ఊర్ల ఉర్సు జరుగుతంది. బజార్ల ఉశికవోత్తె రాలనంత మంది ఉన్నరు. అంతట్లకే నస్రుద్దీన్ గాడిది ఇమానం లెక్క రువ్వరువ్వ ఉరుకుక్కంట అత్తంది. ఒక శెయ్యితోని రుమాలు, ఇంకో శెయ్యితోని పగ్గం బట్టుకొని కూసున్నడు మనోడు. సుట్టు పక్కలోళ్లు ఎంత మొత్తుకున్నా.. అటీటు సూత్తలేడు. గాడిదేమో ఆగుతలేదు. దాంతోని గుంపంత అటీటు ఉర్కవట్టిండ్రు.
కట్టెల మోపు అడ్డమచ్చి గాడిది ఉరుకుడు ఆపింది. ఉరికిఉరికి మొసవోత్తున్న మౌల్వీసాబ్.. “ఏంది మియా! గింత రువ్వడిగ ఎక్కడికి వోతున్నవ్?” అంట నస్రుద్దీన్ను అడిగిండు. దానికి మనోడు.. “అరే! నాకేమెరుక? నా గాడిదిని అడుగు! ఏం పనివడ్డదో.. ఏడికి వోతందో!” అంట అగ్గోలె లేశిండు.
– పత్తిపాక మోహన్