వక్రబుద్ధిని, జిత్తులమారితనాన్ని ప్రదర్శించేవారి గురించి జానపదులు ఒక్క మాటలో చెప్పిన సామెత ఇది. అలాంటి ఓ నలుగురి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు.. ‘గిల్లి జోలపాడే రకాలు’ అంటారు. ఈ తరహా వ్యక్తులు అన్ని కాలాల్లోనూ తారసపడుతుంటారు. ఎక్కడ మంట పెట్టాలో.. ఆ పరిణామాలను ఎలా అనుకూలంగా మార్చుకోవాలో వారికి తెలుసు. కావాలనే కలహం రేపి, తామే చల్లారుస్తున్నట్లు నటిస్తారు. వారి గురించి తెలిసి… ‘రేయ్.. పిర్రగిల్లి జోలపాడొద్దు. నీ గురించి అంతా తెలుసు’ అంటూ నలుగురిలో వారి స్వభావాన్ని బట్టబయలు చేస్తుంటారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వినిపించే పలుకుబడి ‘డొక్కశుద్ధి’. ‘వానికి డొక్కశుద్ధి లేకపోయినా ఇకమతు ఉంది. ఎక్కడైనా బతుకుతడు’ అంటుంటారు. డొక్కశుద్ధి అనే పదబంధం వినగానే కొందరు ‘కడుపులో బొక్కల శుద్ధి’ అని పొరబడుతుంటారు. అది తప్పు. డొక్కశుద్ధి అంటే చదువు/ఏదైనా విషయంలో పాండిత్యం కలిగి ఉండటం. గ్రామీణుల మాటలో చెప్పాలంటే ‘బాగా చదువుకున్నోడు’ అని అర్థం. తెలంగాణ ఉద్యమ సమయంలో మన కవులు.. డొక్కశుద్ధి పదబంధాన్ని ఎన్నో కవితలు, వ్యాసాల్లో ప్రస్తావించారు. ‘మాకేమీ డొక్కశుద్ధి లేదన్నట్లు.. అంతా మీరే నేర్పినట్లు..’ అంటూ మన మట్టిమాటల పరిమళాన్ని ఉపయోగిస్తూ ఆంధ్రులను ఎండగట్టారు.
జీవితంలో ఓ లక్ష్యమంటూ లేకుండా.. ఉన్నచోటనే ఉంటూ పనికిమాలిన పనులు చేసేవారిని ఉద్దేశించిన సామెత ఇది. వీరికి ఏం చెయ్యాలో? ఏ పని ఎలా మొదలు పెట్టాలో తెలియదు. ఆ పూట గడిచేందుకు.. నిరుపయోగమైన పనులన్నీ చేస్తుంటారు. పైగా తాముచేసే పని తప్పో ఒప్పో కూడా తెలుసుకోరు. తెలిసినవాళ్లను కూడా అడగరు. కాబట్టే, ‘పొద్దుపోనమ్మ బొమ్మలకు కాటుక దిద్దిందట’ అంటూ పెద్దలు హెచ్చరిస్తుంటారు. ఇంట్లో ఆడవారికి కాటుక దిద్దితే ఏదైనా ఉపయోగం ఉంటుంది? కనీస జ్ఞానం లేకుండా బొమ్మకు కాటుక దిద్దితే ఏం ఉపయోగం? పైగా ఆ చర్యవల్ల బొమ్మ అందాన్ని కోల్పోయి, వికారంగా కనిపిస్తుంది. ఇలాంటి అర్థాన్నే ఇచ్చే సామెతలు.. ‘పనిలేని మంగలి పిలిచి తలగొరిగినట్లు’, ‘పొద్దుపోనమ్మ పందిరిగుంజకు పని చెప్పినట్లు’.
మిడుసులు = మెడ వెనుకభాగం (ఏయ్! ఎవడ్రా నువ్ ఎక్వతక్వ మాట్లాడుతున్నవ్.. మిడుసులు ఇరుగుతయ్..!)
కాకోటి = రొట్టెలు చేసేటందుకు ఉపయోగించే పీట (కాకోటి అందుకో బిడ్డా.. జొన్నరొట్టెలు జెయ్యాలె)
బోకరిచ్చుడు = అబద్ధాన్ని నమ్మించడం (రాజుగాడితో సోపతి జేస్తున్నవ్.. వాడికి బోకరిచ్చుడు (బూకరించుడు) ఎక్కువ. తేడావస్తే నువ్వూ తన్నులు తింటవ్)
తలాయించుడు = వేపుడు చేయడం (యాటకూరలో మెత్తటి ముక్కల్ని తీసి.. ఉప్పు, కారం దట్టించి కొద్దిగా తలాయించు)
పెద్దంత్రం చిన్నంత్రం = పెద్దోళ్లు, చిన్నోళ్లు మధ్య (తేడా) అంతరం. (ఏమ్రా.. పెద్దంత్రం, చిన్నంత్రం లేకుండా మదమెక్కి ఒర్లుతున్నవ్.. కండ్లు నెత్తికెక్కినయా)
-డప్పు రవి