సోమవారం 26 అక్టోబర్ 2020
Sunday - Apr 19, 2020 , 01:28:21

తొలి తెలుగు తెలంగాణ కవయిత్రి కుప్పాంబిక

తొలి తెలుగు తెలంగాణ కవయిత్రి కుప్పాంబిక

కుప్పాంబిక తెలంగాణ సాహిత్య  జగత్తు అంతా గర్వించదగిన పాలమూరు ఆడబిడ్డ. తెలంగాణ ప్రాశస్త్యాన్ని ఇనుమడింపజేసి, మహిళా సాహిత్యక్షేత్రంలో తొలి బీజాలు వేసిన కాకతీయుల కాలం నాటి కవయిత్రి. గోన వారు, మల్యాల వారు కాకతీయులకు సామంతులు. ఈ రెండు వంశాలకు చెందిన కుప్పాంబిక పుట్టినింటికీ, మెట్టినింటికీ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. 

కాకతీయుల సామంతరాజు గోన బుద్ధారెడ్డి, కందూరునాడులో భాగమైన వర్ధమానపురాన్ని (ప్రస్తుతం నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని నంది వడ్డేమాన్‌) పాలించేవాడు. పదమూడో శతాబ్దానికి చెందిన ఈయన కవి పండితుడు కూడా. తొలి తెలుగు ద్విపద రామాయణాన్ని రచించాడు. ఈయన కూతురే కుప్పాంబిక. గోన గన్నారెడ్డికి స్వయాన అక్క. మల్యాల వారి కోడలు.కాకతీయులకు సామంతులుగా బూదపురం (నేటి భూత్పూరు.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మండలం) రాజ్యాన్ని మల్యాల వారు పాలించేవారు. మల్యాల గుండనాథుడు కుప్పాంబికను వివాహమాడాడు. ఈయన మరణించిన తర్వాత బూదపురంలో కుప్పాంబిక ఒక శాసనం క్రీ.శ. 1276లో వేయించింది. దీనిని బట్టి కుప్పాంబిక క్రీ.శ. 1230లో జన్మించినట్టు చరిత్రకారులు నిర్ధారించారు. 

కుప్పాంబిక ధీరత్వం, శూరత్వం కలగలిసిన నాయిక, ఆమె ఒక వీరునికి కూతురుగా, మరో వీరునికి పత్నిగా వర్థిల్లడమే కాక అందమైన, అద్భుతమైన పద్య నైవేద్యాన్ని సాహితీ ప్రియులకు అందించిన మహిళాసాహితీ మణిదీపం. త్రండి గోన బుద్ధారెడ్డి నుంచి కుప్పాంబిక సాహిత్య వారసత్వాన్ని పొందారు. భర్త మల్యాల గుండనాథుని ఆస్థానంలోని కవులు, ఈశ్వరభట్టోపాధ్యుడు అనే ఉద్ధండ పండితుడు వంటివారి స్ఫూర్తితో సాహిత్యానికి మెరుగులు దిద్దుకున్నారని ప్రతీతి. కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా గుర్తింపు పొందింది. పదహారవ శతాబ్దం నాటి మొల్లకు రెండు వందల ఏండ్ల ముందే కవిత్వం రాసిన కుప్పాంబికనే తొలి తెలుగు కవయిత్రిగా సాహిత్యకారుడు, చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ నిర్ధారించారు. కాకపోతే కుప్పాంబిక రచనలుగానీ, వాటి పేర్లు కానీ ఇప్పటివరకూ లభ్యం కాలేదు. అయినా శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాన్ని ఒకదానిని ఉదహరించాడు. ఇదొక్కటే ప్రస్తుతానికి మనకు తెలిసింది. 

వనాజాతాంబకుడేయు సాయకములన్‌ వర్ణింపగా రాదు, నూ 

తన బాల్యాధిక యవ్వనంబు మదికిన్‌ ధైర్యంబు రానీయద

త్యనురక్తిన్‌ మిముబోంట్లకున్‌ దెలుప నాహా! సిగ్గుమైకోదు పా 

వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంచల్‌ తుదల్ముట్టునే!!

నేర్పుగల కవి రాసిన పద్యం కన్నా తక్కువేం కాదు ఈ పద్యం. ఇది ఒక కావ్యంలోని నాయికా విరహ తాపాన్ని వర్ణించే పద్యం. బాల్యం నుంచి యవ్వనదశకు చేరుకున్న తనపై మన్మథుడు కురిపించే బాణాలు పెంచే మోహాన్ని తన ప్రియసఖులతో కూడా చెప్పుకోలేకపోవడం గురించి ఆ పద్యంలో కుప్పాంబిక హృద్యంగా రాశారు. ఇంతటి రమ్యమైన పద్యాన్ని 13వ శతాబ్ది కాలంలోనే ఒక మహిళ అందించడం అందులోనూ పైకి చెప్పలేని భావజాలాన్ని తన మనఃస్థితిని మధురమైన పదాల కూర్పుతో అల్లడం ఆమె రచనా వైశిష్ట్యానికి తార్కాణం. కుప్పాంబిక సోదరులు కాచభూపతి, విఠలనాథుడు మొట్టమొదటి సోదర జంటకవులుగా పేరుగాంచారు. వీరు రంగనాథ రామాయణంలో ఉత్తరకాండను పూర్తిచేశారు. 

-నగేష్‌ బీరెడ్డి


logo