అచ్చ తెలుగుపదాల నిక్కమైన గీతం
సినారె మాటలోనూ, పాటలోనూ లయ, ప్రాస జీవాత్మగా వెల్లివిరుస్తాయి. తెలుగు ప్రాసకు, తన ఊరి మట్టియాసకు, తెలంగాణ జీవభాషకు... తెలుగు పలుకుబడుల జీవనాడియైన భాషకు సినారె నిక్కమైన చిరునామా. ఆ కోవలోనే పల్లె భాషను, పలుకుబడుల భాషను అనేక సినీగీతాల్లో నిక్షిప్తం చేశారు. అలాంటి అందమైన గీతమే ఇది!
ప్రఖ్యాత దర్శకుడు కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన అనేక చిత్రాలకు సినారె సాహిత్యాన్ని అందించారు. 1982లో వచ్చిన చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. నాయికా నాయకులు చిరంజీవి, మాధవి. కథ దృష్ట్యా చిత్రంలో నాయిక మాధవికి కొంచెం కోపం ఎక్కువ. దానిని దృష్టిలో పెట్టుకుని యుగళగీతం రాయమని కవి సినారెను కోరారు దర్శకుడు. అందుకు తగ్గట్టుగా ఒక చక్కని గీతం రూపుదిద్దుకుంది. ఆ గీతమే…
వచ్చే వచ్చే వానజల్లు
జాల్మది యేలో
గుచ్చూకుంది రేగుముల్లు
జాల్మది యేలో!
ఈ చిత్రగీతపు పల్లవిని గురించి చెబుతూ ‘పాటలో ఏముంది, నా మాటలో ఏముంది’లో సినారె “… సంగీత దర్శకుడు జె.వి.రాఘవులు, నేను కలిసి కూర్చుని పల్లెపాటల్లోంచి ఒక పల్లవిని ఎంపిక చేశాం” అంటారు. అందమైన ప్రాసలతో కూడిన పల్లె పాట పల్లవి నుంచి దీనిని స్వీకరించారట సినారె. అందులోనూ అంత్యప్రాసలతో కూడిన జానపదుల శైలి ఇంకెంత అందంగా ఉంటుందో ఈ గీతాన్ని చూస్తే తెలుస్తుంది. వాన జల్లు, రేగు ముల్లు చక్కని అంత్య ప్రాసలిందులో. సినారె ఇందులో ప్రయెగించిన పదాల గురించి వాటి, అర్థాలు, ఆవిర్భావాల గురించి చెబుతారు కూడా! ఇందులోని ‘జాల్మదియేలో’ అంటే ఆలస్యం ఎందుకు అని అర్థం. “జాలమేలరా’ అన్న ప్రయోగం జావళీల్లో తరచూ కనిపిస్తుంది. ‘జాలమది’ అనేదే ‘జాల్మది’గా మారింది” అంటారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ గీతం నాయిక మాధవిపైన చిత్రించినది కాదు. ఉప నాయిక పూర్ణిమ పైన చిత్రించినది. కథ దృష్ట్యా ఈమె మనస్తత్వం గొప్పది, మాట ప్రవాహంలా ఉంటుంది. గలగలా పారే సెలయేరులా కనిపిస్తుంది. అందుకే ఔచిత్యవంతంగా కవి గీతాన్ని కూడా అలాగే రాశారు. తర్వాతి గీతాన్ని చూద్దాం…
అతను: వచ్చే వచ్చే వయసు బొమ్మ
ఆమె: జాల్మది యేలో
అతను: విచ్చే విచ్చే మనసురెమ్మ
ఆమె: జాల్మది యేలో!
కవి ప్రకారం ఇందులోని ఈ వయసు బొమ్మ ఉపనాయిక పూర్ణిమే! అయితే ఇవి నాయకుడు చిరంజీవి మాటలు కదా! బహుశా ఇవి నాయికను గురించి పలికినవే మరి. దానికి అనునయంగా వెంటనే మళ్లీ అనుపల్లవిలో..
అతను: రెమ్మమాటున చిలకమ్మ
ఆమె: జాల్మది యేలో!
అతను: కమ్మా కమ్మగ పలుకమ్మ
ఆమె: జాల్మది యేలో!
అంటూ పలుకుతాడు. ఇది తనను ఉద్దేశించి పలుకుతున్న మాటలని నాయిక మాధవికి తెలియదు. రెమ్మలాంటి తన మనసు రెమ్మ చాటునున్న చిలకమ్మ ఎవరట మరి! ఆమె తాను వలచిన నాయికే… అందుకే ఇంత ప్రేమగా, అనురాగంతో ఈ మాటలు అంటున్నాడు నాయకుడు.
చరణం
అతను: చక్కానమ్మ తానే పక్కాకు రాగానే
మొక్కాజొన్న చేను ఏంచేసే
ఆమె: నిక్కాపొడుచుకుని తేరిచూసె
గున్నాగున్నమ్మ వచ్చి నున్నాపున్నమ్మమెచ్చి
చక్కనిచుక్క మొక్కజొన్న చేను పక్కకు వస్తే ‘ఏం చేశాయ’ని నాయకుని ప్రశ్న. నిక్క పొడుచుకుని తేరి చూసిందని, ఆదీ గున్నాగున్నమ్మ నున్నాపున్నమ్మ మెచ్చే విధంగానట. ఇందులోని ఆ గున్నమ్మ లేదా పున్నమ్మ పుత్తడిబొమ్మ అయిన తన ప్రియమైన నెచ్చెలి నాయికనే.
అతను: ఉన్నాదున్నట్లు నమిలేసే
కంటిరెప్ప చిటికేసె
ఆమె: కాకిపిల్ల గుటకేసె
అతను: కంటిరెప్ప చిటికేసె… కాకిపిల్ల గుటకేసె!
శృంగారాన్ని, అంగారాన్ని ఎంతో అందంగా చెప్పే సినారె ఈ గీతంలో నాయికా నాయకులకు ఒకరిపైన ఒకరికున్న దృష్టిని, ప్రేమను అందంగా, సరళమైన పదాలతో అందంగా చెబుతారు. ‘ఉన్నదున్నట్లు నమిలేసె’ అని, ‘కంటి రెప్పా చిటికేసె’ చెప్పడంలోని శృంగారాన్ని అర్థం చేసుకునే ప్రాయం కాదు ఉప నాయకది. అది తెలిసినా నాయిక స్పందించదు. వెంటనే నాయకుడు ‘కన్నేమొ కల్వపిల్ల… చూపేమొ చేపపిల్ల/ చిన్నారి నడకే హంసపిల్ల!’ అంటే, నాయిక ‘కోణంగి మనసే కోతిపిల్ల’ అని. కవి భావనలో ఇందులోని ‘కలువ పిల్ల’, ‘చేపపిల్ల’, ‘హంసపిల్ల’లు నాయిక లావణ్యానికి సంకేతంగా ప్రయోగించారు.
‘చెట్టూ చాటెందుకింక
సిగ్గుమాటెందుకింక
చెట్టా పట్టాలు వేసుకోరాదా!
చెంగూన కట్టేసుకోరాదా
జోడు కుదిరెను ఇద్దరికి!
జోడు కుదిరెను ఇద్దరికి!
తాళమున్నది మద్దెలకి!
తాళమున్నది మద్దెలకి!’
నాయకుడు తమ మధ్య చెట్టు చాటెందుకంటే, తనను చెంగున కట్టేసుకొమ్మని నాయిక అంటుంది. అంటే ఏలుకొమ్మని, వివాహం చేసుకొమ్మని. అచ్చతెలుగు మాటలు, తేట తెలుగు ఊటల పదాలు ఈ గీతానికి అందాన్నివ్వడమేకాక, చక్కని లయను అందించాయి.
– పత్తిపాక మోహన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- authentic
- pure
- song
- Telugu words
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

