తన తోటివాళ్లంతా ఉన్నత చదువుల్లో సాగిపోతుంటే.. ఆ యువతి మాత్రం కుటుంబం కోసం చదువును త్యాగం చేసింది. అన్నతో కలిసి కొండపల్లి బొమ్మలు తయారు చేస్తూ ఇంటి భారాన్ని పంచుకుంది. ఒక్కో మెట్టూ ఎక్కుతూ విజయానికి చేరువైన కటకం చిన్నారి ప్రస్థానమిది. ఇంట్లో తయారు చేసినబొమ్మలను ఈ కామర్స్ వేదికగా ప్రపంచానికి చేరువ చేస్తూ, ఆర్థికంగా ఎదుగుతున్న చిన్నారిని జిందగీ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
మా పూర్వికులు కొయ్యతో ఈ తరహా బొమ్మలు, శిల్పాలు చెక్కేవారట. తర్వాతి కాలంలో ఆ కళ మాకు దూరమైంది. దాన్ని తిరిగి నేర్చుకోవాలని మా అన్న చాలా ప్రయత్నించాడు. కుదరకపోవడంతో ఆ కళకు దగ్గరగా ఉన్న కొండపల్లి బొమ్మలు తయారు చేసేందుకు శిక్షణ తీసుకున్నాడు. అన్న చదువుకుంటూనే కొండపల్లి బొమ్మలు తయారు చేసేవాడు. నాన్న పంచాయతీ ఆఫీస్‌లో ఉద్యోగం చేసేవాడు. కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. మా సొంతూరు రాజమండ్రి విడిచిపెట్టి పదేండ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చాం. నాన్న ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. అమ్మ, అక్క శిల్పారామంలో పనిచేస్తూ కుటుంబ భారం పంచుకునేవారు.
నేను పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న సమయంలో నాన్న గుండెపోటుతో మరణించారు. నాన్న మరణం మమ్మల్ని ఎంతో కలిచివేసింది. కుటుంబం అంతా ఒంటరి అయిపోయిందన్న భావన వచ్చింది. నేను చదువు ఆపొద్దని ఇంటర్లో చేరినా.. కొనసాగించలేకపోయాను. కుటుంబ పోషణ కోసం చదువుకు కామా పెట్టేసి.. అన్న దగ్గర బొమ్మల తయారీ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పట్నుంచి నేను, అన్న కలిసి బొమ్మలు చేసేవాళ్లం. కానీ, వాటిని ఎక్కడ అమ్ముకోవాలో తెలిసేది కాదు. అందుకే, అన్నకు శిక్షణ ఇచ్చిన వారినే అమ్మిపెట్టమని చెప్పాం. ఇలా బొమ్మల ద్వారా సమకూరిన ఆదాయంతోనే మా అక్క పెండ్లి చేశాం.

అమ్మ శిల్పారామంలో పనిచేయడం వల్ల మా కళ గురించి అక్కడి నిర్వాహకులకు తెలిసింది. అక్కడే స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు. 2023లో శిల్పారామంలో స్టాల్ ఏర్పాటు చేయడంతో మా వ్యాపారం కూడా వృద్ధిలోకి వచ్చింది. మా వస్తువును మేమే అమ్ముకునే స్వేచ్ఛ లభించింది. కానీ, మా ఉత్పత్తులను అమ్ముకునే విధానం తెలియక కాస్త తడబడ్డాం. అప్పుడే వీహబ్ గురించి తెలిసింది. అందులో చేరాక వ్యాపారం అంటే ఏంటో అవగాహన ఏర్పడింది. వీహబ్ సహకారంతో మార్కెటింగ్ మెలకువలు నేర్చుకోగలిగాం. గతంలో మేం తయారు చేసే బొమ్మలు దసరా, దీపావళి పండుగల సీజన్లో మాత్రమే అమ్ముడయ్యేవి. మిగతా రోజుల్లో అంతగా ఆదరణ ఉండేది కాదు. ఆ సమయంలోనే ‘ఆహార్యాస్ ఈ కామర్స్’ పరిచయమైంది. వారి ప్లాట్‌ఫాంలో మా బొమ్మలు పెట్టడం వల్ల ఏడాదంతా సంపాదించే అవకాశం లభించింది. ఇంట్లో నుంచి ఈ కామర్స్ వరకు మా బొమ్మలు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా మా బొమ్మలు అమ్ముడవుతున్నాయి.

కొత్తలో నెలకు 60 బొమ్మలను తయారు చేస్తే అన్ని ఖర్చులు పోను రూ.30 వేల వరకు మిగిలేది. అదంతా ఇంటి ఖర్చులకే సరిపోయేది. ప్రస్తుతం అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.60 వేలకు పైగా సంపాదించగలుగుతున్నాం. నెలకు వంద బొమ్మలకుపైగా చేస్తూ సంతోషంగా జీవిస్తున్నాం. మా అన్న సహకారంతో బొమ్మల తయారీలో మంచి పట్టు సాధించగలిగాను. ప్రతి రోజూ ఉదయం రెండు గంటలు ఇంట్లోనే బొమ్మలు చేస్తాను. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు శిల్పారామంలో స్టాల్ నిర్వహిస్తున్నాను. నేను తయారు చేసిన బొమ్మల్ని నేనే అమ్ముకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది.
బొమ్మలు కొనేందుకు రకరకాల భాషలు మాట్లాడేవారు వస్తుంటారు. నేను చదువుకోకపోవడం వల్ల తెలుగు తప్ప ఇతర భాషలో మాట్లాడలేను. అందుకే ఆ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు ఆర్థిక పరిస్థితుల వల్ల ఆగిపోయిన నా చదువును తిరిగి కొనసాగిస్తున్నాను. ఇటీవలే ఇంటర్మీడియట్లో తిరిగి ప్రవేశం పొందాను. డిగ్రీ వరకైనా చదవాలని ఉంది. పెండ్లి తర్వాత కూడా బొమ్మల తయారీ కొనసాగిస్తాను. నా కుటుంబాన్ని ఓ దారికి తెచ్చిన ఈ బొమ్మలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నదే నా ఆలోచన.
చిన్నప్పుడు నాతో కలిసి చదువుకున్న స్నేహితులు కొందరు నేడు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడైనా కలిసినప్పుడు ఉదోగ్యం ఎలా ఉందని అడిగితే ‘ఏం ఉద్యోగమే! ఎంత సంపాదించినా ఒకరి కింద బానిసలమే. నీలాగా మేము సొంత కాళ్ల మీద నిలబడలేకపోయాం’ అంటూ పొగిడేస్తుంటారు.