ఇడ్లీలను మల్లెపూలతో పోలుస్తారు. నిజానికి మల్లెల కంటే తెల్లగా, అంతే సుకుమారంగా ఉంటాయి కూడా. కొంతమంది రాగి, పెసర్లు, క్యారెట్, బీట్రూట్ జతచేసి రంగురంగుల ఇడ్లీలను చేసుకుంటారు. ఓ అడుగుముందుకేసి.. కారుమబ్బుల్లాంటి నల్లని ఇడ్లీలనూ వడ్డిస్తున్నాడు నాగపూర్‌కు చెందిన కుమార్ అనే ఓ ఇడ్లీ వ్యాపారి. ‘ఆల్ ఎబౌట్ ఇడ్లీ’ పేరుతో నిర్వహిస్తున్న రెస్టారెంట్లో 100 రకాల ఇడ్లీలు తయారు చేస్తాడు కుమార్.
తిరంగా ఇడ్లీ, గ్రీన్ ఇడ్లీ, రెడ్ ఇడ్లీ, ఎల్లో ఇడ్లీ.. ఇలా అన్ని రంగుల్లోనూ లభిస్తాయి. త్వరలోనే అన్ని వర్ణాలూ కలిపి రెయిన్బో ఇడ్లీలు కూడా తీసుకొస్తానని చెబుతున్నాడు. ఇక్కడ బ్లాక్ ఇడ్లీ బాగా ఫేమస్. యాక్టివేటెడ్ చార్కోల్ను ఇడ్లీపిండిలో కలిపి నల్లనల్లని ఇడ్లీలు వేస్తాడు. ఇవి ఆరోగ్యానికి మంచివని ప్రచారం జరగడంతో వ్యాపారం జోరుగా సాగుతున్నది.