మన సినారె కవిత్వాన్ని గురించి మహాకవి డా॥ దాశరథి చెబుతూ ‘నవరసాలమూర్తి నారాయణరెడ్డి కీర్తి’ అని పేర్కొన్నారు. అక్షరమక్షరాన ఆయన కవిత్వం, మూర్తిమత్వంలో అది మనకు కనిపిస్తుంది. అందులోనూ సినీ గీతాల్లో ఆబాలగోపాలానికి అది అనుభవైకవేద్యమే! అందులోనూ సినారె వంటి గేయ కవి చక్రవర్తికి సినిమాల్లో ట్యూన్లకు కాకుండా కథ, సన్నివేశం, కథతో పెనవేసుకున్న విలక్షణ సందర్భాలకు గీతం రాసే అవకాశం దొరికితే ఆ గీతం అజరామరం అవ్వడం ఖాయం. అటువంటిదే 1975లో ‘జీవనజ్యోతి’ సినిమాకు గీతాలు అందించే అవకాశం రావడం. ఈ సినిమాని డి.వి.ఎస్. రాజు నిర్మించారు. ఇంలోని ‘ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు/సద్దుచేశారంటె ఉలికులికి పడతాడు’ జోలపాటఅమ్మ ప్రేమకు మందిరమై నిలిచింది.
‘జీవనజ్యోతి’ సంచలన విజయం సాధించిన అందమైన చిత్రం. దీనికి దర్శకుడు కె.విశ్వనాథ్. సంగీతం అందించిన వారు కేవీ మహదేవన్. ‘ముద్దుల మాబాబు’ పాట విషయంలో దర్శకుడి సూచనలు, మహదేవన్ స్వరకూర్పు గురించి సినారె ప్రస్తావిస్తూ.. ‘పైన చూస్తే అది మామూలు జోలపాటలాగే అనిపిస్తుంది. ఓ తల్లి తన బాబుకు ఆప్యాయంగా పాడే జోలపాట అనిపిస్తుంది. కానీ, ఆ పాట రూపొందిన సందర్భాన్ని మనసుపెట్టి చూస్తే కళ్లు చెమరిస్తాయి’ అంటారు. అవును సినిమాను చూసిపప్పుడు ఆ తరానిది… ఇప్పటికీ వింటున్న ఈ తరానిది అదే స్థితి. గీతంతోపాటు దీనికి అభినయం చేసిన వాణిశ్రీ నటన మరింతగా ఖ్యాతిని సమకూర్చింది. కథ దృష్ట్యా తాను మిక్కిలి ప్రేమించే తన తోటికోడలు కొడుకు ఆకస్మికంగా మరణిస్తాడు. దాంతో కథానాయిక వాణిశ్రీ మతి స్థిమితాన్ని కోల్పోతుంది. బొమ్మను పట్టుకుని ఆ బొమ్మనే తన బాబుగా భావించి ఒక దీన, ఉన్మాదస్థితిలో పాడుకునే సందర్భంలోనిది ఈపాట.
ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు
సద్దుచేశారంటె ఉలికులికి పడతాడు
గోపాలక్రిష్ణయ్య రేపల్లెకు వెలుగు
మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు
ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు
ప్రతి తల్లికీ తన కొడుకు రారాజు.. తన ఇంటికి… వంశానికి చక్రవర్తి. ఈ చిత్రంలోని తల్లికి కూడా తన కొడుకు లోకాలకు వెలుగునిచ్చే తండ్రి. తన ప్రాణానికి ప్రాణమైన చిన్నారి దూరమైన మానసిక స్థితిలో ఉన్నప్పుటికీ ఇక్కడ తల్లి నేపథ్యంగా, పిల్లలపై తనకున్న కొండంత ప్రేమను “గోపాల క్రిష్ణయ్య రేపల్లెకు వెలుగు/ మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు” అనడం చూడండి. తన నోటిలో పద్నాలుగు భువనాలను చూపించిన జగదానందకారకుడైన ఈ ‘గోపాల కృష్ణయ్య కేవలం రేపల్లెకు వెలుగు అట, తన ఒడిలో ఉన్న తన చిన్నారి బాబు మాత్రం లోకానికి వెలుగ’ట. ఆహా! ఎంత చక్కని ఊహ! తల్లి తల్లే కదా! తరువాతి గీతాన్ని అందులోని ప్రయోగాల్ని చూద్దాం.
చల్లగా నిదరోయే బాబు
నిదరలో మెల్లగా నవ్వుకునే బాబు
ఏమి కలలు కంటున్నాడో తెలుసా, తెలుసా
ఏ జన్మకు ఈ తల్లే కావాలని
ఈ ఒడిలోనే ఆదమరచి ఉండాలనీ..
జు జు జు జు.. జూ, జు జు జు జు.. జూ
‘జో అచ్యుతానంద’ మొదలు సినారె రాసిన ‘లాలీ లాలీ లాలీ…’ వరకు తెలుగుకు సొంతమైన వేలాది జోల, లాలి పాటలు మనకు తెలుసు. ‘లాలీ… లాలీ…’… ‘జో.. జో…’ అన్నప్పుడు ఆ పదాల్లోని మాధుర్యం… తూగు, లయలు భాష అర్థం కాకున్నా పసిపాపలకు హాయిని గొలుపుతాయనడంలో సందేహం లేదు. ఇందులోనూ సినారె ‘జు.. జు.. జు.. జు..’ అంటూ ప్రయోగించారు. సినారె తాను ప్రత్యేకంగా ఈ గీతంలో చేర్చిన ‘జు.. జు..’ల గతికి అనుకూలంగా స్వరాన్ని కూర్చమని అడిగారట. దానికి “మహదేవన్ పల్లవిలోని మాటలను లోగొంతుకలో వల్లించుకున్నాడు. ‘సింధుభైరవి’ రాగంలో బాణి సంతరించుకుని, ఎత్తుకోవడమే “ఉష్” అని ఉచ్చరించాడు” అని ఒకచోట ప్రస్తావించారు సినారె.
ఈ గీతాన్ని చిత్రంలో ఆలపిస్తున్న నాయిక మతిస్థిమితం లేని వాణిశ్రీ, మరి పాట రచన, చిత్రీకరణ, సన్నివేశం, సందర్భం దానికి తగినట్టుగానే ఉండాలి కదా! కేవలం ఇవే కాదు పాట ఆలపన కూడా అలాగే పైస్థాయిలో ఎత్తుకుని, చివరకు కిందికి దించి ఆర్ధ్రంగా కూర్చారు మహదేవన్. అంతే అద్భుతంగా గీతాన్ని ఆలపించారు సుశీల. ఇక ఆ తల్లి మనస్తత్వం కూడా చూడండి. దేవుడు తన ఎదుట నిలబడి అడిగితే తల్లిగా తాను ఏం కోరుకుంటుందో చెబుతుంది. సినారెకు తల్లి పట్ల మమకారం గొప్పది. ఆయన ‘అమ్మ బొమ్మ’ కవిత చదివిన వారికి అది తెలుసు. అందుకే ఈ చిత్రంలోని ‘పిచ్చితల్లి’తో “నీ నీడలో మావాడు పెరగాలని/ పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని’ అని చెప్పిస్తారు. మొదటి చరణంలో తన కన్నయ్య లోకానికి వెలుగని చెప్పిన తల్లి ఆ చిన్నారి దేవుడికంటే గొప్పవాడు కావాలని ఇక్కడ కోరుకోవడం చూడవచ్చు.
‘జీవనజ్యోతి’ కోసం ఇదే పల్లవితో రెండు గీతాలు రాశారు సినారె. మొదటి గీతంలో తన కుమారుడు ప్రతి జన్మకు తన తల్లే, తనకు తల్లి కావాలని కోరుకుంటాడనీ, తన ఒడిలోనే ఆదమరిచి నిద్రపోవాలని కోరుకుంటాడని పాడుతుంది. రెండో గీతంలో
ఎదురుగ ఉన్నాను నేను
ఇంకెవరినో కాదు మీ అమ్మను
నువ్వు రోజుకొక్క ఏడూ పెరగాలని
నీ ముద్దు మురిపాలు చూడాలని
కలవరించి పోయే నీ తల్లిని నేను
ఆ కలలోనె బతుకుతున్న తల్లిని నేను
పిచ్చితల్లిని నేను!
అని పాడుతుంది. ఇంకా తన కన్నయ్యకు తాను పాడే ఈ జోలపాట మామూలు పాట కాదట. అది తాను తన కన్నయ్య కోసం పాడుతున్నప్పటికీ అది లోకాలన్నింటికి పాడే జోలపాటనట.
నా పాపకు నేపాడే లాలిపాట
ఈ లోకాలకన్నీటికీ జోలపాట
ముగింపు ఎంత ఇంపుగా ఉందో కదా! ఒకానొక సందర్భంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ… ‘నేను దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘బాబు’ విడుదలైన రెండు వారాల్లోనే కళాతపస్వి కె.విశ్వనాథ్ ‘జీవన జ్యోతి’ సినిమా రిలీజైంది. రెండు సినిమాల్లోనూ శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. ‘జీవన జ్యోతి’ విడుదలయ్యే వరకు ‘బాబు’ బాగానే ఆడింది. ఆ చిత్రం విడుదలయ్యాక అమాంతం ‘బాబు’ కలెక్షన్లు తగ్గాయి. ‘జు.. జు.. జు.. జు.. జూ’ ఒక్క ఆలాపనతో ఆ సినిమా జనాలను తెగ ఆకట్టుకుంది..’ అని పంచుకున్న విషయాలు ఇక్కడ ప్రస్తావనీయం.
– పత్తిపాక మోహన్