సోయగాల వెదురు
ఇన్నాళ్లూ కుర్చీలుగా, మంచాలుగా నట్టింట్లో సెటిలైన వెదురు ఉత్పత్తులు.. ఇప్పుడు కొత్త సోయగాలు పోతున్నాయి. కాస్తంత సృజనాత్మకత జోడిస్తే నమ్మలేని ఆకృతులు దాల్చి మనసులను కొల్లగొడుతున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త రూపాలను సంతరించుకొని కొంగొత్త లక్ష్యాలను చేరుకుంటున్నాయి. హస్తకళాకృతులుగా, దుస్తులుగా, ఆభరణాలుగా ఫ్యాషన్‌కు కొత్త నిర్వచనం చెబుతున్న వెదురు సోయగాల సంగతులు చదివేయండి.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో వెదురు వస్తువుల వ్యాపారం ఏడాదికి 700 కోట్ల డాలర్ల పైమాటే! అత్యంత డిమాండ్ ఉన్న హస్తకళాకృతుల్లో వెదురుకు ఎదురే లేకుండా పోయింది. మనదేశంలోనూ వెదురుకు డిమాండ్ పెరుగుతున్నది. ఈశాన్య రాష్ర్టాల్లో వేలాది మంది మహిళలు వెదురు వస్తువుల తయారీని ఉపాధిగా ఎంచుకున్నారు. ముంబయికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రమోదిని దాస్ 2015 నుంచి తన స్టార్టప్ ద్వారా పర్యావరణహితమైన వస్త్రంతో దుస్తులను తయారు చేస్తున్నది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి వెదురుతో వస్ర్తాలను నేయించి, వాటితో నయా దుస్తులకు రూపకల్పన చేస్తున్నది. వెదురు సిల్క్‌తో చీరలు కూడా నేయించి అతివల మనసులు దోచుకుంటున్నది.
ప్రకృతి సిద్ధంగా తయారైన వెదురు దుస్తులకు ఆదరణ కూడా బాగానే ఉన్నది. ముఖ్యంగా యువత వీటిని ఇష్టంగా కొనుగోలు చేస్తుండటం విశేషం.వెదురుతో ఆభరణాలు కూడా తయారు చేస్తున్నారు. వెదురుతో రూపుదిద్దుకున్న గాజులు, బ్రేస్లెట్లు, నెక్లెస్‌లు, చెవి కమ్మలు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో అందరినీ ఆకర్షిస్తున్నాయి. హ్యాండ్‌బ్యాగ్‌లు, గడియారాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. వారాంతపు సంతలు మొదలుకొని ఆన్లైన్ అంగడి వరకు వెదురు వస్తువులు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. దేశీయ వెదురు ఉత్పత్తులు విదేశాలకూ ఎగుమతి అవుతుండటం విశేషం. కేవలం వెదురు వస్తువుల తయారీని వ్యాపారంగా ఎంచుకొని స్టార్టప్‌లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఫ్యాషన్ పరేడ్లలో కూడా వెదురు దుస్తులు తళుకులీనుతున్నాయి. భవిష్యత్తులో వెదురుకు ఎదురే లేదు!