ఇంటింటి వెత.. ప్రతి రైతుకీ గుండెకోత.. ఎల్‌నినో నుంచి బయటపడేది ఎలానో?!
నైరుతి రుతుపవనాల ఆధారంగా ఏర్పడే వర్షాలు, ఆ వర్షాలను ఒడిసిపట్టుకునే కాలువల మీదే దక్షిణ భారతదేశపు వ్యవసాయం ఆధారపడి ఉంది. కాబట్టి రుతుపవనాలు విఫలం అయితే, మన ఆర్థిక వ్యవస్థ ప్రాణం విలవిల్లాడినట్టే. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఎల్‌నినో కేవలం వ్యవసాయం మీద మాత్రమే ప్రభావం చూపించదు. పెరుగుతున్న వేడి, తగ్గిన వర్షపాతం మన జీవితంలోని మిగతా పార్శ్వాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది.
కవర్ స్టోరీ
ఓ పదేండ్ల క్రితం ఎల్‌నినో అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేని పదం. మహా అయితే అది ఓ జీకే బిట్, కాదంటే జాగ్రఫీ సబ్జెక్టు. కానీ ఇప్పుడు, అది ఇంటింటి వెత. ప్రతి రైతుకీ గుండెకోత. ఏటా దక్షిణ అమెరికా దగ్గర ఉన్న వేడిగాలులు ఆస్ట్రేలియా వైపుగా, తిరిగి చల్లటి గాలులు దక్షిణ అమెరికా దిశగా మళ్లే ట్రేడ్ విండ్స్ అనే ప్రక్రియ రుతుపవనాలకు కీలకం. ఈ ట్రేడ్ విండ్స్ వల్ల దక్షిణ అమెరికా తీరం చల్లబడుతూ మత్స్యకారులకు మేలు చేస్తుంది. ఇక ఆస్ట్రేలియా చుట్టుపక్కలేమో తేమ నిండిన వేడి, మబ్బులు సృష్టిస్తుంది ‘వాకర్ సర్క్యులేషన్’ అని పిలుచుకునే ఈ ప్రక్రియ వల్లే రుతుపవనాలు ఏర్పడతాయి. ఈ వ్యవస్థ బలహీనపడటమే ఎల్‌నినో. రుతుపవనాల ఆధారంగా కురిసే వర్షాలు, ఆ చినుకులను ఒడిసిపట్టుకునే కాలువల మీదే దక్షిణ భారతదేశపు వ్యవసాయం ఆధారపడి ఉంది. కాబట్టి రుతుపవనాలు విఫలం అయితే, మన ఆర్థిక వ్యవస్థ ప్రాణం విలవిల్లాడినట్టే. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఎల్‌నినో కేవలం వ్యవసాయం మీద మాత్రమే ప్రభావం చూపించదు. పెరుగుతున్న వేడి, తగ్గిన వర్షపాతం మన జీవితంలోని మిగతా పార్శ్వాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది.
ఎల్‌నినో ప్రక్రియ ప్రతి రెండు నుంచి ఏడేండ్లకి ఒకసారి ఏర్పడటం సహజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ, అది తరచుగా, మరింత తీవ్రంగా (సూపర్ ఎల్‌నినో) ఏర్పడటానికి కారణం మాత్రం మానవ తప్పిదాల వల్ల పెరుగుతున్న భూతాపమే. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ ఏకంగా మూడు సూపర్ ఎల్నినోలు ఏర్పడటమే ఇందుకు సాక్ష్యం. ఈసారి ఏర్పడిన ఎల్‌నినో వల్ల ఇప్పటికే అతి తక్కువ వర్షపాత నమోదైంది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది వర్షాకాలంలో సగటు కంటే 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత దశాబ్దకాలంలోనే ఇంత తక్కువ వర్షాలు పడలేదు.

India’s Climate And Harvest
దెబ్బతిన్న దిగుబడి..
సకాలంలో వర్షాలు పడలేదు, అకాలంలో పడ్డవీ సరిపోలేదు. వాననీటిని ఒడిసిపట్టే రిజర్వాయర్లు సెప్టెంబరు నాటికే దాదాపు మూడో వంతు లోటులో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దాంతో ఏటా వృద్ధి చెందుతున్న వ్యవసాయ దిగుబడి, ఈసారి సాధారణం కంటే నాలుగు శాతం తక్కువగా ఉంటుందని అధికారిక అంచనా. వాస్తవ పరిస్థితులు ఇంతకంటే దారుణంగానే ఉన్నాయన్నది రైతుల మాట. పంట దిగుబడిలో లోటు చాలారకాలుగా ఎకానమీని దెబ్బతీస్తుంది.
వ్యవసాయ ఉత్పత్తుల ధర పెరుగుదలను సూచించేందుకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని వాడతారు. అది ఏకంగా ఎనిమిది శాతాన్ని చేరుకున్నట్టు తెలుస్తున్నది. బియ్యం నుంచి ఉల్లిపాయల వరకూ చాలా ఉత్పత్తుల ధర ఏకంగా రెట్టింపు కావడమే ఇందుకు సాక్ష్యం. ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల జీవన వ్యయం ఊహించని విధంగా పెరుగుతుంది.
మన దేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయరంగ భాగస్వామ్యం భాగం 17 శాతం. సాగులో నష్టాలు వస్తున్నాయంటే అర్థం.. ఏకంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కొరత ఏర్పడినట్టే.
46 శాతం భారతీయులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వీరికి తగినంత ఆదాయం లేకపోవడం వల్ల.. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి ఒక్కసారిగా తగ్గిపోయినట్టు తెలుస్తున్నది. సబ్బుల దగ్గర్నుంచి బిస్కెట్ ప్యాకెట్ల వరకూ రోజువారీ వినియోగించే ‘ఫాస్ట్ మూవింగ్ గూడ్స్’ అమ్మకాలలో గణనీయమైన లోటును గమనించారు. ఇరాన్-అమెరికా, రష్యా-ఉక్రెయిన్ ఇలా పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఇతర దేశాల్లో పెరుగుతున్న అశాంతి వల్ల… చాలా ఆహార పదార్థాల దిగుమతి ఇప్పటికే తగ్గింది. యుద్ధ సమయంలో ఏర్పడే ఈ కృత్రిమ కొరతను ఫుడ్ వార్ ఫేర్ అంటారు. ఈ పరిస్థితులకు ఎల్‌నినో తోడుకావడంతో, వంటనూనెల వంటి కొన్ని ఉత్పత్తుల కొరత మరింత తీవ్రమైంది.

Heatwave Strain Power, Wat
ఖరీఫ్ ముగిసిన తర్వాత రబీ (శీతకాల పంటలు) సీజన్ ప్రారంభమవుతుంది. అయితే, ప్రస్తుతం జలాశయాలలో నీటి మట్టాలు అడుగంటిపోవడం, నేలలో తేమ శాతం తగ్గడం వల్ల గోధుమ, శనగ, ఆవాలు వంటి రబీ పంటల విత్తనంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
వర్షాలు లేకపోవడం వల్ల పశుగ్రాసం లభ్యత తగ్గి, పాడి పరిశ్రమ దెబ్బతింటుంది. ఇది పాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెరిగిన వేడి, నీటి కొరత వల్ల టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వంటి నిత్యం వాడే కూరగాయల సాగు తగ్గి, వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
విద్యుత్ సంక్షోభం
దేశం ఉత్పత్తి చేసే విద్యుత్‌లో దాదాపు 10 శాతం హైడ్రో ప్రాజెక్టుల నుంచే వస్తున్నది. ఆ ప్రాజెక్టులు ఇప్పుడు ఎండిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు పెరిగిన వేడి, తగ్గిన వర్షం వల్ల వ్యవసాయ మోటార్ల దగ్గర్నుంచీ ఇంట్లో ఏసీల వరకూ విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సెప్టెంబరు నాటికే ఏకంగా 11 శాతం అధిక విద్యుత్ వినియోగిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. తగ్గిన ఉత్పత్తి పెరిగిన గిరాకీలతో దేశం విద్యుత్ సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నదనే భయాలు ఉన్నాయి. ఇళ్ల దగ్గర్నంచీ కార్యాలయాల వరకూ ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగి వినియోగదారుల మీద భారమూ పెరుగుతున్నది. అంతేకాదు! ఏసీల వాడకం పెరగడం అంటే, అవి విడుదల చేస్తున్న వేడి కూడా పెరుగుతుందని అర్థం. ఓ పట్నంలో కొన్ని లక్షల ఏసీలు ఒక్కసారిగా బయటికి వేడిని పంపిస్తున్నాయంటే.. దాని వల్ల వాతావరణం మీద ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఊహించవచ్చు.

Wells Drought
నీటి ఎద్దడి
వర్షపు నీరు ఇంకక, భూగర్భ జలాలు లోతుకు వెళ్లిపోతున్నాయి. తెలంగాణలో ఈ జలాలు సగటు రెండు మీటర్ల దిగువకు పడిపోయినట్టు అంచనా. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు ట్యాంకర్ల మీదే ఆధారపడుతున్నాయి. సింగూరు జలాలు అతి దిగువకు చేరుకోవడంతో.. తాగునీటి సరఫరాలో కూడా కోతలు విధిస్తారనే అనుమానాలు మొదలయ్యాయి. కోటిమందికి పైగా నివసించే భాగ్యనగరానికి సరిపడా నీరు అందించడం అంత తేలిక కాదు. ఆ మాటకు వస్తే సంగారెడ్డి వంటి ప్రాంతాలు కూడా ఇప్పటి నుంచే మంచినీటి కరువును చూస్తున్నాయి. కొన్నిచోట్ల తాగునీటి కోసం మున్సిపాలిటీలే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి.
ఆరోగ్యానికీ ముప్పే!
ఎల్‌నినో వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలతో రెండు లక్షల మందికి పైగా చనిపోవచ్చని చికాగో విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఓ నివేదిక హెచ్చరిస్తున్నది. సంఖ్య మారవచ్చు కానీ, ఎల్‌నినో ఆరోగ్యానికి ప్రాణాంతకం అని సూచించేందుకు కారణాలు చాలానే ఉన్నాయి.
శీతాకాలం సమీపిస్తున్నా ఎండలు మండుతున్నాయి. వడదెబ్బ, డీహైడ్రేషన్ లాంటి కేసుల సంఖ్య తగ్గడం లేదు. అధిక ఉష్ణోగ్రతలు గుండె, శ్వాసకోశ, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి నేరుగా ప్రాణాపాయాన్ని కలిగించకపోయినా… అనారోగ్యాన్నీ, వైద్య ఖర్చులనీ మిగులుస్తాయి.
వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, బయట పనిచేసే కార్మికులు, వ్యవసాయ కూలీలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తపడాల్సిన పరిస్థితులివి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఎండలో పనిచేయడం వల్ల శరీరంపై వేడి ఒత్తిడి పెరుగుతుంది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే శరీరం చల్లబడటానికి తగినంత సమయం దొరకకపోవచ్చు.
అధిక వేడితో ఆహారం త్వరగా పాడయ్యే ప్రమాదమూ ఉంది. సరిగ్గా నిల్వ చేయని వంటకాలు, కలుషితమైన నీరు జీర్ణకోశ సమస్యలకు కారణం కావచ్చు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నీటి కొరత ఏర్పడినప్పుడు అందుబాటులో ఉన్న అపరిశుభ్రమైన నీటిని వాడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్లు, విరేచనాలు వంటి ప్రమాదకర వ్యాధులు వేగంగా ప్రబలుతాయి.
అంతేకాదు! పరిశుభ్రమైన నీరు దొరక్కపోవడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రత తగ్గి, చర్మ సంబంధిత అలర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల దోమలు, ఈగలు పెరిగిపోయి వాటిద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు ప్రబలుతుంది.
ఉద్యోగాలకు ముప్పు!
ఇప్పటికే ఏఐ పేరు చెబుతూ కంపెనీలు విచ్చలవిడిగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. దానికి ఇప్పుడు ఎల్‌నినో కూడా తోడయినట్టే కనిపిస్తున్నది. అయిదు శాతం వర్షపాతం తగ్గితే కనుక, స్థూల జాతీయ ఉత్పత్తిలో 1.75 వరకు కొరత ఏర్పడుతుందని అసోచామ్ అంచనా. ఫలితంగా లక్షల కోట్ల ఆదాయం చేజారినట్టే. ఇది ప్రజల, మరీ ముఖ్యంగా రైతుల కొనుగోలు సామర్థ్యం మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది.
వ్యవసాయం దెబ్బతింటే దాని మీద ఆధారపడిన ఎన్నో రంగాలు కూడా కుంటుపడతాయి. ఎందుకంటే భారతీయ పారిశ్రామిక రంగంలో దాదాపు 30 శాతం వ్యవసాయ ఆధారితంగానే కొనసాగుతున్నదని అంచనా. కూరగాయలు, పండ్లు, పూలను పండించేవారు; ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉద్యోగులు; వస్ర్తాల తయారీ అమ్మకాల మీద ఆధారపడేవారు కూడా ఇబ్బందిపడతారు. వేడి విపరీతంగా పెరిగిపోవడం వల్ల నిర్మాణ రంగంలో పనులు నెమ్మదిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గితే అక్కడి ప్రజల మీద ఆధారపడే చిన్న వ్యాపారస్తులు, డెలివరీ బాయ్స్, దినసరి కూలీలకు కూడా ఆదాయం తగ్గుతుంది.

Climate Change Crisis And
పరోక్షంగా సవాలక్ష సమస్యలు!
గ్రామాల్లో తాగునీటి కోసం ప్రయాణించాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇది గ్రామీణ ప్రజలు మరీ ముఖ్యంగా ఈ బాధ్యతను తలకెత్తుకునే మహిళల సమయం, ఆరోగ్యాల మీద ప్రభావం చూపిస్తుంది.
పశువులకి తగినంత నీరు లేకపోవడం లేదా కలుషిత నీరు పట్టించాల్సి వస్తుంది. దానివల్ల వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది. పౌల్ట్రీ రంగంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తితే, వాటి మాంసాన్ని తినేవారిలోనూ ఆరోగ్య సమస్యలు రావచ్చు.
టమాటా, ఉల్లిలాంటి త్వరగా పాడైపోయే ఉత్పత్తుల ధరల్లో అసాధారణ హెచ్చుతగ్గులను ఇప్పటికే మనం గమనిస్తున్నాం. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల వల్ల వీటి సాగు, నిల్వ రెండూ కష్టమవుతుంది.
పాఠశాలలు, హాస్పిటల్స్, రవాణా వ్యవస్థలు, కార్యాలయాల మీద కూడా.. ఈ వేడిని నియంత్రించేందుకు, తమ దగ్గర ఉన్నవారికి తాగు నీరు అందించేందుకు ఒత్తిడి పెరుగుతున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గిపోవడంతో కార్మికులు జాతీయ ఉపాధి హామీ వంటి పథకాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇది ప్రభుత్వ మీద మరికాస్త ఆర్థిక భారాన్ని పెంచుతుంది.
తక్షణ చర్యలు
సమస్యను పూర్తిగా వ్యక్తుల భుజాలపై వేసి దులిపేసుకుంటే సరిపోదు. నీటి వనరుల సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, భూగర్భజలాల పర్యవేక్షణ, పంటల ప్రణాళిక, ఆహార నిల్వల నిర్వహణ, ప్రజారోగ్య వ్యవస్థల బలోపేతం, నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరతను నివారించడం, పశుగ్రాసానికి కూడా కేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటి చర్యలు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సమన్వయంతో చేపట్టాలి.
వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో అందించాలి. కేవలం వర్ష సూచన మాత్రమే కాకుండా, ఎండల గురించి కూడా హెచ్చరించాలి. నీటి కొరత ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు పంటల విషయంలో సలహాలు, సబ్సిడీల గురించి అవగాహన అందించాలి. కరువు పరిస్థితుల్లో అత్యంత ప్రభావిత కుటుంబాలకు ఆహార భద్రత, ఉపాధి సహాయం అందించడం కూడా కీలకమే! ఎల్‌నినో ఎలాగూ విరుచుకుపడిపోయింది. దాన్నిప్పుడు మధ్యలో ఆపలేం. కానీ, నష్టాన్ని వీలైనంతగా తగ్గించడం మాత్రం మన చేతిలోనే ఉంది.
పరిష్కారాలు లేకపోలేదు!
40 శాతం నీటి వృథా
కాస్త ఆశ్చర్యంగా ఉన్నా పైపుల లీకేజీలు, అనధికారిక వినియోగం వంటి కారణాలతో.. మన దేశంలో 40 శాతం మంచినీరు వృథా అవుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాలలో ఇది 50 శాతం వరకూ కూడా ఉంటున్నది. కంటి ముందు జారిపోయే నీటి చుక్క మన ఉమ్మడి బాధ్యత. దాన్ని ఎవరు గమనించినా స్వయంగా సరిదిద్దడమో, అధికారులకు సూచించడమో చేయాల్సిందే. ఇక ఉన్న నీటిని పొదుపుగా వాడేందుకు జలనియంత్రణ బోర్డు వంటి సంస్థలు చాలా సూచనలే చేస్తున్నాయి. వాటిని పాటించడం తప్పనిసరి. ఇళ్ల దగ్గర్నుంచీ బండ్ల వరకూ నీటితో కాకుండా డ్రైవాష్ చేసుకోవడం, వృథా నీటిని మొక్కలకు మళ్లించడం, ఇంకుడు గుంతల ఏర్పాటు లాంటి చాలా జాగ్రత్తలే మనకు అందుబాటులో ఉన్నాయి.

Water Conservation In Motio
తక్కువ నీరుతో తగిన పంట
పెసర్లు, మినుములు, నువ్వులు లాంటి కొన్ని పంటలు తక్కువ నీటితో పండుతాయి, పైగా రెండు మూడు నెలలకే దిగుబడికి వస్తాయి. ఇక డ్రిప్, స్ప్రింక్లర్ లాంటి పద్ధతులతో అతి కొద్ది నీటితో పంటలు పండించవచ్చు.

Sustainable Farming Irrigat
ఆరోగ్యం జర భద్రం
దాహం వేయకపోయినా కూడా రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల మంచినీరు తాగాలి. ఉక్కపోతగా అనిపిస్తున్నా, బయట తిరగాల్సిన పరిస్థితి వచ్చినా, పిల్లలు బడి నుంచి వచ్చినా.. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ రసం, ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవాలి. వాతావరణం కాస్త చక్కబడేవరకూ నిల్వ ఉంచిన లేదా బయట అమ్మే అపరిశుభ్రమైన ఆహారాన్ని తినకూడదు. ప్యూరిఫయర్ సదుపాయం లేకపోతే… నీటిని బాగా కాచి, చల్లార్చి తాగడం మంచిది. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం కాకపోతే ఎండలో తిరగకూడదు. బయటకు వెళ్లాల్సి వస్తే తెల్లటి, వదులైన నూలు (Cotton) దుస్తులు ధరించాలి. గొడుగు లేదా టోపీ వాడాలి. ఎండాకాలంలో తీసుకునే ఇలాంటి జాగ్రత్తలన్నీ ఇప్పుడు కూడా తప్పనిసరి.

Summer Heat Safety And Hydr
వీక్లీ బడ్జెట్
ధరలు ఇంకా పెరుగుతాయేమో అన్న భయంతో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో సరుకులు కొనడం సరైన వ్యూహం కాదు. బియ్యం, పప్పులు లాంటి నిల్వ చేయగలిగే పదార్థాలను మాత్రమే నెల/రెండు నెలలకి సరిపడా పరిమాణంలో తీసుకుని తేమ లేకుండా పురుగు పట్టకుండా భద్రపరచాలి. స్థానికంగా, సమృద్ధిగా దొరికే కూరగాయలూ పండ్లు కాస్త అందుబాటు ధరలో దొరుకుతాయి. పరిస్థితులు చక్కబడేదాకా వీక్లీ బడ్జెట్ వేసుకుంటే నిత్యావసర వస్తువులన్నీ అవసరమైన మేరకు, తక్కువ రేటులో ఉన్నవి కొనుగోలు చేసుకోవచ్చు.

Weekly Budget And Smart Gro
విద్యుత్ ఆదా
కరెంటు బిల్లుని ఆదా చేయడం అంటే కేవలం డబ్బుల్ని మాత్రమే పొదుపు చేయడం కాదు, ప్రభుత్వానికీ సాయపడటమే. ఇంట్లో పగటి వేడిని తగ్గించేందుకు కిటికీలకు తెరలు, సన్షేడ్లు ఉపయోగించడం, అవసరం లేని విద్యుత్ పరికరాలను ఆపివేయడం, ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలను ఎంచుకోవడం ప్రయోజనకరం. ఇండోర్ ప్లాంట్స్, భవనాల చుట్టూ పచ్చదనాన్ని పెంచడం వేడి ప్రభావాన్ని తగ్గించడంలో సాయపడతాయి.

Eco Friendly Home Energy Sa
ఒక్క మాటలో చెప్పాలంటే రోహిణికార్తె ఏడాది తరబడి సాగితే ఎలా ఉంటుందో… ఇప్పటి ఎల్‌నినో అదే పరిస్థితిని తలపిస్తుంది. ఇంధనం త్వరగా ఆవిరవ్వడం దగ్గర్నుంచి పచ్చటి చెట్లు ఎండిపోవడం వరకూ ఎండాకాలంలో కొద్దిరోజులకు పరిమితమయ్యే సమస్యలే కొనసాగుతున్నాయి. మళ్లీ తొలకరి పడేవరకూ సాంత్వన లభించకపోవచ్చు.
– ఎన్. శిరీష
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

