాప్స్ ఓపెన్ చేసి గంటల తరబడి కుస్తీ పట్టాలి. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. మీ ఫోన్లో ఉన్న ఏఐ ఏజెంట్‌కి చెబితే చాలు అది మీ తరపున అన్ని యాప్స్‌లోకి వెళ్లి ఆ పనులన్నీ చకచకా పూర్తిచేస్తుంది. టెక్నో కంపెనీ తాజాగా తీసుకొస్తున్న ఎల్లా క్లా (Ella Claw) అనే ఏఐ సాంకేతికత ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి లాంటివి మనం అడిగితే సమాచారం ఇవ్వడం, కాల్ చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం చేస్తాయి. కానీ ఎల్లా క్లా అంతకంటే ఓ అడుగు ముందుకేసి చార్జ్ తీసుకుంటుంది. ఇది కేవలం సమాధానాలు చెప్పే ఏఐ మాత్రమే కాదు. మన పనులన్నీ చేసే ఓ సర్వెంట్ అన్నమాట.
ఒక యాప్ నుంచి డేటాను తీసుకుని మరో యాప్‌లోకి పంపడం, పేమెంట్స్ చేయడం వంటి సంక్లిష్టమైన పనులను సైతం ఇది చిటికెలో చేసేస్తుంది. వాట్సాప్‌లో వచ్చిన అడ్రస్‌కు ఉబర్ బుక్ చేయి అని చెబితే.. ఇది ఆ అడ్రస్ని కాపీ చేసి, ఉబర్ యాప్‌లోకి వెళ్లి రైడ్‌ని సెట్ చేస్తుంది. నచ్చిన వస్తువు ధర తగ్గినప్పుడు వెతికి పెట్టడమే కాకుండా మన తరఫున ఆర్డర్ కూడా చేసి పెడుతుంది. అంతేకాకుండా మెయిల్స్ చూసి క్యాలెండర్లో మీటింగ్స్ సెట్ చేయడం, రిమైండర్లు పంపడం వంటి పనులను ఆటోమెటిక్‌గా చకబెడుతుంది. వీటన్నిటి కోసం మనం ఎలాంటి ప్రోగ్రామింగ్ చేయనకర్లేదు. సాధారణ భాషలో కమాండ్ ఇస్తే చాలు, అది ప్రాసెస్‌ని అర్థం చేసుకుని పనిచేస్తుంది.
మన ఫోన్లోని అన్ని యాప్స్‌కి ఒక ఏఐ ఏజెంట్‌కు యాక్సెస్ ఇస్తున్నాం అంటే కచ్చితంగా ప్రైవసీ ఆందోళనలు ఉంటాయి. టెక్నో సంస్థ ఈ ఏఐ ఏజెంట్లో పటిష్ఠమైన సెక్యూరిటీ లేయర్స్ ఉన్నాయని చెబుతున్నది. మన అనుమతి లేకుండా ఇది ఎలాంటి కీలకమైన పనులు చేయదు. మన ఫోన్లోని ప్రతి యాక్టివిటీని ఏఐ గమనిస్తుంది కాబట్టి, యూజర్లు తమ ప్రైవసీ సెట్టింగ్స్‌పై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.