యూట్యూబ్.. ఒక విశ్వ గవాక్షం! మనం ప్రపంచాన్ని చూస్తాం. ప్రపంచమూ మనల్ని చూస్తుంది, మన ప్రతిభను గుర్తిస్తుంది, మన నైపుణ్యాన్ని గౌరవిస్తుంది, మన ఐడియాలను మెచ్చుకుంటుంది, కొన్నిసార్లు తిట్టుకుంటుంది కూడా. ‘యూట్యూబ్‌లో తెలుగు తేజాలు’ రచయిత కళాసాగర్ యల్లపు ఆ సాంకేతిక వేదిక మీద అద్భుతాలు చేస్తున్న తెలుగు బిడ్డలను తన పుస్తకంలో పరిచయం చేశారు. ‘యూట్యూబ్ అనేది ప్రధానంగా ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది. మొదటిది వీక్షకులు, రెండవది సృష్టికర్తలు, మూడోది అడ్వైర్టెజర్స్..’ అంటూ మూలాలను ముందుమాటలోనే పరిచయం చేశారు రచయిత. వంటలు, ఆరోగ్యం, వ్యవసాయం, మిద్దెతోటలు, ఆధ్యాత్మికం, సంగీతం.. ఇలా అనేక విభాగాల్లో తమదైన ముద్ర వేసుకున్న యూట్యూబ్ స్టార్స్‌తో పాఠకుడు అక్షర కరచాలనం చేసే అవకాశం కల్పించారు కళాసాగర్. కొత్త చానల్ ఎలా ప్రారంభించాలి, అసలు యూట్యూబర్స్కు డబ్బు ఎలా వస్తుంది?.. అనే కోణంలోంచి కూడా చర్చించారు. ఇటువైపు వెళ్లాలనుకునేవారికి, ఇందులో ఏముందో తెలుసుకోవాలనుకునేవారికి.. ఉపయోగపడుతుంది ఈ పుస్తకం.
యూట్యూబ్‌లో తెలుగు తేజాలు
రచన: కళాసాగర్ యల్లపు
పేజీలు: 96
వెల: రూ. 145
ప్రతులకు: ఫోన్: 98852 89995