చం॥ తన జని కారణంబైన తామరకున్ హితుడౌటచే విక
ర్తనునకు వేయి ఘృష్టులిడి దానికి శత్రుడు గాన నేణ చి
హ్నునకు బదేను జేసి యవియున్ శిఖి భాను ముఖామరాళి చే
దినమొకటప్పుగైకొనను దిద్దను జేయు విధాత గొల్చెదన్
ఈ పద్యం కాకుమాను అప్పకవి రచించిన లక్షణ గ్రంధం అప్పకవీయం లోనిది. ఆంధ్రశబ్ద చింతామణికి అనుసృజనగా అప్పకవి రచించిన ఈ ఛందశాస్త్రం శాస్త్రీయ పద్ధతిలో సమగ్రంగా లక్ష్యలక్షణ వివేచన చేసి ప్రఖ్యాతిగాంచిన గొప్ప లక్షణ కావ్యం. అప్పకవి ఒకప్పటి మహబూబ్నగర్ జిల్లా చరిగొండ సీమకు చెందిన కవి. ఈ కావ్యం దాదాపుగా క్రీ.శ 1650 ప్రాంతంలో రాసినది. అప్పకవి కేవలం లాక్షణికునిగానే కాక గొప్ప పద్యవిద్యా విశారదుడని అతని పీఠికా పద్యాలు తెలియజేస్తాయి. అందులోని పద్యమే ఇది. బ్రహ్మ స్తుతి.
బ్రహ్మదేవుని స్తుతిస్తూ పనిలో పనిగా అస్మదీయులకు పెద్దపీట వేయడం అనే లోకరీతి కూడా ఈ పద్యంలో కనబడుతుంది. బ్రహ్మ తను తామరపువ్వులో జన్మించడంతో దానికి హితుడైన సూర్యుడికి వేయి కిరణాలు ఇచ్చి తామరకు శత్రువైన (చంద్రుని చూడగానే తామరలు ముకుళిస్తాయి) చంద్రునికి పదిహేను మాత్రమే ఇచ్చాడు. అవి చంద్ర కళలుగా ప్రసిద్ధి. (నిజానికి అవి షోడశ కళలు. ఇక్కడ పదిహేను రోజుల పక్షంగా భావించాలి). అవికూడా అగ్ని వంటి సూర్య ముఖంగా వెలిగే కాంతిని దేవతల నుంచి రోజుకొక కళ అప్పు తీసుకునే విధంగా శిక్షించాడు బ్రహ్మ. ఇవి కూడా స్వయంప్రకాశకుడైన సూర్యుని నుంచే తీసుకుంటున్నాడు. ఆ బ్రహ్మను నేను ప్రార్థిస్తున్నాను అంటున్నారు అప్పకవి. తామరలో తాను పుట్టడం వల్ల తామరలను వికసింపజేసే సూర్యుడు అస్మదీయుడు కాబట్టి అతనికి మేలు చేయడం ద్వారా సమాజ లౌకిక రీతిని, చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదనే ఖగోళ విజ్ఞానాన్ని, అలాగే పౌరాణిక కథనాన్ని ఒకేసారి మూడు అంశాలను సంధానించి పద్య నిర్మాణం గావించారు అప్పకవి.